ముత్యాల తలంబ్రాలు

TALAMBRALU
TALAMBRALU

ముత్యాల తలంబ్రాలు

చైత్రశుద్ధ నవమినాడు -మిథిలా పురాన-శ్రీరాముడు-అవ లీలగ శివధనుస్సును విఱిచి సీతను పరిణయమాడె రమ్యగతిని!!

శ్రీరాముడు సౌమిత్రి తోడ శంఖ ధనుర్బాణధారియై వామాంకస్థిత సీతతో భద్రాద్రిని కొలువయ్యె లోకభద్రమై!!

పావన గోదావరీ తీరాన భద్రగిరి పెండ్లి పీటలపై జరిగే-”సీతారామకల్యాణం- సకల లోక కళ్యాణకరం!!

రామదాసు చేయించిన చింతాకు పతకము తాల్చి కల్యాణ తిలకం బుగ్గను చుక్కతో-

”చక్కని సీతమ్మ నూత్నవధువై కనువిందు కావించె!!

కస్తూరి నామం-శ్రీభాషికం నుదుట కలకలలాడగ నీలమేఘశ్యాముడు క్రొత్త పెళ్ళికొడుకై ముల్లోకాలను ముగ్ధులను చేసె!!

సీతమ్మ చేతులలో కెంపులై శోభిల్లు ముత్యాల తలంబ్రాలు రామునిపై పోయగ-

ఇంద్రనీలాలై రాజిల్ల భువనాలెల్ల చూసి పులకించె!!

శ్రీరాముని శ్రీకరాల నీలాలై జానకి శిరసును-మల్లెమొగ్గలై భాసిల్లి గులాబీ చెక్కిళ్ళు పద్మరాగాలై విరాజిల్లె-కళ్యాణ మౌక్తికాలు!!

సీతారాముల కల్యాణ తలంబ్రాలు తెలుగువారి ”సమతమమతలకలంకారాలు!

సీతారాముల కల్యాణ మౌక్తికాలు సకల ప్రజలను బ్రోచే-ముత్యాల తలంబ్రాలు!!

– ”కళ్యాణశ్రీ జంధ్యాల వేంకట రామశాస్త్రి