మూత్రపిండాలు-రసాయనాల సమతుల్యత

నాడి

                       మూత్రపిండాలు – రసాయనాల సమతుల్యత

kidney functioning
kidney functioning

మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అలాగే మూత్రపిండాలకు కూడా. మూత్రపిండాలు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోతే, ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతివారిలోనూ రెండు మూత్రపిండాలు నడుము భాగం లో ఉంటాయి. మూత్రపిండాలు శరీరంలో అధికంగా ఉన్న నీటిని, లవణాలను, ఇతర రసాయనాలను మూత్రం రూపంలో వెలుపలికి తీసుకు వెళుతాయి. అలాగే శరీరానికి అవసర మైన నీరు, లవణా లు, ఇతర పదార్థాలు మూత్రం ద్వారా శరీరం కోల్పోకుండా కూడా ఇవి కాపాడుతాయి. శరీరానికి సంబంధించినంత వరకూ మూత్ర పిండాలను మాస్టర్‌ కెమిస్టులని పేర్కొన వచ్చు. మూత్ర పిండాలు నిర్వహించే బాధ్యతలు ఈ కింది విధంగా ఉన్నాయి. శరీరంలో ద్రవాలను సరైన స్థాయిలో ఉంచడం, శరీరంలోని రసాయ నాల సమతుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరంనుంచి తొలగించడం, వివిధ రకాలైన హార్మోన్లను విడుదల చేయడం. శరీరంలోని ద్రవాలు : శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్ర పిండాలు చేసే విధులలో ప్రధానమైనవి. ఒక వ్యక్తి ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు తీసుకుంటే, ఎక్కువగా దాహం వేసి నీరు ఎక్కువ గా తాగుతాడు. అటువంటి సమయాలలో మూత్రపిండాలు అధికంగా ఉన్న ఉప్పును, నీటిని శరీరంనుంచి మూత్రం రూపంలో తొలగి స్తాయి. ఒకవేళ మూత్రపిండాలు సక్రమంగా పనిచేయని పక్షంలో ఉప్పు, నీరు శరీరంలో నిలువ ఉండిపోయి, కాళ్లు, చేతులు, ముఖం ఉబ్బుతాయి. ఈ విధంగా ఉబ్బటాన్ని వైద్యపరిభాషలో ఎడిమా అని వ్యవహరిస్తారు. శరీరంలో ద్రవ పరిమాణం మరీ అధికమైతే, అది ఊపిరితిత్తులలోకి ప్రాకి, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే గుండెపై కూడా అధిక భారాన్ని మోపుతుంది. రసాయనాల సమతుల్యత : శరీరంలోని రసాయనాల సమతుల్యతను మూత్రపిండాలు కాపాడు తాయి. శరీరానికి అవసరం లేని కొన్ని ప్రత్యేక రసాయనాలను మూత్ర పిండాలు తొలగించడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఇతర రసాయనాలను అవి నిలువ ఉంచుతాయి. గుండె కండరాలు సక్రమం గా పని చేయడానికి అవసరమైన పొటాషియం ఇటువంటి రసాయ నాలలో ఒకటి. ఎవరైనా పొటాషియంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే మూత్రపిండాలు రక్తంలోని పొటాషియంను సాధా రణ స్థాయిలో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయని పక్షంలో రక్తంలో పొటాషియం స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ స్థితిలో కండరాలు పని తీరు దెబ్బతింటుంది. రక్తంలో అధిక మొత్తంలో పొటాషియం నిలువలుంటే, గుండె పని తీరుపై కూడా ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అనేక రకాల రసాయనిక చర్యల ద్వారా శరీరం ఆమ్ల పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి ఆమ్ల పదార్థాలు ఎక్కువైన కొద్దీ వాటి సమతుల్యత సాధారణ స్థితికి రావడానికి అవసరమైన బఫర్‌ను మూత్రపిండాలు వాటికి జోడిస్తాయి. మూత్ర పిండాలు సక్రమంగా పని చేయని పక్షంలో ఆమ్ల పదార్థాల సమతుల్యత దెబ్బతిని అసిడోసిస్‌ అనే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రొటీన్లతో సహా పలు పదార్థాల సమతుల్యతను కూడా మూత్ర పిండాలు రక్షిస్తాయి. కొన్ని రకాల మూత్ర పిండాల వ్యాధుల్లో మూత్రం ద్వారా ప్రొటీన్లు బైటికి వెళ్లిపోతాయి. వ్యర్థ పదార్థాలు కండరాల సాధారణ చర్యల వలన, ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన ప్రొటీన్ల విచ్ఛిన్నత వలన శరీరంలో వ్యర్థ పదార్థాలు ఏర్పడుతాయి. మూత్రపిండాలు సక్రమం గా పని చేయని దశలో ఈ వ్యర్థ పదార్థాలు శరీరంపై విష పదార్థాలుగా ప్రభావం చూపుతాయి. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వలన వాంతివచ్చినట్లు ఉండ టం, నీరసం, అలసట, బలహీనత తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఈ స్థితిని యురీమియా, యురీమిక్‌ సిండ్రోమ్‌ లేదా యురీమిక్‌ పాయిజనింగ్‌ అని వ్యవహరి స్తారు. దీనికి కారణం వ్యర్థపదార్థాలలో ఒకటైన యూరియా అధిక మొత్తంలో పేరుకుపోవడమే. శరీరం లోని వివిధ గ్రంథులు హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి కొన్ని ప్రత్యేకమైన విధులకు ఉపయోగ పడుతాయి. ఆరోగ్యవంతమైన మూత్రపిండాలు అనేక రకాలైన హార్మోన్ల లను విడుదల చేస్తాయి. వాటిలో రెనిన్‌, ఎరిథ్రోప్రోటీన్‌, ఉత్తేజితమైన రూపంలో ఉండే విటమిన్‌ డి అనేవి ప్రధాన మైనవి. రెనిన్‌ రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్ర పిండాలు సక్రమంగా పని చేయని వారిలో నియంత్రించ డానికి సాధ్యం కాని రీతిలో రెనిన్‌ విడుదలై, అధిక రక్త పోటును కలుగజేస్తుంది. ఎముకలలోని మూలుగ (బోన్‌ మారో) ఎర్రరక్తకణాలను తయారు చేయడానికి ఎరిథ్రో పోటీన్‌ ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పని చేయకపోతే, ఎర్రరక్తకణాలు కొద్ది మొత్తంలోనే తయారై, రక్తహీనతకు దారితీస్తుంది. శరీరం ఆహారంలోని కాల్షియంను స్వీకరించేలా చేసి, ఎముకల నిర్మాణాన్ని సరైన విధంగా ఉంచడంలో ఉత్తేజిత విటమిన్‌ డి ఉపయోగపడుతుంది.