రాజకీయాల ఆలోచన లేదు!(లారెన్స్‌)

LARENCE1111
LARENCE

రాజకీయాల ఆలోచన లేదు!(లారెన్స్‌)

అభిషేక్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై రాఘవ లారెన్స్‌, రితిక సింగ్‌ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్‌ పిళ్ళై నిర్మించిన చిత్రం శివలింగ. ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో రాఘవ లారెన్స్‌తో ఇంటర్వ్యూ…

 

సినిమాలో తనే హీరో.. రితిక సింగ్‌ రోల్‌ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో తనే హీరో అని నేను అందరికీ చెబుతున్నాను. తను మంచి ఫైటర్‌ అని అందరికీ తెలుసు. ఈ సినిమాతో తను మంచి డ్యాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకుంటుంది. చాలా మంచి హార్డ్‌ వర్కర్‌. డ్యాన్స్‌ మాస్టర్‌, ఫైట్‌ మాస్టర్‌ అనేది డిఫరెంట్‌ కాంబినేషన్‌. ఇద్దరి మధ్య రిథమ్‌ అనే ఒకేలా ఉంది. గురులో తన రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉండే క్యారెక్టర్‌ చేసింది. శివలింగలో డిఫరెంట్‌గా చేసింది. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో తనను చూసి ఇది నిజంగా రితికయేనా అని అనుకుంటారు. అంత అద్భుతంగా నటించింది. నేను, మా సంస్థల్లోని పిల్లలు దాదాపు అరవైమంది సినిమా చూశాం. సినిమా తర్వాత పిల్లలందరూ రితికకు పెద్ద ఫ్యాన్‌ అయ్యారు. ఆయన చెప్పినదాన్ని కాపీ కొట్టా.. వాసుగారితో పనిచేయడం అంటే నేర్చుకోవడమే. ఈ వయసులో కూడా ఆయన స్పీడుగా ఉన్నారు. ప్రతి సీన్‌లో యాక్టింగ్‌ చేసి చూపిస్తున్నారు. ఆయన చెప్పినదాన్ని కాపీ కొడితే చాలు. చాలా కంఫర్ట్‌గా ఉంది. ఆయన దగ్గర ఓ సీన్‌ను ఎంత స్పీడుగా తీయవచ్చు, ఎంత క్వాలిటీగా ఇవ్వొచ్చు అనేది నేర్చుకున్నాను. ఆర్టిస్టుకు తగ్గట్లు ఫ్రేమింగ్‌ పెట్టారు. వారి ఆశీర్వాదమే.. వాసుగారి దర్శకత్వంలో రజనీకాంత్‌గారు నటించిన ఉళైపాలి అనే చిత్రంలో నేను గ్రూప్‌ డ్యాన్సర్‌గా చేశాను. అలాగే ఆయన డైరెక్షన్‌లో రూపొందిన కుచేలన్‌ సినిమాకు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నేను హీరోగా సినిమా చేయడం అనేది ఆ రాఘవేంద్రస్వామి, మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తాను.

అమ్మగారి విగ్రహం చేయించా.. రాఘవేంద్రస్వామి గుడిని, అలాగే గాయత్రి అమ్మవారి గుళ్ళను నిర్మించాను. గాయత్రి అమ్మవారి గుడిలో మా అమ్మగారి 5 అడుగుల విగ్రహాన్ని పెట్టాను. దీన్ని మే 1న ఓపెన్‌ చేస్తాం. అమ్మ లేకపోతే నేను లేను.. నేను ఈరోజు ఇలా మీ ముందు కూర్చొని ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. పన్నెండేళ్ళ వయసులో నాకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చినప్పుడు అమ్మ ఎంతో కష్టపడింది. మా అమ్మ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. నా సినిమా wస్కిప్టులన్నీ మా అమ్మకు చెబుతుంటాను. ఆమె సలహాలు తీసుకుంటాను. యోగ చేయడం, బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవడం అన్నీ అమ్మ నుండే నేర్చుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడు. అమ్మ రూపంలో మన ముందే ఉంటుంది. నేను ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌ పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించాలన్నా అమ్మనే అడిగాను. ఆమె ఒప్పుకోకపొతే నేను ఎలా ఇన్ని పనులు చేయగలుగుతాను. పది మంది పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించడం స్టార్ట్‌ చేశాను. ఇప్పుడు వంద మంది పిల్లలు అయ్యారు.

స్టార్టింగ్‌లో అమ్మ అందరికీ వంట వండి పెట్టేది. పిల్లలు ఎక్కువ కావడంతో నా స్వంత ఇంటిని ట్రస్ట్‌గా మార్చేసి, అద్దె ఇంటికి వెళ్ళిపోయాం. ఇన్ని పనులు అమ్మ ఒప్పుకోకపోతే నేను ఎలా చేయగలను. 136 మంది పిల్లలకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేయించాం. 60 మంది పిల్లలకు ఆశ్రయం ఇస్తున్నాను. అలాగే 200 స్లమ్‌లోని పిల్లలను కాన్వెంట్‌లో చదివిస్తున్నాను. వారి చదువు వ్యవహారమంతా మా ట్రస్ట్‌ చూసుకుంటుంది. ఇంకో బ్యాచ్‌ రెడీ అవుతుంది. రాజకీయాల ఆలోచన లేదు.. నేను ఏదైనా వ్యక్తిగతంగానే సహాయం చేస్తాను. రాజకీయంగా సహాయం చేయడానికి ఇష్టపడను.

ఇకవేళ నేను రాజకీయాల్లోకి వెళితే, రాజకీయాల కోసమే దానధర్మాలు చేశాడనే పేరు వస్తుంది. అలా పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. హిజ్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ నేనే.. కాంచన సినిమా తర్వాత హిజ్రాలకు నా వంతుగా సహాయం చేస్తున్నాను. వారు పుట్టడమే శాపంగా భావిస్తున్నారు, కానీ వారికి నమ్మకం కలిగించడం కోసం నా ఇంట్లో ఏదైనా మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు వారితో పూజలు చేయిస్తున్నాను. వారికి డబ్బు సాయం చేస్తున్నాను. నా సినిమా స్టార్ట్‌ అయితే కొంత డబ్బు ఇస్తున్నాను. నన్ను చూసి నా ఫ్రెండ్స్‌ అంతా కూడా హిజ్రాలకు ఆర్ధికంగా సహాయం చేస్తున్నారు. అలాగే వారికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా నన్ను నియమించుకోమని అన్నాను. నా ట్రస్ట్‌లో ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వారు ముందుంటున్నారు. నా ట్రస్టులో ముగ్గురు హిజ్రాలు పనిచేస్తున్నారు. బయట కూడా వారికి పని ఇప్పిస్తున్నాం. వచ్చే నెల హిజ్రాలతో ఢిల్లీలో షో చేస్తున్నాం. తదుపరి చిత్రాలు.. నా డైరెక్షన్‌లో నెక్స్‌ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి సినిమా చేస్తాను. అలాగే పూర్తి మదర్‌ సెంటిమెంట్‌పై ఓ సినిమా ఉంటుంది.