రాజకీయాలపై యువత దృష్టి సారించాలి

          రాజకీయాలపై యువత దృష్టి సారించాలి

YOUTH
YOUTH

ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి ముఖ్యమైన ఘట్టంగా భావించవచ్చు. ప్రజల తలరాతను నిర్ణయించబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై చర్చ ముందుకు వస్తుంది. దురదష్టవశాత్తు ప్రస్తుత ఎన్నికల తంతు చూస్తుంటే సగటు మనిషికి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. ముఖ్యంగా పార్టీలు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులకు టిక్కెట్లు కేటాయించడం సర్వసాధారణమైంది. ఇలాంటి నాయకులకు టిక్కెట్లు కేటాయించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎన్నో కోట్లు వెచ్చించి కొనుక్కున్న టిక్కెట్లు అభ్యర్థులు గెలిచిన తరువాత ప్రజా సమస్యలపై పట్టించు కుంటారనుకోవడం మన అమాయకత్వం.

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రానున్న అయిదు ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించ నున్నారో మరో పక్షం రోజుల్లో తేలనుంది. ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు-ఓటములు పక్కన పెడితే ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి ముఖ్యమైన ఘట్టంగా భావించవచ్చు. ప్రజల తలరాతను నిర్ణయించబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై చర్చ ముందుకు వస్తుంది. దురదష్టవశాత్తు ప్రస్తుత ఎన్నికల తంతు చూస్తుంటే సగటు మనిషికి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. ముఖ్యంగా పార్టీలు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులకు టిక్కెట్లు కేటాయించడం సర్వసాధారణమైంది. ఇలాంటి నాయకులకు టిక్కెట్లు కేటాయించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

ఎన్నో కోట్లు వెచ్చించి కొనుక్కున్న టిక్కెట్లు అభ్యర్థులు గెలిచిన తరువాత ప్రజా సమస్యలపై పట్టించు కుంటారనుకోవడం మన అమాయకత్వం. ఎన్నికలను వ్యాపారంగా చూసే నాయకులు పెట్టిన పెట్టుబడికి లాభాలు ఆశిస్తారే కానీ ప్రజలకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపిస్తారనుకోవడానికి లేదు. ప్రతి రాజకీయ పార్టీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసు కోవడమే కానీ ప్రజల మౌలిక అవసరాలపై దష్టి పెట్టటం లేదు. ముఖ్యంగా విద్యా, వైద్యం వంటి అంశాలపై చర్చ మరుగున అనవసర విషయాల గురించిన చర్చ ముందుకు రావడం విచారకరం. నేడు సామాన్యుడి పాత్ర కేవలం ఎన్నికల్లో ఓటు వేయడంవరకే పరిమితమైంది. డబ్బు, హోదాలు చూసి అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించడం మూలంగా సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా అధికారానికి అందనంత దూరంలో ఉండే వర్గాలవారు తమ వాణిని వినియోగించడానికి ఎన్నికలనేవి వేదికగా భావించ వచ్చు.

కానీ నేడు ఉన్న రాజకీయ వ్యవస్థ ఆయా వర్గాల వారిని ఎల్లకాలం నిరాశ, నిస్పృహల్లో ఉండేట్లు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి మౌలిక వసతుల గురించి ఎన్నికల రంగంలో చర్చే లేదు. విద్యా, వైద్యం అందని కుటుంబాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. అటువంటి వారిని రాజకీయ పార్టీలు కేవలం కులం, మతం ప్రాతిపదికన ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి కానీ భావితరాన్ని నిర్ణయించే మార్గనిర్దేశకులుగా చూడటం లేదు. సంక్షేమ కార్యక్రమాలతో ఏదో విధంగా వాళ్లని తమ వలలో బంధించవచ్చనే ధోరణితో వ్యవహరించడం ఏమాత్రం తగదు. ప్రజలను వారి శక్తి సామర్థ్యాలను గుర్తించేట్లు చేసి వారి ఆశయాల సాధనకు తగినటువంటి అవకాశాలను సష్టించాల్సింది పోయి వారిని నిస్తేజంగా మార్చి ప్రభుత్వాల సంక్షేమ పథకాల దన్నుతో జీవించేలా చేయడం ద్వారా అభివద్ధి బాటలో దూసుకెళ్లలేక పోతున్నాం.

సంక్షేమ కార్యక్రమాలు అనేవి దీర్ఘకాలిక అభివద్ధి లక్ష్యాలను దష్టిలో పెట్టుకుని రూపొందించాలే కానీ ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా భావించి రూపొందించరాదు. ఎటువంటి ఉపయోగం లేని ఉచిత హామీల ద్వారా ఆర్థిక వ్యవస్థపై భారమే కాకుండా ప్రజలను సోమరిపోతుల్లా చేసే వీలుంది. ప్రభుత్వం ఖజానా తమ సొంత సొత్తు అన్న ధోరణిలో ఉచిత హామీలు ఇవ్వటం వలన ముఖ్యమైన విధాన నిర్ణయాలపై చర్చించేవారే కరువయ్యారు. దీన్ని పూర్తిగా రాజకీయ నాయకులదే తప్పు అనడానికి లేదు. ఎన్నికల ముందు ఓట్లను అమ్ముకునే ప్రతి ఓటరు బాధ్యత వహించాలి. నిలబడిన అభ్యర్థుల్లో విద్యార్హత, గత చరిత్ర, సమాజంలో ఉన్న పేరు, అభ్యర్థి చేసినటువంటి సామాజిక సేవ, ప్రజా సమస్యలపై ఉన్నటువంటి అవగాహన మొదలైన విషయాలను బేరీజు వేసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు యువతచేతిలో ఉందనేది సుస్పష్టం. కనుక దేశాన్ని అభివద్ధి బాటలో నడిపించాలంటే యువత రాజకీయాల్లో ముఖ్యమైన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఓట్లు నమోదు చేసుకోవడానికే యువత రానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నగరాల్లో ఉండే యువతీ యువకులు రాజకీయాలంటే తమది కాని రంగంగా భావిస్తున్నారు. ముందుగా తమ చుట్టూ జరిగే విషయాలన్నింటినీ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలను అవగాహన చేసుకొని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి ఉంది. టెక్నాలజీ వాడకంలో ముందుండే యువత ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ దగ్గర ఉన్న సాంకేతిక నైపుణ్యం ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాల్లోకి కూడా యువరక్తం రావాల్సి ఉంది.

దూకుడుతో పాటుగా, ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన యువత తమదైన శైలిలో కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. నేటి రాజకీయ వ్యవస్థలో మహిళల పాత్ర నామమాత్రంగానే ఉంది. రాజకీయాల్లో జయలలిత, మమతా బెనర్జీ, సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్‌ వంటివారు తమదైన ముద్ర వేశారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మహిళలు రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి, అక్రమాలు నిరోధించాలంటే నిజాయితీ, నీతి కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల వైపు దష్టి సారించాల్సి ఉంది. స్వార్థం, డబ్బు వ్యామోహం లేని నాయకులే దేశాన్ని ముందుకు నడిపించగలరు. పార్టీలు మారే నాయకులను ఇంటికి సాగనంపాలి. ఇటువంటి సంస్కృతిని నిరోధించాలి. నేడు బడా కార్పొరేట్లు రాజకీయ నాయకులకు ఎన్నికల పెట్టుబడిని సమకూరుస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా రూపొందించే విధంగా ఒత్తిడి చేస్తున్నారు.

ముఖ్యమైన రంగాలను ప్రైవేటుపరం కావడం మూలంగా సామాన్య ప్రజలు, పేదలు కుటుంబ పోషణకే నానా ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లల్లో చేరలేక బడి చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేసిన విధానాల వల్ల విద్యకు దూరమైనవారు కోకొల్లలు. ప్రభుత్వ పాఠాలను ఒక పద్ధతి ప్రకారంగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పాఠాశాలల వైపు చూసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన స్కూళ్లనీ ప్రైవేటువారి చేతిలోనే ఉన్నాయి. ప్రభుత్వాధీనంలో నడిచే బడుల్లో కూడా ఇటువంటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. గ్రామాల్లో అత్యధిక పాఠశాలల్లో నీటివసతి సరిగా లేదు.

అధికార యంత్రాంగం వీటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. నగరాల్లో వలస వచ్చిన ప్రజల ఇబ్బందుల గురించి, వారి దుర్భర జీవితాల గురించి చర్చించే నాయకులు లేనేలేరు.ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరిస్తామని నాయకులు చేసే వాగ్దానాలు నీటి మూటలాగానే మారుతున్నాయి. నగరాల్లో రోడ్ల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉన్నా నాయకులు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం ప్రతి ఉద్యోగస్తుడు తమ వ్యక్తిగత వాహనం ద్వారానే తమ ఆఫీసులకు చేరుతున్నారు. సరిగా లేని రోడ్ల కారణంగా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజా రవాణా వవైపు ప్రజలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది.

తద్వారా కాలుష్యం, రోడ్ల రద్దీ సమస్యలకు పూర్తిగా కాకపోయినా కొంతవరకు పరిష్కరించే వీలుంది. నగరాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనావాసాల గురించి సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సి ఉంది. వర్షాకాలంలో చిన్న వానకే మునిగే లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యల గురించి ఎన్నికల్లో చర్చను తీసుకురావాల్సి ఉంది. ఇవేకాక ఎన్నో విషయాలు ప్రస్తుతం ప్రజలు ప్రచారానికి వచ్చే నాయకులను నిలదీయాల్సి ఉంది. కేవలం ఎన్నికలప్పుడే గుర్తొచ్చే ప్రజలు వారి ఓట్లతో ఎన్నికయ్యే నాయకులను ప్రశ్నించాల్సిన తరుణం ఆసన్నమైంది. 

– సముద్రాల వి.కె