మ‌హిళ‌ల‌కు వి-హ‌బ్‌

Amitab kanth and KTR
Amitab kanth and KTR

హైద‌రాబాద్ః హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇంట్రపెన్యూర్ సదస్సుకు అంతర్జాతీయంగా లభించిన స్పందన, తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు లభించిన ప్రచారంతో తెలంగాణ ప్రభుత్వంలో ఉత్సాహం కదం తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మూడు ప్రత్యేక చర్యలను ప్రకటించారు.
స్వల్ప కాలంలోనే సంచలనంగా మారిన టి-హబ్‌ తరహాలోనే ‘వి’ (డబ్ల్యూఇ-విమెన్ ఇంట్ర‌ప్రెన్యూర్‌) హబ్‌ పేరుతో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వారికి ప్రత్యేకంగా మెంటార్‌షిప్‌ కోసం చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సు ముగిసిన తర్వాత నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిధుల విషయంలో అవరోధాలు ఎదురు కాకుండా రూ.15 కోట్ల మూలధనంతో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ‘‘ప్రారంభ అవరోధాలను దాటేందుకు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ నిధి నుంచి రూ.25 లక్షల నుంచి రూ. కోటి వరకు సమకూరుస్తారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 20 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి జరగాలన్న నిబంధన ఉంది.
ఈ 20 శాతం వాటాలో నాలుగో వంతును మహిళలు నిర్వహించే చిన్న పరిశ్రమల నుంచి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని తెలిపారు. టి-హబ్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని, ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో టి-హబ్‌ నమూనాలనే అనుసరిస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. జీఈఎస్‌ ఘన విజయం నేపథ్యంలో తెలంగాణలోనూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న భావనతో ఈ ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్టు ప్రకటించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు. కాగా మహిళా పారిశ్రామికవేత్తలకు ‘వీ హబ్‌’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంతో నీతి ఆయోగ్‌ సీఈవో కాంత్‌ కూడా స్పందించారు. నీతి ఆయోగ్‌లోనూ ప్రత్యేకంగా విమెన్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.