మూడు షేర్లకు ఒక్క షేరు బోనస్‌

 

WIPRO
WIPRO

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో రాణించింది. కంపెనీ నికర లాభం రూ.2544.5 కోట్లకు చేరుకుంది. 2017-18 ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.1930.1 కోట్ల కంటే ఇది 31.8 శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.15,059.5 కోట్లకు చేరుకుంది. 2017-18 మూడో త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.13,669 కోట్ల కంటే ఈ మొత్తం 10.17 శాతం ఎక్కువ. కంపెనీ ఆదాయాల్లో ఎక్కువ వాటా ఉన్న ఐటీ సేవల విభాగం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 1.8 శాతం అధికంగా 2,046.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.14,555 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది.  విప్రో బోర్డు బోనస్‌ షేర్ల జారీకి అంగీకరించింది. వాటాదార్ల వద్ద ఉన్న ప్రతి 3 షేర్లకు ఒక షేరును బోనస్‌గా ఇస్తారు. అదే సమయంలో ప్రతి 3 ఏడీఎస్‌ షేర్లకు ఒక ఏడీఎస్‌ షేరును అందజేస్తుంది. రికార్డు తేదీని అర్హత గల వాటాదార్లకు తర్వాత తెలియజేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చివరి సారిగా ఏప్రిల్‌ 2017లో 1:1 నిష్పత్తిలో కంపెనీ బోనస్‌ షేర్లను ప్రకటించింది.