యధేచ్ఛగా నకిలీ నోట్లు

FAKECURRENCY

– బంగ్లాదేశ్‌ కేంద్రంగా చెలామణి
– ఆర్‌బిఐని తాకుతున్న నకిలీ కరెన్సీ
– దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు దాయాది దేశం కుట్ర?
విశాఖపట్నం : భారత ప్రభుత్వ కరెన్సీని అచ్చుపోలినట్టు ఉండే నకిలీ కరెన్సీ వివిధ రాష్ట్రాల్లో యధేచ్ఛగా చలామణి అవ్ఞతోంది. దేశంలో పది శాతం వరకూ నకిలీ నోట్ల చెలామణిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ పదిశాతం కూడా ఆర్‌బిఐ ద్వారా రాష్ట్రాల్లోని వివిధ పోలీసు స్టేషన్లకు బ్యాంకు మేనేజర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా దాయాది దేశం భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి నకిలీ కరెన్సీని బంగ్లాదేశ్‌ కేంద్రంగా భారతదేశంలోకి ప్రవేశ పెడుతున్నట్టు ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి బ్యాంక్‌ అధికారులు కూడా పోల్చలేని స్థితిలో నకిలీ కరెన్సీ చెలామణి అయిపోతోంది. గతంలో నకిలీనోట్ల ముఠాలు భారతదేశంలో చెలామణి అవ్ఞతున్న కరెన్సీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అసలు పోలిన నకిలీలను తయారుచేసి మార్కెట్‌లోకి కొన్ని బృందాల ద్వారా పంపిణీ చేసేవారు. వాస్తవానికి ఈ తరహా ముఠాలను మాత్రమే పోలీసు శాఖ పట్టుకోగలుగుతోంది. ఈ ముఠాలను అరెస్టు చేసినప్పుడు వారి వద్ద వున్న స్కానర్లను ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనపరుచుకుంటున్నారు. అక్కడితో పోలీసుల దర్యాప్తు పూర్తి అవుతోంది. బంగ్లాదేశ్‌ కేంద్రంగా చలామణి అవుతున్న నకిలీ కరెన్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చుకోలేని విధంగా భారత కరెన్సీని అచ్చుపోలినట్టు ఉండటంతో పోలీసు అధికారులు సైతం ఈ నోట్లను గుర్తించడంలో విఫలమవుతున్నారు. గత మూడేళ్ళుగా విశాఖనగరంలో భారీ స్థాయిలో బంగ్లాదేశ్‌ నుంచి రవాణా అవుతున్న నకిలీ నోట్ల ముఠాను పట్టుకోగలిగారు. ఈ దర్యాప్తులు కూడా అరెస్టులతోనే ముగిసిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి దాయాది దేశం నుంచి రవాణా అవుతున్న ఈ నోట్ల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్ధ నిర్వీర్యం అవుతోందని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా ఈ నకిలీ నోట్లు నేరుగా ఆర్‌బిఐకి కూడ చేరుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే తెలుస్తోంది. ఒక్క విశాఖ నగరంలోనే ఆర్‌బిఐ సూచనల మేరకు వివిధ జాతీయ బ్యాంకులు పోలీసులకు బ్యాంకుల్లో వచ్చిన నకిలీ నోట్లకు సంబంధించి ఫిర్యాదులు చేశారు. మూడేళ్ళలో దాదాపు మూడొందలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కూడా తూతూ మంత్రంగానే బ్యాంకు అధికారులు తప్పని పరిస్థితుల్లో ఇస్తున్న ఫిర్యాదులుగానే పోలీసులే చెప్తున్నారు. ఈ కేసులకు సంబంధించి తదుపరి దర్యాప్తులు ఉండటం లేదన్న బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి పోలీసు శాఖ వారి పరిధిలో మాత్రమే కేసులు నమోదు చేసి దర్యాప్తులు చేయగలుగుతున్నారు. వాస్తవానికి దాయాది దేశం నుంచి నకిలీ నోట్లు బంగ్లాదేశ్‌ మీదుగా వస్తున్నట్టు పోలీసులు గుర్తించినప్పటికీ బంగ్లాదేశ్‌లో ఉండే కీలక సూత్రదారులను పట్టుకునే అవకాశం వీరికి లేకుండా పోతోంది. వాస్తవానికి ఈ తరహా కేసులు చూసేందుకు ఉగ్రవాద నిరోధక ప్రత్యేక దళాలు మాత్రమే ఈ తరహా కేసులకు సంబంధించి దర్యాప్తును కొనసాగించగల అవకాశం ఉంది. ముఖ్యంగా ఆక్టోపస్‌ లాంటి కొన్ని సంస్థలు వీటి మీద ప్రత్యేక నిఘా పెట్టగలిగితేనే బంగ్లాదేశ్‌ కేంద్రంగా సాగుతున్న ఈ ముఠాల ఆటలను కట్టడి చేయవచ్చు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తగుచర్యలు తీసుకొని వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు కొన్ని రకాల దర్యాప్తు ఆదేశాలు ఇవ్వగలిగితే స్థానిక పోలీసులు కూడా వీటిపై దర్యాప్తుకు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ నకిలీ నోట్ల చెలామణి విజయవాడ, నెల్లూరు, కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా ఇటీవల వెలుగుచూశాయి. ఇప్పటి వరకూ బంగ్లాదేశ్‌ నుంచి రవాణా అవుతున్న ఈ నకిలీ నోట్లకు సంబంధించి ముఠాలోని కీలక సూత్రధారులను పట్టుకున్న దాఖలాలు మాత్రం లేవని చెప్పాలి. వాస్తవానికి ఈ ముఠాలు స్థానికులను వినియోగించుకొని నోట్ల చెలామణి చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థికవ్యవస్థ మరింత క్షీణించే అవకాశం ఉందని మేధావి వర్గాలు సూచిస్తున్నాయి. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సిందే.