మౌనం సత్య సాక్షాత్కారాన్నిస్తుంది

    మౌనం సత్య సాక్షాత్కారాన్నిస్తుంది

GURUKULAM
GURUKULAM

సాధారణంగా ఆధ్యాత్మిక ప్రసంగాలను చేసే గురువ్ఞలను గూర్చి వినియుంటాము. వారి ప్రసంగాలచే ఆకర్షింపబడి వేలమంది వారికి శిష్యులుగా కావటం, ఆశ్రమాలు వెలయటం వాటికి వచ్చే విరాళాలతో అన్నదానాలు చేయటం, విద్యాలయాలను నెలకొల్పటం, వైద్యాల యాలను స్థాపించటం-ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక ఆ ఆశ్రమాల్లో భజనలు, కీర్తనలు జరగటం, ప్రాణాపాయం-యోగం-ఆసనాలు నేర్పించటం జరుగుతుంటుంది. అయితే ఓషో (రజనీష్‌) లావోట్జూను గూర్చి చెప్పే విషయాలు వింటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. లావోట్జూకు వేలమంది శిష్యులుండేవారు.

శిష్యులతో పాటు లావోట్జూ ఒక ప్రదేశంలో మౌనంగా కూర్చొనేవాడు. ఎలాంటి ఉపన్యాసము ఉండేది కాదు. ప్రతిదినము గంటల తరబడి ఆయన, ఆయన శిష్యులు మౌనంగా కళ్లుమూసుకొని కూర్చొనేవారు. ఎలాంటి చర్చగానీ, ప్రశ్నలు వేయటం గానీ, జవాబులు చెప్పటంగానీ, పాటలు పాడటం గానీ, భజనలు చేయటం గానీ, ఏవీ ఉండేవి కావ్ఞ. ఆ మౌనంలో మాటలకందని, ఆలోచనలకు అతీతమైన ఏ వ్యవహారం ఆ గురుశిష్యుల మధ్య నడిచేదోగానీ అందరూ తృప్తిగా, హాయిగా ఆనందంగా లేచి వెళ్లిపోయేవారు.

సత్యాన్ని దర్శించటానికి, ఆస్వాదించటానికి అదొక్కటే మార్గమని వారికి తెలుసు. శాస్త్రంగానీ, గురువ్ఞగానీ సత్యాన్ని ఉన్నదున్నట్టు ఎవ్వరికీ అందించటానికి వీలుకాదు. గ్రంధాలలో సత్యాన్ని గూర్చి ఉంటుంది గానీ సత్యమే ఉండదు. ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంస వర్షపాతము ఎంత ఉందో పంచాంగాన్ని చూసి చెప్పు అన్నాడట ఒక అనుచరునితో. అతడు పంచాంగాన్ని చూసి ‘ఇంత వర్షము పడవచ్చు అని చెప్పాడట. రామకృష్ణుడు ఆ పంచాంగాన్ని చేతిలోకి తీసుకొని దాన్ని బాగా పిండి ”ఏదీ! ఒక చుక్క కూడా పడలేదే! అన్నాడట.

సాక్షాత్కారము తప్ప వేదశాస్త్రాలు ఒక నిజమైన భక్తుని కోరికను తీర్చి తృప్తి కలిగించలేవ్ఞ. నీరు, నీరు అని మనం ఎన్ని వేలసార్లు అనినా మన దప్పిక తీరదు. నీటిని తాగితేనే మన దప్పిక తీరుతుంది. అన్నము, అన్నము అని మనం ఎన్నికోట్ల సార్లు పలికినా మన ఆకలి తీరదు. అన్నాన్ని తింటేనే మన ఆకలి తీరుతుంది. ఎన్ని శ్లోకాలు కంఠస్థం చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పుణ్యతీర్థాలు దర్శించినా, ఎన్ని పుణ్యనదుల్లో మునకలు వేసినా, ఎన్ని పూజలు చేసినా మనకు ఆధ్యాత్మికం కలుగదు, మనశ్శాంతి దొరకదు.

ఇంద్రియాతీతమైన, వర్ణనాతీతమైన సత్యాన్ని చవిచూసినప్పుడే అఖండమైన ఆనందం, అవగాహనకు అందని పరమశాంతి లభిస్తుంది. అది జరిగేది స్వచ్ఛమైన మౌనంలోనేగాని మాటల్లో కాదు, మంత్రాల్లో కాదు. అందుకే లావోట్జూ ఏ ఉపన్యాసాలూ ఇచ్చేవాడు కాడు, ఏ గ్రంథాలూ రాసేవాడు కాడు. ఎనభై ఏండ్ల వయస్సులో హిమాలయ పర్వత శిఖరంలో మౌనంగా శాశ్వతనిద్రలోకి పోదలచి అటువైపు నడిచాడు.

విషయం తెలిసికొన్న చైనా చక్రవర్తి-(ఆయన కూడా లావోట్జూ శిష్యుడే) ఆయన్ను అడ్డగించమని తన భటులను ఆజ్ఞాపించాడు. లావోట్జూ భావితరాల శ్రేయస్సు దృష్ట్యా తనకు కలిగిన సత్యదర్శనానుభవాన్ని గ్రంథస్థం చేస్తే తప్ప ముందుకు పోనివ్వవద్దన్నది ఆ చక్రవర్తి భటులకు ఇచ్చిన ఆజ్ఞ. హిమాలయాల దరిదాపుల్లో భటులు సవినయంగా లావోట్జూను అడ్డగించారు. వారి చక్రవర్తిగారి ఆజ్ఞను ఆయనకు విన్నవించారు. ఒక గ్రంధాన్ని రాసిపోవలసిందిగా విన్నవించారు. రాయక తప్పలేదు లావోట్జూకు. ఒక చిన్న పుస్తకాన్ని రాశాడు.

అందులోని మొదటి వాక్యం-”సత్యము ఉన్నది-కానీ దాన్ని గూర్చి చెప్పటానికి ప్రారంభిస్తూనే అది అంతర్థానమవ్ఞతుంది. ఏమాట చివరకు నేను చెప్పేది కూడా దాన్ని చూపలేదని గుర్తుంచుకొని చదవండి-అని రాశాడట. సత్య దర్శన విషయంలో మౌనం ప్రాధాన్యతను మాటల నిష్ప్ర యోజనాన్ని చక్కగా గ్రహించిన రమణ మహర్షి ఏనాడూ ప్రసంగాల జోలికి వెళ్లలేదు.ఆయన దానికి అంగీకరించలేదు. ఎవరైనా ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తారని ఆయనకు చెప్పినప్పుడు, ”ఉన్నది మౌనం, ఏమిటని గూర్చి ఉపన్యసిస్తారబ్బా!అని ఏ వారు ఆ మహర్షి.

శాస్త్రాలు, ఉపన్యాసాలు ‘గొప్ప పండితుడన్న పేరు, ప్రతిష్ఠలను, సన్మానాలను-సత్కారాలను తేవచ్చు. మౌనం సత్య సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. మౌనం అఖండానందాన్ని అందిస్తుంది. ఆ తర్వాత ఎన్ని ఉపన్యాసాలిచ్చినా, ఎన్ని గ్రంథాలు వ్రాసినా మన ప్రాధా న్యతను, మాట నిష్ప్రయోజనతను మనం మరచిపోక, ఇతరులకు గుర్తుచేస్తూ పోతే మంచిదేకాదు.

– రాచమడుగు శ్రీనివాసులు