యాసంగికి రైతు బందు సిద్ధం

Farmer
Farmer

రూ.5,925 కోట్ల విడుదల
అక్టోబర్‌ నుండి యాసంగి ప్రారంభం
హైదరాబాద్‌: రానున్న రబీ సీజనుకు గాను రెండో విడత రైతు బంధు పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన 5,925 కోట్ల రూపాయల మేర నిధులను ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే వీటిని కార్డుల రూపంలో ఇవ్వాలా లేక చెక్కుల రూపంలో ఇవ్వాలా అనే విషయమై ఇంకా ఖరారు చేయ కాలేదని వ్యవసాయ శాఖ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని వానాకాలం సీజను నుండి ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి మే నెలలో ఎకరానికి నాలుగు వేల రూపాయల మేర పెట్టుబడి సొమ్మును చెక్కుల ద్వారా పంపిణీ చేశారు. ఇప్పుడు రానున్న యాసంగి సీజనుకుగాను ఇప్పటి నుండే రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. వానాకాలం సీజను మాదిరిగానే యాసంగి సీజనులోనూ పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న ప్రతీ రైతుకూ పెట్టుబడి సొమ్మును ఇవ్వనున్నారు. అయితే పథకం ప్రారంభంలో పంట సాగు చేసిన భూములకు మాత్రమే రెండో విడతలో పెట్టుబడి సాయం అందిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుత వానాకాలం సీజనులో ఇచ్చిన రైతులు అందరికీ వ్యవసాయ పంటలను సాగు చేసినా, చేయకపోయినా పెట్టుబడి సాయం అందనుంది. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజనులో 1.08 కోట్ల ఎకరాలు సాధారణ సాగు కాగా, యాసంగి సీజనులో 31.92 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం ఉంది. మొదట్లో ప్రభుత్వం సాగు చేసిన ఎకరాలకు మాత్రమే సాయం అందించాలని భావించింది. కానీ వానాకాలం సీజనులో సాగు చేపట్టిన పత్తి, మిర్చి తదితర పంటలు ఎనిమిది నెలలకు పైగా ఉంటాయి. దీంతో వానాకాలం మాదిరిగా ప్రతీ రైతుకు పంటతో నిమిత్తం లేకుండా నాలుగు వేల రూపాయలను పంట పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. కాగా రెండో విడత పెట్టుడి సాయాన్ని రైతులకు కార్డుల ద్వారా అందచేయాలని రైతు బంధు పథకం ప్రారంభంలోనే ప్రభుత్వం భావించింది. కానీ చెక్కుల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం సొమ్మును అందించడం వల్ల రైతులకు దానిపై అవగాహన ఉందని, ఎవరికి ఎంత సొమ్ము వచ్చిందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు చెక్కుల పంపిణీ సమయంలో గ్రామాల్లో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ సర్వేలు కూడా చెక్కుల ద్వారా పెట్టుబడి సాయం అందించాలనే అభిప్రాయం మెజార్టీ రైతుల నుండి వచ్చింది. ఈనేపథ్యంలో రెండో విడత సాయాన్ని చెక్కుల రూపంలో అందించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున ఒక సీజనుకు పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో గ్రామాలకు చేరవేసింది. గ్రామ సభల ద్వారా సదరు చెక్కులను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అధికారులు రైతులకు ఇప్పటి వరకూ 49 లక్షల చెక్కులను మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 9 లక్షల చెక్కులు పంపిణీ కాలేదు. వీటిలో 1.50 లక్షల చెక్కుల వరకూ చనిపోయిన రైతుల పేర్ల మీద ఉన్నాయి. మరో లక్ష చెక్కులు విదేశాల్లో ఉన్న వారివి కావడంతో వారు వచ్చి తీసుకోలేదు. మిగిలిన చెక్కులను తప్పులు వంటి వివిధ కారణాల వల్ల రైతులు తీసుకో లేదు. దీనికితోడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూములకు సంబంధించిన 91,971 చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ 72,203 చెక్కులను పంపిణీ చేయగా, ఇంకా 19,768 చెక్కులు మిగిలిపోయాయి. దీనికితగినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ పంపిణీ అయిన చెక్కుల్లో మరో రెండు లక్షల చెక్కులు క్లియర్‌ కావాల్సి ఉంది. ఇంత వరకూ పంపిణీ చేసిన చెక్కుల ద్వారా రైతులు 5,100 కోట్ల రూపాయలను నగదుగా మార్చుకున్నారని వ్యవసాయ శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రైతులు ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందచేసిన ఆర్డర్‌ చెక్కులను దాచిపెట్టుకున్నారు. మెదటి విడతలో ముద్రించిన చెక్కుల గడువు తేదీ గత నెల 19వ తేదీతో ముగిసిపోయింది. తదుపరి విడతల్లో ముద్రించిన చెక్కుల గడువు ఈనెల 1,10, 15 తేదీలతో ముగియనున్నాయి. బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండడం, ఇతరత్రా కారణాల వల్ల చెక్కులను ఇంట్లోనే పెట్టుకున్నారు. తీరా గడువు సమయం ముగిసిన తదుపరి బ్యాంకులకు వెళితే సిబ్బంది వాటి గడువు అయిపోయిందంటూ తిప్పి పంపుతున్నారు. తమ చెక్కులను ఏదోవిధంగా చెల్లుబాటు అయ్యేలా చూడాలని నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెక్కుల గడువు ముగింపు విషయంపై వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులను సంప్రదించగా మరో ఆరు రోజుల పాటు గడువు పెంచేందుకు అంగీకరించాయి.