రాజకీయంగా ఎదుర్కోలేక పాత కేసులు తిరగదోడుతున్నారు..

Revanth reddy
Revanth reddy

హైదరాబాద్‌: ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌ రాజకీయంగా తనను ఎదుర్కోలేక పాత కేసులను తిరగదోడుతున్నారని టీ కాంగ్రెస్‌ నేత ఎ.రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవి వచ్చే అవకాశం ఉన్నందున ఈడీ, సిబిఐ ద్వారా ఓటుకు నోటు కేసులో ఇన్‌కంటాక్స్‌ దాడులు చేయించేందుకు మోడీ, కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రద్దుకు ముందు కేసీఆర్‌, కేటీఆర్‌ కొన్నిసార్లు అధికారికంగా, మరికొన్ని సార్లు అనధికారికంగా ఢిల్లీ పర్యటన చేపట్టారని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరిన తరువాత రాణించకుండా కేసీఆర్‌ కుట్ర పన్ని విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో ముందస్తు ఎన్నికల సందర్భంగా రేవంత్‌ రెడ్డికి పదవి ఇస్తే టీఆర్‌ఎస్‌ను అడ్డుకుంటాననే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎ4గా ఉన్న మత్తయ్య క్వాష్‌ పిటిషన్‌ వేస్తే ఎఫ్‌ఐఆర్‌ చేయకుండా అరెస్టు చేయడం అక్రమమని కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. రాబోయే రోజులు అత్యంత కీలకమనీ, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి కేసీఆర్‌కు చట్టాన్ని ఉల్లంఘించి సహకరిస్తున్నారనీ, తనపై విచారణకు పాత తేదీలపై లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. చట్ట వ్యతిరేకమైన చర్యలతో ప్రైవేటు సైన్యంతో డీజీపీ కేసీఆర్‌కు ఖాసిం రజ్వి లాగా చేస్తున్నాడనీ, తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా కేసీఆర్‌, ప్రభాకరరావు, డీజీపీలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌లో తనకు కీలక పదవి వచ్చే అవకాశం ఉందనీ, రాష్ట్రమంతా తిరిగితే టీఆర్‌ఎస్‌ తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి ఏ కేసీఆర్‌ ప్రైవేట్‌ సైన్యానికి అధిపతి అనీ, తనకు పదవి ఇచ్చే రెండు రోజుల ముందే ఈడీ దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. చిప్పకూడు తిన్న విశ్వాసంతో చెబుతున్న మీ పైజామాలు ఊడతాయని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి డీజీపీని హెచ్చరించారు.