రక్తనాళాలు ఉబ్బితే దృష్టి సమస్యలు

EYES
EYES

రక్తనాళాలు ఉబ్బితే దృష్టి సమస్యలు

మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడుతాం. కళ్లలో రక్తపు జీరలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. కనుక ఎదుటి వ్యక్తిలో మనం గమనించేది మొట్టమొదట ఈ లక్షణమే. వయస్సు పెరుగుతున్న కొద్దీ కళ్లు స్వచ్ఛమైన తెలుపును కోల్పోయి క్రమంగా రక్తపు జీరలను సంతరించుకుంటాయి. కోపం, ఉక్రోషం, తమకం వంటి అనేకానేక భావాలు కళ్లలో రక్తపు జీరలుగా ప్రతిఫలిస్తాయి. అలాగే అనేకానేక వ్యాధులు, పరిస్థితులు కళ్లను ఎర్రగా కనిపించేలా చేస్తాయి. కళ్లలో ఎరుపుదనం కనిపించే విధానాన్నిబట్టి సమస్య ఏమిటనేది కొంత వరకూ ఊహించవచ్చు.

ఉదాహరణకు కనురెప్పల కింద రక్త నాళాలు వాచి స్రావయుక్తంగా ఉంటే నేత్రాభిష్యందం (కంజెం క్టివైటిస్‌) వంటి ఇన్‌ఫెక్షన్లకూ, ఇన్‌ఫ్లమేషన్లకూ సూచన. అలా కాకుండా, కంటిలోని కృష్ణ పటలం (ఐరిస్‌) చుట్టూ రక్త నాళాలు ఉబ్బిపోయి, నొప్పిని, దృష్టి సమస్యలను కలిగిస్తుంటే కంటిపైన పారదర్శకంగా ఉండే కార్నియా పొరకు ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చినట్లుగా లేదా కంటిలోపలి నిర్మాణాలు వ్యాధిగ్రస్తమైనట్లుగా అర్థం చేసుకోవాలి. కంటి ఎరుపుదనానికి, రక్తపు జీరలకు వెనుక ఉన్న ఇలాంటి ఆకరణాలను శోధించేందుకు ఈ కింది ప్రశ్నలు తోడ్పడుతాయి. కన్ను అంతా ఎర్రగా కనిపించడంతోపాటు కను రెప్పను లాగి దాని కింద చూస్తే ఒకవేళ మరింత ఎర్రగా కనిపిస్తే అది నేత్రాభిష్యందానికి సూచన. ఎలర్జీ, ఇన్‌ఫెక్షన్లు నేత్రా భిష్యందాన్ని కలిగిస్తాయి. చీము, స్రావాలు ప్రధానంగా ఉంటే ఇన్‌ఫెక్షన్‌గానూ, కేవలం దుర, మెరమెరలాడటం ఉంటే ఎలర్జీ గానూ అర్థం చేసుకోవాలి. నేత్రాభిష్యందం ఉన్నప్పుడు తలారా స్నానం చేయడం, తాంబూలం సేవించడం నిషిద్ధం.

ఉదయం పూట జలనేతి, రాత్రిపూట చల్లటి నీళ్లు తాగడం చేయాలి. అప్పుడే తీసిన వెన్న కంటికి చాలా మంచిది. త్రిఫలాలు, అభ్రకభస్మం, స్వార్ణమాక్టీక భస్మాలను తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల నేత్రాభిష్యందాలు తగ్గుతాయి. బాహ్యప్రయోగంగా ఆయుర్వేదంలో సేకం, ఆశ్చ్యోతనం, పుటపాకం, తర్పణం, అంజనం అనే క్రియా కల్పాలు ఉన్నాయి.

వీటిని అవసరానుసారం చేయాలి. కంటిపైన పలుచగా, పారదర్శకంగా పరుచుకుని ఉండే కంజెంక్టైవా పొర కింద రక్తస్రావం జరిగితే (సబ్‌ కంజెక్టైవల్‌ హెమరేజ్‌) కళ్లు రక్తం ఓడుతున్నట్లు ఎర్రగా కనిపిస్తాయి. కంటి ఉపరితలంపైన ఏ చిన్నపాటి దెబ్బ తగిలినా, ఆ ప్రాంతంలో ఉండే రక్తనాళం చిట్లి రక్తం చుట్టుప్రక్కల ప్రదేశానికి విస్తరిస్తుంది. ఒక్కొక్కసారి కంటిని బలంగా నలుముకున్న తరువాత ఇలా జరిగే అవకాశం ఉంది. కంటి వెలుపలి పొరల్లో పరచుకున్న ఈ రక్తం చర్మంలో కముకు దెబ్బల వలన ఏర్పడే నీలం రంగు మచ్చల్లా కాకుండా, స్వచ్ఛమైన ఎరుపు దనంతో, టొమాటో రంగులో కనిపించడానిక బైటి వాతా వరణానికి దగ్గరగా ఉండి, ఆక్సీకరణం చెందటమే. దెబ్బలు, ఒత్తిళ్ల వల్ల ఏర్పడే ఈ ఎరుపుదనం తగ్గిపోయి కన్ను మామూలు స్థితికి రావడానికి రెండు మూడు వారాలు పడుతుంది. కంటిలోపల ఇన్‌ ఫ్లమేషన్‌ వలన కాని, కంటి లోపలి ద్రవాల్లో ఒత్తిడి పెరిగిపోవడం వలన కానీ, స్వచ్ఛపటలం (కార్నియా) వ్యాధిగ్రస్తమవడం వలన కాని ఇటువంటి ఎరుపు ఏర్పడుతుంది.

ఇలాంటి సమస్యలకు త్రిఫలాగుగ్గులు, సప్తామృతలోహం వంటి మందులు పని చేస్తాయి. ధూళి కణాలు కంటిలో పడినప్పుడు కంటిలోని సున్నితమైన భాగాలు ప్రతిస్పందించి ఎరుపుదనాన్ని, కన్నీళ్లను కలిగిస్తాయి. స్రావాల కారణంగా కంటిలోని నలుసులు పల్చబడి బైటకు వెళ్లి పోవడం కోసం ఇలా జరుగుతుంది. ఒకవేళ ధూళి కణాలు బైటకు వెళ్లిపోకుండా, కంట్లో అలాగే ఉండిపోతే స్వచ్ఛమైన త్రిఫల కషాయాన్ని కంటిలో చిమ్మిచ్చి కొట్టాలి. అయినప్పటికీ, కంటిలోని నలుసు అలాగే ఉండిపోతే ఏదైనా సన్నటి గాజు కడ్డీవంటి దానిని కనురెప్పపైన పెట్టి కనురెప్పలను పట్టుకుని గాజు కడ్డీ ఆధా రంగా తిప్పాలి. తరువాత కంటిలోని నలుసును బట్టతో తొలగించాలి. నొప్పి అనేది ఇన్‌ఫెక్షన్‌కూ, ఇన్‌ఫ్లమేషన్‌కూ సూచన. కంట్లో నలుసులు పడటం, స్వచ్ఛపటలం వ్యాధిగ్రస్తం కావటం, కన్నులోపలి భాగం ఇన్‌ఫ్లేమ్‌ కావడం, కంటిలోపల వత్తిడి పెరగడం తదితర స్థానిక కారణాలే కాకుండా, మధుమేహం, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, సిస్టమిక్‌ ల్యూపస్‌ ఎర్తిమా టోసిస్‌ి వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల వలన కంటిలో ఎరుపుదనం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో కారణానుగుణమైన చికిత్స చేయాలి.