మ‌జ్లిస్‌ లేకుంటే గులాబీ గూటికిః రాజాసింగ్‌

Raja singh
Raja singh

హైదరాబాద్: మజ్లిస్‌ను పక్కన పెడితే టీఆర్‌ఎస్‌లో చేరతానని ఎమ్మెల్యే రాజాసింగ్‌ చెప్పారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ తిప్పేది మజ్లిస్ పార్టీయేనని ఆయన అన్నారు. కేసీఆర్‌ 80 శాతం మంచి పనులు చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. చిన్నప్పుటి నుంచే తాను గోరక్షకుణ్ని, సేవకుడినని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. చట్ట ప్రకారమే మేం గోవధను అడ్డుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. తన పోరాటం వెనుక బీజేపీ లేదని, అమిత్ షా లేరని వెల్లడించారు. గోరక్షణకోసం రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తోందని ఎద్దేవా చేశారు. తనది రాజకీయం కాదని, హిందూ ధర్మం మాత్రమేనని రాజాసింగ్ తెలిపారు. గోవు తన తల్లితో సమానమని, అలాంటి గోవును తినే వాళ్ల ఓట్లు తనకొద్దని చెప్పారు. గోరక్ష పేరుతో దళితులపై దాడులు చేస్తున్నామన్నది తప్పుడు ప్రచారమన్నారు. తమ గోరక్ష పోరాటంలో దళితులు ఉన్నారని రాజాసింగ్‌ స్పష్టం చేశారు. తనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను, ప్రసంగాలను వక్రీకరిస్తూ బీజేపీకికి తన వల్ల చెడ్డ పేరు వస్తోందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి రాజీనామా చేసి సంతోషంగా ఉన్నానని రాజాసింగ్‌ తెలిపారు. హైదరాబాద్ లోక్‌సభకు పోటీ చేయనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మైనార్టీ ఓట్లు చీలితేనే మజ్లిస్‌ ఓడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముస్లిం వ్యక్తికి టికెట్‌ ఇస్తే బీజేపీ గెలుస్తుందని, ఇదే విషయం అమిత్‌షాకు చెప్పానని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం పదవులను, కుటుంబాలనూ త్యాగం చేస్తామని చెప్పారు. ఆత్మరక్షణకోసమే ఆయుధ శిక్షణ తీసుకుంటున్నామన్నారు. తమ ధర్మాన్ని కాపాడుకోవడంలో ఇది తప్పు కాదని రాజాసింగ్ అన్నారు.