మోసం రూ.11వేల కోట్లు…బీమా రూ.2 కోట్లు!

punjab national bank
punjab national bank

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో జరిగిన రూ.11వేల కోట్ల భారీ కుంభకోణం బ్యాంకింగ్‌ రంగంలోనే సంచలనం సృష్టిస్తోంది. బ్యాంకుల్లో ఉద్యోగుల ద్వారా ఏదైనా మోసం జరిగితే బీమా వచ్చేలా పిఎన్‌బి చేసింది. కానీ ఆ బీమా ఎంతో తెలుసా? కేవలం రూ.2 కోట్లు మాత్రమే. అంటే రూ.11వేల కోట్ల మోసం జరిగితే. అందుకు బీమా కింద బ్యాంకుకు వచ్చేది రూ.2కోట్లే! అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపరిహార బీమా పాలసీ కింద వాణిజ్య, బిల్‌ డిస్కౌంటింగ్‌, సైబర్‌ బీమా కింద ప్రత్యేకంగా ఈ సదుపాయాన్ని తీసుకున్నాయి. కానీ పిఎన్‌బి మాత్రం అలా చేయలేదు. ఈ బీమాను మూడు ప్రభుత్వ రంగ ఇన్యూరెన్స్‌ కంపెనీలుఇస్తున్నాయి. యునైటెడ్‌ ఇండియా అధికారి చెప్పిన వివరాల ప్రకారం, పిఎన్‌బి బ్యాంకర్‌ నష్టపరిహార పాలసీ కింద రూ.5కోట్ల ప్రీమియంను చెల్లిస్తోంది. ఈ పాలసీ మొత్తం బీమాను కల్పించదు. ఆస్తి నష్టం, అగ్నిప్రమాదం, దోపిడీ, మోసాల కింద ఈ బీమా నిర్దిష్ట పరిమితులను మాత్రమే కవర్‌ చేస్తోంది. అలా పిఎన్‌బి ఉద్యోగులు ఏదైనా మోసానికి పాల్పడితే వచ్చే బీమా రూ.కోట్లు మాత్రమేనట. పిఎన్‌బిలో మోసం 2011నుంచి జరుగుతోందని వాళ్లే చెబుతున్నారు. కానీ పిఎన్‌బి మేం బీమాను రెండేళ్ల నుంచి మాత్రమే అందిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. పిఎన్‌బిలోని ఓ బ్రాంచీలో రూ.11,400కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగిన విషయం తెలిసిందే. కొంత మంది ఖాతాదారులకు లబ్ధి చేకూర్చేందుకు తమ సిబ్బంది తప్పుడు లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ (ఎల్‌ఒయు)ల ద్వారా కుట్ర పన్నినట్లు పిఎన్‌బి చెప్పింది. ఈ ఎల్‌ఒయుని చూపించి విదేశాల్లో భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. అలా ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ తదితర 30బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. పిఎన్‌బి మధ్యవర్తిగా ఉండి రుణాలు ఇప్పించిన బ్యాంకులన్నింటికీ రూ.11వేల కోట్ల మొత్తాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకే చెల్లించాలని ఆర్‌బిఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.