మేలుకోకుంటే మాదకద్రవ్యాలతో ముప్పే..

       మేలుకోకుంటే మాదకద్రవ్యాలతో ముప్పే..

drugs
drugs

మాదకద్రవ్యాల వ్యసనం వినాశనానికి దారితీస్తుందని, దాన్ని సమష్టిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఎంతో కాలంగా పాలక పెద్దలు పదేపదే చెప్తున్నా అంతకు రెట్టింపు స్థాయిలో ఏడాదికేడాదికి విస్తరిస్తున్నది. అన్నిటి కంటే ఆందోళన కలిగించే అంశం ఈ వ్యసనం ఇరవై ఏళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అభం శుభం తెలియని ఏడు, ఎనిమిది తరగతులు చదువ్ఞ తున్న విద్యార్థులకు కూడా చాక్లెట్లు,తినుబండారాల్లో కలిపి అలవాటు చేస్తున్నారు. తర్వాత క్రమేపీ వారు దానికి బానిసలైపోతున్నారు. ఇలా వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ఒక వ్యూహం ప్రకారం ఈ వ్యాపారస్తులు నగరాలు, పట్టణాలే కాదు పల్లెలకు కూడా విస్తరిస్తున్నారు.

దీంతో నేరాల సంఖ్య అదుపులేకుండా పెరిగిపోతున్నది. మత్తులో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితుల్లో చేయరాని, చేయకూడని పనులకు పాల్పడుతూ అవి కప్పిపుచ్చుకునేందుకు హత్య లు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక్కడా అక్కడా అనికాదు. అనేక దేశాలతోపాటు ఇటు తెలంగాణా లోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల అటవీ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల ముఠాలు ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయి. మెక్సికోలోనే మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారం విలువ ఏటా పదిహేనువేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని అనధికార అంచనా.

ఇది ఏడాదికేడాదికి పెరిగిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా మత్తుమందుల వినియోగదారుల సంఖ్య అనేక కోట్లకు ఎగబారిందని, మాదకద్రవ్యాల నేరాల విభాగం లెక్కలే వెల్లడిస్తున్నాయి. భారత్‌లో గత పదేళ్ల క్రితం నిర్వహిం చిన ఒక సర్వేలో ఈ మత్తు బానిసలు దాదాపు పదికోట్ల మందికిపైగా ఉండవచ్చుననే అంచనాలు బట్టి తెలుస్తు న్నది. అంతర్జాతీయంగా హెరాయిన్‌ వాడకం దాదాపు నాలుగువందల టన్నులకు మించిందని, మాదకద్రవ్యాల ప్రపంచ అధ్యయన సంస్థ నివేదిక (వరల్డ్‌ డ్రగ్‌రిపోర్టు) ద్వారా వెల్లడైంది. భారత్‌సహా అమెరికా, బల్గేరియా, ఆప్ఘన్‌, టర్కీ, తదితర దేశాల్లో మాదకద్రవ్యాల వ్యాపా రం విచ్చలవిడిగా జరుగుతున్నది. మానసిక, శారీరక రుగ్మతలను అంటకడుతున్నది.

భారత్‌లో ప్రతి ఇరవై మందిలో ఒకరు ఆల్కాహాలు, ప్రతి నలభై మందిలో ఒకరు ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడుతున్నారనేది ఆందోళన కలిగించే అంశం. మెదడు, గుండె,జీర్ణాశయం, కాలేయం వంటి శరీర భాగాలపై దీని ప్రభావం చూపి రోగగ్రస్తులు అవ్ఞతున్నారు. ఒంటరితనం భరించలేకనో, వివిధ రకాల ఒత్తిడిలను తట్టుకోలేక యువత మాదక ద్రవ్యాలవైపు మొగ్గుచూపుతున్నది. నల్లమందుతో ఆరోగ్యాన్ని సర్వనాశం చేసుకుంటున్న యువత పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు.ఈ జాబితాలో భారత్‌తోపాటు కజికిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఉన్నాయి. మొత్తానికి భారత్‌ మత్తుపదార్థాలకు అతిపెద్ద మార్కెట్‌గా తయారైంది.

హుక్కాకేంద్రాలు, వ్యాయామశాలలు, కొన్ని రెస్టారెంట్లు, విద్యాలయాలు, రైతుబజారులు తదితర ప్రాంతాల నుంచి దాటి పుణ్యక్షేత్రాల్లో ఈ జాఢ్యం విస్తరించిపోయింది. ఆయా నగరాల్లో, పట్టణాల్లోని పిల్లలు మాదకద్రవ్యాల మాఫియా ముఠాలు లక్ష్యంగా చేసుకొని ఒక వ్యూహం ప్రకారం ఉచ్చులోకి దించి వ్యాపారాన్ని పెంచుకుంటున్నా రని ప్రణాళిక సంఘం అధ్యయన బృందం స్పష్టం చేసింది. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటుటైన జాతీయ సంఘం గత ఐదేళ్ల క్రితం వెలువరించిన నివేదిక అంశాలు దిగ్భ్రాంతే కాదు ఆవేదన, ఆందోళన కలిగిస్తున్నాయి.

పదిహేను నుంచి పంతొమ్మిది ఏళ్ల మగపిల్లలు దాదాపు ఇరవై శాతం పొగాకు, పదకొండు శాతం ఆల్కాహాలు వినియోగిస్తున్నారని, అదే వయస్సులో ఉన్న ఆడపిల్లలు మూడున్నరశాతం, ఒకశాతం వినియోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. పదిహేనేళ్లలోపే ఓపిఎం, హెరాయిన్‌ లాంటి మాదక ద్రవ్యాలు విరివిగా వాడుతున్నారని, ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి. దేశంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా అవ్ఞతున్నా కేంద్ర పెద్దలు దీనిని నియంత్రించ డంలో కానీ, నిరోధించడంలో కానీ విఫలమవ్ఞతున్నారనే చెప్పొచ్చు. పోలీసులు ఈ వ్యాపారులను అరెస్టు చేసి జైళ్లకు పంపించినా, శిక్ష అనుభవించి వచ్చి తిరిగి అదే వ్యాపారంలో కొనసాగుతున్నారు.

వినియోగదారులకు కూడా అంచలంచెలుగా ఒక వ్యూహం ప్రకారం అందించ గలుగుతున్నారు. అందులో కొందరు రాజకీయ ప్రముఖులతోపాటు, అధికారులు, సినీప్రముఖుల పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాదకద్రవ్యాల నియంత్రణపై గట్టి ప్రయత్నమే చేసింది. ఎందుకోఏమోకానీ ఆ కేసులు, ఆ విచారణలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మత్తుపదార్థాల సరఫరా, విక్రయాలకు సంబంధించి ఏటా ముప్ఫైవేల మందికిపైగా అదుపులోకి తీసుకుంటున్నామని అమెరికన్‌ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ప్రకటించింది.

మనదేశంలో అలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు సంబంధించి నైజీరియన్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఏదిఏమైనా యువత భవిష్య త్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ మాదకద్రవ్యాలసవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవలసిన తరుణమిది. మాటలతో కాకుండా ఆచరణలో చూపి నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యతను ప్రభుత్వంపైనే వదిలిపెట్ట కుండా స్వచ్ఛంద సంస్థలు, పౌరులందరూ కలిసికట్టుగా త్రికరణశుద్ధిగా మాదకద్రవ్యాల నిర్మూలన యజ్ఞంలో పాల్గొంటే తప్ప ఈ ముప్పు తప్పే అవకాశం లేదు.
– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌