రాత్రికి రాత్రే మార్పు

M NAGESHWAR RAO
M NAGESHWAR RAO

సిబిఐ నూతన డైరెక్టర్‌ గా ఎం.నాగేశ్వరరావు నియామకం
అధికారుల బదిలీలపై తొలి సంతకం
న్యూఢిల్లీ: ఇటీవల సిబిఐ సంస్థలో జరుగుతున్న పరిణామాలు ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. ఈ సంస్థలో ఏం జరుగుతోందని అంతు చిక్కని రహస్యంగా మారింది.ఈ నేపథ్యంలో ఒక్క రాత్రిలోను పరిణామాలు వేగంగా సంభవించాయి. సిబిఐ చీఫ్‌ అలోక్‌వర్మ,ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలను సెలవు పై పంపించారు. రాత్రికి రాత్రి ఎం. నాగేశ్వర రావును సిబిఐ ఛీఫ్‌ గా నియమించాయి, ఇందులో భాగంగా చాల మంది అధికారులను బదిలీలు చేశారు. మొదటి సంతకం అధికారుల బదిలీ ఉత్తర్వుల పైనే ఆయన సంతకం చేశారు. బదిలీ అయిన అధికారులలో రాకేశ్‌ అస్థానా పై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసిన టీం లోని సభ్యులు కూడ ఉన్నారు.ఈ పరిణామ క్రమంలో సంభవించిన పరిణామాలు: సిబిఐ సరళతను,ప్రామాణికతను, నిష్పాక్షితను కాపాడేందుకు డైరెక్టర్‌,ప్రత్యేక డైరెక్టర్‌ ను తొలగించామని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. రాకేశ్‌ అస్థానా అవినీతికి పాల్పడ్డాడని ఆయనపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన విషయం విదితమే, ఈ నేపథ్యంలో సిబిఐ లో గందరగోళం జరగడంపై స్పందించిన ప్రభుత్వం తక్షణమే సిబిఐ ని ప్రక్షాళన చేయాలని భావించింది.ఇందులో భాగంగా అధికార మార్పు, బదిలీల వంటి విషయాలపై రాత్రి ఒంటి గంటకు ఉత్తర్వులు జారీ చేశారు. రాకేశ్‌ అస్థానా అవినీతి అరోపణలపై దర్యాపు జరుగుతున్న సమయంలో ఆయన ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తాను ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సిబిఐ ఛీఫ్‌ అలోక్‌ వర్మ లంచం తీసుకొని, తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లేఖ లో పేర్కొన్నారు.ఈ విధమైన ఆరోపణల వలన ఈ కేసులో నిష్పాక్షికమైన దర్యాప్తు కోసం, ఈ ఇద్దరు ప్రధానాధికారులను సెలవుపై పంపించడం ఆవశ్యం అని, ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకు వారు సెలవులోనే ఉంటారని జైట్లీ పేర్కొన్నారు.ఈ సందర్భంలో అలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానా వారి కార్యాలయాలను వదిలేశారు. అలోక్‌ వర్మతో కలిసి పని చేసిన అధికారులను కొత్త ఛీఫ్‌ గా నియమితులైన నాగేశ్వర రావు బదిలీ చేశారు. అదే విధంగా డైరెక్టర్‌ టీం లో ఉన్న ఒక అధికారియైన ఎ.కె. బస్సీ ని పోర్ట్‌బ్లెయిర్‌ కు పంపించారు. సిబిఐ లోని ఈ ఇద్దరు ప్రధానాధికారులను సెలవు పై పంపించాలని, వీరిద్దరు ఉండగా ఈ దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగదని భారత ఛీఫ్‌ విజిలెన్స్‌ కమీషనర్‌ కె.వి.చౌధురీ ప్రధాన మంత్రికి నరేంద్ర మోదీ కి మంగళవారం సిఫారసు చేశారు.ఈ నేపథ్యంలో రాత్రి ఒంటిగంటకు అలోక్‌ వర్మ,రాకేశ్‌ అస్థానాలను తొలగిస్తున్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సమాచారం అందించారు.రాత్రి రెండు గంటలకు తాత్కాలిక సిబిఐ ఛీఫ్‌ గా నాగేశ్వర రావు సిబిఐ ప్రధాన కార్యాలయంలో నూతన గదిలోకి అడుగు పెట్టారు. ఆయన భాద్యతలు తీసుకున్న తరువాత అధికారుల వరుస బదిలీలపై తొలి సంతకం చేశారు. కాగా గుజరాత్‌ కేడర్‌ కు చెందిన ఐపిఎస్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ అస్థానాను ప్రధాన మంత్రి సిబిఐ లో నంబర్‌-2 స్థానంలో నియమించారు.అస్థానా నియామకంపై వ్యతిరేకత తలెత్తినా అది పట్టించుకోలేదని పైగా ఆయనకు కీలకమైన దర్యాప్తులను అప్పగించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు.అస్థానాను కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.సిబిఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను రెండేళ్ల పదవీ కాలం పూర్తి కాకముందే ఆయనను అర్ధాంతరంగా తొలగించారని, అంతే గాక గ్రూప్‌ లోని సభ్యులైన ప్రధానమంత్రి,సుప్రీం ప్రధాన న్యాయమూర్తి,ప్రతిపక్ష నాయకుడు ను సంప్రదించకుండానే తొలగించారని కాంగ్రెస్‌ తోపాటు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నాయి.ఇది ఇలా ఉండగా మాజీ సిబిఐ ఛీఫ్‌ అలోక్‌ వర్మ తనను సిబిఐ ఛీఫ్‌ గా తొలగించడం పై సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఇది రేపు (శుక్రవారం) విచారణకు రానుంది. అవినీతికి పాల్పడ్డానని తన పై రాకేశ్‌ అస్థానా పరిపక్వత లేని ఆరోపణలు చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.