మునుగోడు లో రేపు 9 బహిరంగ సభలకు బిజెపి ప్లాన్

BJP plans to hold 9 public meetings tomorrow in Munugodu


మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కు వచ్చింది. దీంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు లో విస్తృతగా ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతుండగా..రేపు బిజెపి ఏకంగా 9 బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. ఇందుకోసం 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రచారానికి చివరి రోజు నవంబర్ 1 న అన్ని గ్రామాల్లో నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించబోతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా రోడ్ షోలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే పీసీసీ ముఖ్యనేతలంతా క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. మరి మునుగోడు ప్రజలు ఎవరికీ పట్టం కట్టబోతారో చూడాలి. ప్రస్తుతమైతే బిజెపి , టిఆర్ఎస్ పార్టీ లు డబ్బు ను విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఓటుకు ఎంతైనా ఇచ్చేందుకు వెనుకాడడంలేదు. ప్రధాన పార్టీల ఖర్చు దాదాపుగా వెయ్యి కోట్లకు చేరుకుంటుందని ఓ అనధికారిక అంచనా. ఎన్నికల షెడ్యుల్ విడుదలైనప్పటి నుంచి దసరా, దీపావళి పండగలొచ్చాయి. ఆయా పండగల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు తమకు ఏ లోటూ లేకుండా చూశాయని ఓటర్లు చెబుతున్నారు.

దసరా పండక్కి పది మందికి ఒక మేక పోతు ఇచ్చారు. మద్యం పంపిణీ చేశారు. దీపావళికి టపాకాయల డబ్బాలిచ్చారు. ఇప్పుడు కూడా అడిగితే పంపిస్తారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అవసరాల కోసం అడిగితే గ్రామ ఇన్ చార్జ్ లుగా ఉన్న వాళ్లు డబ్బు కూడా ఇస్తున్నారు అని చెపుతున్నారు. మొత్తం మీద ఉప ఎన్నిక కారణంగా ఓటర్లను ప్రతి రోజు పండగ చేసుకుంటున్నారు. మరి చివరికి ఎవరికీ ఓటు వేస్తారో..