రాజ‌న్న ఆల‌యంలో ఈ-టికెట్ విధానం

Vemulawada temple
Vemulawada temple

వేములవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈ-టికెట్ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈమేరకు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ సంబంధిత సాంకేతిక నిపుణులతో సమావేశమ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ- టికెట్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో సూచించారన్నారు. అందులో భాగంగా రాష్ట్ర రాష్ట్ర సాంకేతిక‌ విభాగం ప్రాజెక్టు మేనేజర్ రుషిత, ఆడెపు రాజేశ్‌లతో ఆలయంలో జరిగే నిత్యపూజలు, అద్దె గదుల నిర్వహణ, ప్రసాదాల విక్రయాలపై వివరించామన్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన అనంతరం ఆలయంలో ఈ-టికెట్ విధానాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. తద్వారా టికెట్ల విక్రయాల్లో అవకతవకలకు చెక్ పెట్టడమే కాకుండా, రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యసేవల్లో పాల్గొనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. త్వరలోనే ఈ-టికెట్ విధానాన్ని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమలు చేస్తామని స్పష్టంచేశారు.