యాషెస్‌కు కెప్టెన్సీ ఇదే తొలిసారిః స్మిత్‌

SMITH
SMITH

పెర్త్ః ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌లకు యాషెస్‌ సిరీస్‌ ఎంత ప్రతిష్టాత్మకమైనదో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జరుగుతోన్న పోరులో మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది ఆసీస్‌. సొంతగడ్డపై పర్యాటక జట్టును మట్టికరిపించి సిరీస్‌ దక్కించుకోవడంతో కంగారూల జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఈ నెల 26న నాలుగో టెస్టు సిడ్నీలో ప్రారంభంకానుంది.
యాషెస్‌ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం ఆసీస్‌ ఆటగాడు స్మిత్‌కు ఇదే మొదటిసారి. తాజాగా స్మిత్‌ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ‘యాషెస్‌ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆదివారం మూడో టెస్టు చివరి రోజు ఆట ముగియగానే సిరీస్‌ గెలిచిన ఆనందంలో ఒక్క నిమిషం ఆనందంతో ఏడ్చేశాను. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. ఆ భావాన్ని ఎలా వివరించాలో అర్థంకావడం లేదు. సొంతగడ్డపై సిరీస్‌ గెలవాలని జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఎంతో కష్టపడ్డాడు. దేశం కోసం చాలా శ్రమించాం. తొలిసారి ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు నా మార్క్‌ ఏమిటో చూపించాలనుకున్నా. మంచి ఫలితాలు రాబట్టాలనుకున్నా. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. డ్రస్సింగ్‌ రూమ్‌లో అందరం ఎలా ఆడాలన్న దానిపైనే ఎక్కువగా చర్చించుకునేవాళ్లం’ అని స్మిత్‌ తెలిపాడు.