ముసురే…ముసురు!

Heavy Rain
Heavy Rain

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు
తడిసిన ధాన్యం, మొక్కజొన్న, కంది
హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. ధాన్యం, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తరు నుండి భారీగా వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనంతో ఉత్తర ఇంటీరియర్‌ కర్నాటక వరకూ తెంలగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారం వర్షాలు కురియగా, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు గడచిన 24 గంటలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం భీబత్సం చేసింది. శనివారం అర్థరాత్రి నుండి ఆదివారం తెల్లవారు ఝాము వరకూ కురిసిన వర్షాలతో పలు ప్రాంతాఉల జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్‌, భూపాలపల్లి, జనగామ, పెద్దపల్లి, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాల్లో 51.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాలు ప్రజలను నష్టాలపాలు చేశాయి. లోతట్లు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వరంగల్‌ జిల్లాలని కాజీపేట్‌, కమలాపూర్‌, జయశంకర్‌ జిల్లాలోని చిట్యాల, గోవిందరావుపేట్‌, మహదేవపూర్‌ మండలాల్లో భారీగా వర్షం కురిసింది. కమలాపూర్‌లో రోడ్లు జలమయం అయ్యాయి. రామగుండంలో ఓపెన్‌ కాస్టు గనుల్లోకి వర్షపు నీరు చేరింది. రాజన్న సిరిసిల్లా, తంగళ్లపల్లి, వేములవాడ, చందుర్తి, ముస్తాబాద్‌ ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురిసింది. మల్యాల అడ్డరోడ్డు సమీపంలో జగిత్యాల, కరీంనగర్‌ రహదారిపై వెళుతున్న కారుపై ఎండిన చెట్టు కొమ్మ విరిగిపడడంతో కారు ధ్వంశమైంది. రామడుగు మండలం తిర్మలాపూర్‌లో కోళ్లఫారమ్‌ రేకుల షెడ్డు కూలిపోవడంతో దాదాపు 2,600 కోడిపిల్లలు చనిపోగా సుమారు 3 లక్షల రూపాయలకు పైగా నష్టం జరిగింది. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో చెట్టు విరిగిపడగా, విద్యుత్‌ స్థంభాలు కుప్పకూలియాయి. పలు చోట్ల ఈదురు గాలులు, భారీ వర్షానికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇండ్ల పై కప్పులు గాలికి ఎగిరిపోయాయి.
భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఆయా జిల్లాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో ఏరేందుకు సిద్దంగా ఉన్న పత్తి మొత్తం వర్షాలకు తడిసి నేలరాలింది. పీచు దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామడిడి తోటల్లో చెట్లకు ఇప్పుడిప్పుడే వస్తున్న పూత రాలిపోయింది. గంగాధర వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు అమ్మకం నిమిత్తం రైతులు తీసుకొచ్చిన కందులు తడిసిపోయాయి. పలు చోట్ల మిర్చి కాయ దశలో ఉండడంతో వర్షానికి తడిసి అవి నల్లబడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల మీద ఆరబెట్టిన మిర్చి పూర్తిగా తడిపోయింది. వరంగల్‌ జిల్లా పరకాల తదితర ప్రాంతాల్లో మిర్చి కల్లాల్లో ఆరబోయడంతో వర్షాలకు అవన్నీ తడ్డిసి ముద్దయ్యాయి. కల్లాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో మిర్చి నీటిపై తేలుతుంటే మరోపక్క రైతుల కళ్లల్లో కన్నీళ్లు మిగులుతున్నాయి. జగిత్యాల జిల్లాలో బొప్పాయి తోటల్లోని చెట్లు విరిగిపోయాయి. కళ్ల ముందే పంటలు తడిసిపోవడంతో రైతులు భోరున విలపిస్తున్నారు. గోవిందరావుపేట్‌, చిట్యాల మండలాల్లో మిర్చి, వరి పంటలు తడిసి నష్టం జరిగింది. జూలపల్లి మండలంలో మొక్కజొన్న పంటలు నేలవాలాయి. వనపర్తి జిల్లాలో రైతులు నిల్వ చేసిన దాదాపు 200 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం, కనీస మద్దతు ధరలు రాకపోవడంతో రైతులు భారీ ఎత్తున వరి ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఇప్పుడు వర్షాలకు ధాన్యం అంతా తడిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వారీగా వర్షపాతం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 0.4 మిల్లీ మీటర్లు, హైదరాబాద్‌లో 6.7 మిల్లీ మీటర్లు, భూపాలపల్లిలో 42.3 మిల్లీ మీటర్లు, జగిత్యాలలో 18.1 మిల్లీ మీటర్లు, జనగామలో 32.4 మిల్లీ మీటర్లు, జోగులాంబ గద్వేల్‌లో 10.2 మిల్లీ మీటర్లు, కామారెడ్డిలో 1.8 మిల్లీ మీటర్లు, కరీంనగర్‌లో 51.1 మిల్లీ మీటర్లు, కొమరంభీంలో 7.3 మిల్లీ మీటర్లు, మల్కాజిగిరిలో 4.1 మిల్లీ మీటర్లు, మహబూబాబాద్‌లో 1.1 మిల్లీ మీటర్లు, మహబూబ్‌నగర్‌లో 0.5 మిల్లీ మీటర్లు, మంచిర్యాలలో 6.8 మిల్లీ మీటర్లు, మెదక్‌లో 6.7 మిల్లీ మీటర్లు, నాగర్‌కర్నూల్‌లో 5.7 మిల్లీ మీర్లు, నల్లగొండలో 3.4 మిల్లీ మీటర్లు, పెద్దపల్లిలో 33.2 మిల్లీ మీటర్లు, రాజన్న సిరిసిల్లాలో 29.3 మిల్లీ మీటర్లు, రంగారెడ్డిలో 6 మిల్లీ మీటర్లు, సంగారెడ్డిలో 8.4 మిల్లీ మీటర్లు, సిద్దిపేట్‌లో 40.7 మిల్లీ మీటర్లు, సూర్యాపేట్‌లో 0.7 మిల్లీ మీర్లు, వనపర్తిలో 10 మిల్లీ మీటర్లు, వరంగల్‌ రూరల్‌లో 11.7 మిల్లీ మీరట్లు, వరంగల్‌ అర్బన్‌లో 24.8 మిల్లీ మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 0.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 5.4 మిల్లీ మీటర్లు, ప్రకాశంలో 0.1 మిల్లీ మీటరు, అనంతపూర్‌లో 0.3 మిల్లీ మీటర్లు, కర్నూల్‌ జిల్లాలో 5.5 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.