మెట్రో కారిడర్లలో ఆర్టీసి ప్రత్యేక దృష్టి

TSRTC
TSRTC

-ప్రతిస్టేషన్‌కు అనుసంధానంగా బస్‌స్టాఫ్‌ల నిర్మాణం
-మెట్రో, ట్రాఫిక్‌ అధికారులతో ఆర్టీసి చర్చలు
-ప్రయాణీకుల డిమాండ్ల మేరకు బస్‌సర్వీస్‌ సేవలు
హైదరాబాద్‌: ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసి నూతన పద్దతిని అవలంభించబోతుంది.
గ్రేటర్‌లో మెట్రో జోరందుకున్న నేపధ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా బస్‌స్టాపులను నిర్మించాలని గ్రేటర్‌ ఆర్టీసి నిర్ణయించుకుంది. ఇప్పటికే దీని కోసం ఆర్టీసి అధికారులు.. ఇటు మెట్రో, అటుట్రాఫిక్‌ అధికారులతో చర్చలు నిర్వహిస్తున్నారు. మెట్రోస్టేషన్‌కు ఎంత దూరంలో బస్‌స్టాపులను నిర్మించాలి? ఎక్కడ నిర్మిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడదు? ఏయే మార్గాలలో ప్రయాణీకులు రద్దీ అధికంగా ఉంటుంది? ప్రయాణికులు ఎక్కడ దిగి బస్‌స్టాప్‌లకు సులభంగా చేరుకుంటారు? ఏ మార్గాలలో బస్సు సర్వీసులను నడిపితే అధిక ఆక్యూపెన్సీ సాధించగలం అనే తదితర అంశాలపై ఆర్టీసి అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన మియాపూర్‌-నాగోల్‌ కారిడర్లలో తరచూ తిరిగే బస్‌సర్వీసులు ఉన్నప్పటికీ, మరి కొన్ని బస్‌లను పెంచే దిశగా ఆర్టీసి అడుగులు వేస్తోంది. అదే విధంగా జూలై చివరి నాటికి మొదలయ్యే ఎల్‌బీనగర్‌- అమీర్‌పేట్‌ కారిడర్లలో ప్రత్యేక బస్‌సర్వీస్‌లను తిప్పాలని ఆర్టీసి ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే ఈ రూట్లపై సర్వేను కూడా చేపట్టనుంది. ముఖ్యంగా ఎల్‌బీనగర్‌-అమీర్‌పేట్‌ కారిడర్‌ మార్గంకు దగ్గరగా ఉన్న బస్తీలు, కాలనీల నుంచి ప్రారంభానికి ముందే ఫీడర్‌ సర్వీస్‌లను నడిపించేలా ఆర్టీసి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మియాపూర్‌ రూట్లలో ఆర్టీసి నిత్యం 100 బస్సులను 600కిపైగా ట్రిప్పులు నడుపుతుంది. అంతేకాకుండా మరికొన్ని అదనపు బస్‌సర్వీస్‌లను నడపాలని, ప్రయాణీకులకు మరింత సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తూ… పలు మార్పులు చేయాలని గ్రేటర్‌ ఆర్టీసి భావిస్తోంది. మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు 29 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం గుండా సుమారు 27 మెట్రోస్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో ప్రారంభమైన తర్వాత ఆయా మెట్రోస్టేషన్ల సమీప మార్గంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా.. నూతన బస్‌స్టేషన్లు నిర్మించి, ప్రయాణీకులకు వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. మెట్రోస్టేషన్లలో బస్‌స్టాప్‌లు ఉంటే ట్రైన్‌ దిగిన వెంటనే..బస్సుల్లో ఎక్కి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని ఆర్టీసి అభిప్రాయపడుతోంది. ఎల్‌బీనగర్‌, విక్టోరియా, మెమోరియాల్‌, చైతన్యపూరి, దిల్‌సుఖ్‌నగర్‌, ముసారంబాగ్‌, మలక్‌పేట్‌, ఎంజీబీఎస్‌, నాంపల్లి, లక్డీకపూల్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, తదితర సమీప ప్రాంతాల బస్తీల నుంచి, కాలనీల నుంచి బస్సులు ఫీడర్‌ సర్వీసులను నడిపేందుకు ఆర్టీసి పరిశీలిస్తుంది. ఇదిలా ఉండగా నగరంలో నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే మార్గం ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ కారిడర్‌. ఈ మార్గంలో మెట్రో ప్రారంభమైతే..బస్సులలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గనుంది. దాంతో దీనికి ప్రత్యామ్నయంగా, ఈ కారిడర్‌కు అనుసంధానం చేస్తూ గ్రేటర్‌ ఆర్టీసి కొత్త కార్యాచరణ రూపొందించనుంది.