యువతతోనే సుస్థిరాభివృద్ధి!

        యువతతోనే సుస్థిరాభివృద్ధి!

youth
youth

సుస్థిరాభివృద్ధి యువత ద్వారానే సాధ్యమ వ్ఞతుందని గవర్నర్‌ ఇ.యస్‌.ఎల్‌ నరసింహాన్‌ ఉద్బోధించారు. పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల మధ్య అంతరాలు తొలగించేందుకు అందరికి సమాన అవకాశాలు కల్పించేందుకు యువత ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని గవర్నర్‌ సూచించా రు. శాంతి, సామరస్యం, సంతోషం, గెలుపు, తదితర ఐదు లక్ష్యాలను ప్రపంచం తక్షణం సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని కూడా ఆయన అన్నారు.

తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వం సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్‌ యువత ముందు ఉన్న గురుతర కర్తవ్యాలను గుర్తుచేశారు. అంద రికీ సమాన అవకాశాలు దక్కినప్పుడే సమాజం సరైన మార్గంలో నడుస్తుందని, యువత సహనంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యువనాయకత్వం సదస్సులో వివిధ దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇప్పుడే కాదు ఏనాటి నుంచి యువతే జాతి పురోగతికి మూలాధారమని, నేటి బాలలు, యువకులు రేపటి దేశ భవిష్యత్‌ నిర్ణేతలని, యువజన శక్తియుక్తులే దేశానికి బాటలని ఎందరో పెద్దలు వక్కాణిస్తూనేఉన్నారు. ఇందుకోసం ఎన్నో సదస్సులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు అటు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి యువతను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు.

యువజనుల్లో రోజురోజుకు నిరుత్సాహం పెరిగిపోతున్నది. నిరక్షరాస్యులైన యువకులే కాదు ఉన్నత చదువ్ఞలు అభ్యర్థించిన వారు కూడా నిరాశానిస్పృహలకు లోనవ్ఞతున్నారు. నగరాల్లో పట్టణాల్లో ఉన్న యువజనుల పరిస్థితి ఇందుకు మినహాయింపు కాకపోయినా దేశప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చదువ్ఞలకు తగ్గట్టుగా ఉపాధి దొరకకపోయినా జీవించేందుకు అవసరమైన కనీస సంపాదనకు సైతం నోచుకొని దుర్భరపరిస్థితుల్లో కొట్టుకుమిట్లాడుతున్నారు.

డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి గ్రామాల్లో రోజువారీ వ్యవసాయ కూలీకి వెళ్లలేక, ఒకవేళ పరిస్థితుల ప్రభావంతో కూలికి వెళ్లినా అలవాటు లేని పని, కష్టం చేయలేక లక్షలాది మంది యువజనులు ఇబ్బంది పడుతున్నారు. పనిచేసే శక్తి ఉంది. ఉన్నంతలో కొద్దో గొప్పో మేధాశక్తి ఉంది. కష్టపడి పనిచేయాలనే ఉత్సాహం ఉంది. సంఘంలో తమకు స్థానం కల్పించుకోవాలనే తపన ఉంది. అయినా ఏ ఆధారం లేక నిరుత్సాహంగా అర్థాకలితో అల్లాడిపోతున్నారు.

ఇక మెడికల్‌, ఇంజినీరింగ్‌ లాంటి చదువ్ఞలు అభ్యసించిన మెరిక్లాంటి యువతీయువకులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనంతో తాము సొంత గడ్డపై చదువ్ఞకున్నామని వారికి కూడా తెలుసు. ఇక్కడ ప్రజల డబ్బుతో చదివి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సిన యువతరం ఏదో రకంగా విదేశాలకు వెళ్లి తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని అక్కడ సేవలు అందించడానికి ఆరాటపడుతున్నారు.

ఇలా విదేశాలకు వెళ్లుతున్నవారిలో భారతదేశం నుంచే ఎక్కువ ఉన్నారు. అందులోనూ తెలుగు రాష్ట్రాలకు అగ్రస్థానం ఉంది. ఇలా వీరంతా ఎందుకు వెళ్లుతున్నారనేది ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీరంతా ఇక్కడ సేవలు అందించాలనుకున్నా వారికి తగిన వసతులు, వేతనాలు చెల్లించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవ్ఞతున్నాయి. అధునాతన ప్రపంచంలో కాలాన్ని మించిన వేగంతో శాస్త్రసాంకేతిక రంగాలు పురోగమిస్తున్నాయి.

ఆధునిక మానవ్ఞడు అపూర్వమేధాసంపత్తిని సంతరించుకొని శక్తియుక్తులు, ప్రతిభాసామర్థ్యాలతో విశ్వాంతరాలపై సాధిస్తున్న విజయాల వెనుక యువశక్తి పాత్ర అత్యంత కీలకమైందని విస్మరించరాదు. నవభారత నిర్మాణానికి ఉద్యమించి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేయవలసిన పవిత్ర బాధ్యత యువజనుల భుజస్కందాలపై ఉందని, సమాజాన్ని ముందుకు నడిపే శక్తి కొత్త మార్పులకు, జాతి వికాసానికి చేతులు కలిపి దోహదం చేసేది యువజనులనేది నిర్వివాదం.

సామాజిక చైతన్యం, ప్రణాళిక వ్యూహాలతో కాగితాలపై కళాలవిన్యాసంతో సిద్ధించేవి కావని కూడా వాస్తవం. పల్లెపల్లెల్లో ప్రతి బస్తీలో స్థితిగతులను చక్కదిద్ది, ఆర్థికంగా, సామాజికి, సాంస్కృతికంగా యువజనులంతా కృషి చేస్తేనే జాతి ఉజ్వల భవిష్యత్‌ సుసాధ్యమవ్ఞతుంది. ప్రతిగ్రామం ఒక మైక్రోయూనిట్‌గా జనవాసం స్థాయి నుంచి యువజ వికాసం మేళవించి నిరభ్యంతర, నిరంతర, అభ్యుదయ ఉద్యమానికి కలిసికట్టుగా నడుం బిగించిన నాడే ఈ దేశ ప్రగతి అనుకున్న దశలో ఆశించిన రీతిలో అభివృద్ధిచెందుతుంది. కానీ యువత ఆ పరిస్థితిలో లేదు.

నిరాశానిస్పృహల్లో నీరసించిపోతున్నారు. ఈ నిరాశానిస్పృహలు ఎందుకు కలుగుతున్నాయనే అనుమానాలు రాకతప్పదు. అటు గ్రామాల్లోనూ, ఇటు నగరాల్లోనూ యువత కుల,మత,వర్గ,బేధాలన్నది లేకుండా అందరిలోనూ ఇది వ్యక్తమవ్ఞతున్నాయి. కాగితాల్లోకాకుండా వాస్తవాల్లోకి వెళ్లితే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.

ఇవి పాలకులకు కూడా తెలియందికాదు. ఏదిఏమైనా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువనాయకత్వం సదస్సు నిర్వహించడం స్వాగతించాల్సిన అంశం. సదస్సులు, సమావేశాలతోనే కాకుండా యువజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు, జాతివికాసానికి నడుంకట్టేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలి. అప్పుడే ఇలాంటి సదస్సులకు అర్థంపరమార్థం ఉంటుంది.
– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌,హైదరాబాద్‌