మెట్రోలో వంద మంది ఉద్యోగుల‌పై వేటు

Hyd Metro
Hyd Metro

హైద‌రాబాద్ః ఏళ్ల తరబడి ఎదురు చూసిన మెట్రో రైలు రెండు నెలల కిందట ప్రారంభమైంది! కేవలం రెండు నెలల్లోనే ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. ఆ ప్రభావం మెట్రోలో పని చేసే ఉద్యోగులపై పడింది. వంద మందిపై మెట్రో అధికారులు వేటు వేశారు. వారిని ఉద్యోగంలోంచి తొలగించారు. దాంతో, మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ ముందు శుక్రవారం సాయంత్రం మెట్రో స్టేషన్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 100 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మూడేళ్లు అగ్రిమెంట్‌ కుదుర్చుకుని.. 45 రోజులపాటు ట్రైనింగ్‌ ఇచ్చి.. స్టేషన్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలిచ్చిన 45 రోజులకే ఎటువంటి సమాచారం, కారణం లేకుండా తమను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌ మెట్రో ధరలు భారీగా ఉండడంతో సామాన్యులు మెట్రో ఎక్కలేని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలంటూ అధిక ధరలతో మెట్రోను నడిపేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ నిర్ణయించుకోవడంతో ప్రభుత్వం సైతం పెదవి విప్పలేదు. ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లడానికి మెట్రో దగ్గర పార్కింగ్‌ లేదు. దీనికితోడు ధరల మోత. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళదామని అనుకుంటే, నలుగురు క్యాబ్‌లో వెళ్లేదానితో పోలిస్తే మెట్రో భారం మరీ ఎక్కువ. దాంతో, ప్రయాణికులు మెట్రోకు దూరంగానే ఉన్నారు. నగరంలో ఆర్టీసీ, ఎంఎంటీఎ్‌సలతో కలిసి ఉమ్మడి పాసులు అంటూ మెట్రో అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా మెట్రో ప్రారంభానికి ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించారు. ఉమ్మడి పాసుల ఊసే లేదు.