ముత్తూట్‌ ఫైనాన్స్‌, మెక్‌నల్లీ భారత్‌ పైపైకి

MUTHOOT FINANCE
MUTHOOT FINANCE

న్యూఢిల్లీ: కొచ్చి కేంద్రంగా బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సర్వీసులు నిర్వహించే మూత్తూట్‌ ఫైనాన్స్‌ ఈఏడాది మొదటి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. మొదటి త్రైమాసికంలో నికరలాభం 43 శాతం పెరిగి రూ.492 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 18శాతం పెరిగి, రూ.1605 కోట్లను అధిగమించింది. ప్రొవిజన్లు 79 శాతం క్షీణించి రూ.2.7 కోట్లకు పరిమితం కాగా, స్థూల ఆస్తుల విలుల 11 శాతం పెరిగి రూ.30,997కోట్లకుచేరింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముత్తూట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌లో కొనుగోళ్లకు క్యూకట్టారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 8.2శాతం పెరిగింది. రూ.33 పెరిగి రూ.433 వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.436ను కూడా అధిగమించింది. గతంలో నైవేలీ లిగ్నైట్‌గా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్‌ఎల్‌సి ఇండియా నుంచి ఆర్డర్‌ లభించినట్లు పేర్కొనడంతో ఇంజినీరింగ్‌ సంస్థ మెక్‌నల్టీ భారత్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 5 శాతం పెరిగింది. అమ్మేవాళ్లు కరవుకావడంతో దాదాపు రూ.39 వద్ద ఫ్రీజయ్యింది. ఎన్‌ఎల్‌సి ఇండియా నుంచి 108 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు మెక్‌నల్లీ భారత్‌ పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా ఒడిషాలోని ఖిండాలో 544 కాలనీ గృహాలతోపాటు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాన్ని చేపట్టవలసి ఉంటుందని తెలియచేసింది. అంతేకాకుండా వీటికి విద్యుదీకరణను సైతం చేపట్టవలసి ఉంటుందని వివరించింది. ఆర్డర్‌ను 24 నెలల్లోగా పూర్తిచేయవలసి ఉందని వెల్లడించింది.