రాజధాని ప్రాంతంలో పటిష్ట నిఘా

Tite Security in AP CM
Tite Security in AP CM (File)

రాజధాని ప్రాంతంలో పటిష్ట నిఘా

– సచివాలయం వద్ద బందోబస్తు
-గుంటూరు,విజయవాడలో హైఅలర్ట్‌

అమరావతి: సిఎం చంద్రబాబునాయుడు కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ మావోయిస్టు నేతలు బుధవారం చేసిన ప్రకటనతో గుంటూరు,విజయవాడ పోలీస్‌ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వద్ద నివాసం ఉంటున్న ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు భారీ భద్రత కల్పించేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.రాజకీయనాయకుల్ని కూడా టార్గెట్‌ చేస్తామని హెచ్చరించటంతో పోలీసులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని కూడా వారు డిమాండ్‌ చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఆంధ్రా,ఓడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌ను దృష్టిలో ఉంచుకుని నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని విజయవాడ-గుంటూరు సచివాలయం ప్రాంతంలో పోలీస్‌ నిఘాను బుధవారం నుంచే పెంచారు. గతంతో రాజధాని ప్రాంతంలో మావోల కదలికలు ఉండటం,రాజధాని అయిన తర్వాత ఇటీవల పలువురు మావోలు ఈ ప్రాంతంలో సంచరించారనే అనుమానాలు వ్యక్తం కావటంతో పోలీసులు కూడా నిఘాను పటిష్టవంతం చేశారు.ఈ ఎన్‌కౌంటర్‌ను రాష్ట్ర గ్రేహ్యండ్స్‌ దళాలు చేపట్టిన క్రమంలో మావోయిస్టులు ఈ రాష్ట్రంపైనే ఎక్కువ దృష్టి పెట్ట అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటిలిజెన్సీ విభాగాంతో పాటు ఇతర నిఘా విభాగాలను అప్రమత్తం చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి కూడా భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీపాలన వెలగపూడి సచివాలయం నుంచి కనసాగుతోంది.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,రాష్ట్ర మంత్రులు ఇక్కడి నుంచే పాలనలో పాల్గొంటున్నారు.మావోల హెచ్చరికలతో విజయవాడ,గుంటూరు పరిధిలో భద్రతాపరమైన చర్యలను తీసుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.రాజధానిపై మావోయిల కన్నుపడినట్లు కూడా నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని ఇటీవల హెచ్చరించాయి.దీంతో వెలగపూడి తాత్కాలిక సచివాలయాన్ని కూడా సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.ఇదిలా ఉండగా గత మూడు నెలల క్రితం అమరావతి రాజధాని పరిధిలో మహిళా మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు. దీన్ని బట్టి తరుచూ మావోలు ఈ ప్రాతంతో పరిశీలించి ఉంటారని పోలీసులు ధృఢంగా విశ్వసిస్తున్నారు.గత మూడు రోజుల క్రితం ఏవోబిలో గ్రేహౌండ్స్‌ దళాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌కు ప్రతిగా మావోలు ఎలాంటి దాడులకైనా తెగబడే అవకాశం ఉంటుందని ఇంటిలిజెన్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాజధాని ప్రాంతలో నిఘాను పెంచనున్నారు.విజయవాడ,గుంటూరులో హై అలర్ట్‌ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు నిఘాను పెంచారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్లు,కార్యాలయాలు, సీఎం క్యాంపు ఆఫీసు వద్ద భద్రతను పెంచారు.
==================================