ముక్కుదిబ్బడకు ఆయుర్వేద వైద్యం

Sick
Sick

ముక్కుదిబ్బడకు ఆయుర్వేద వైద్యం

రుచి వాసనలు అనేవి పంచవిధ జ్ఞానాలలో ప్రధానమైనవి. ఈ జ్ఞానాలు వాటి ఉత్పత్తి స్థానాలనుంచి మెదడుకు విడివిడిగా చేరినప్పటికీ రెండూ ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా స్థానిక సమస్య వలన వాసనను తెలుసుకునే శక్తి సన్నగిల్లితే రుచిని గ్రహించే శక్తి క్షీణిస్తుంది. జలుబు విషయంలో ఇది అందరికీ అనుభవమవుతుంటుంది. అయితే కేవలం ఒకటో, రెండోకాకుండా అనేక అంశాలు రుచి, వాసనల గ్రహణ శక్తిని తగ్గిస్తుంటాయి కనుక సమస్యను అన్ని కోణాల నుంచి విశ్లేషించాల్సి ఉంటుంది. జలుబు వలన ముక్కు రంధ్రాల్లోని మార్గాలు, సైనస్‌ గదులూ కఫంతో పూడుకుపోయి వాసన శక్తి తగ్గుతుంది.

సూక్ష్మక్రిములు ముక్కు రంధ్రాలలోకి ప్రవేశించినప్పుడు శ్లేష్మం విడుదలై వాటిని కదలనివ్వకుండా చేస్తుంది. బందీగా మారిన సూక్ష్మ క్రిముల పైన తెల్ల రక్త కణాలు దాడి చేసి వాటిని అంతమొందిస్తాయి. ఈ నేపథ్యంలో శరీరానికి కొంత నష్టం వాటిల్లుతుంది. శ్లేష్మం వలన వాసనకు సంబంధించిన సంకేతాలు నరాగ్రాల వరకూ పూర్తిస్థాయిలో చేరలేవు. ఈ కారణం చేతనే జలుబు చేసిన వారికి వాసనను గ్రహించే శక్తి తాత్కాలికంగా తగ్గిపోతుంది. ముక్కు రంధ్రాలు కఫంతో అడ్డుకుపోవం వల్ల నోటితో గాలి పీల్చాల్సి వస్తుంది.

దీనితో నాలుక మీద ఉండే రుచి గ్రాహకాలు మొద్దుబారి రుచి గ్రహణం కూడా క్షీణిస్తుంది. జలుబు చేసిన వారు పొగలు కక్కుతుండే పానీయాలనూ, మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలనూ ఇష్టపడేది అందుకే. వారు సున్నితమైన రుచులనూ సువాసనలనూ ఆస్వాదించలేరు. జలుబును తగ్గించడానికి ఆయుర్వేదంలో అనేక రకాల మందులున్నాయి. కస్తూరి భైరవ రస, మహాలక్ష్మీ విలాస రస వంటి శక్తివంతమైన ఔషధా లతోపాటు వ్యోషాదివటి వంటి తేలికపాటి మందులు సైతం ఉన్నాయి. సైనస్‌లు అనేవి తలను తేలికగా ఉంచడానికి ఉపయోగపడే నాలుగు జతల గాలి గదులు. ఇవి అన్నీ ముక్కు రంధ్రాలలోకి తెరచుకుంటాయి. ఒకవేళ జలుబు చేస్తే కఫంవల్ల వీటి మార్గం పూడుకుపోతుంది.

అప్పుడు వీటి పైకప్పు మీద ఉండే ఆల్‌ఫ్యాక్టరీ నాడుల కొసలు కూడా కప్పబడిపోయి వాసన శక్తి తగ్గిపోతుంది. దీనిని ఆయుర్వేదంలో దుష్టప్రతిస్యాయం అంటారు. ఈ వ్యాధిలో స్రావాలు తగ్గినంత మాత్రాన సరిపోదు. ఇన్‌ఫెక్షన్‌ కూడా తగ్గాలి. అలాగే ఇన్‌ఫెక్షన్‌ మళ్లీ తిరగబెట్టకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగాలి. ఆయుర్వేద చికిత్సతో ఇవి సాధ్యమవుతాయి. షడ్బిందు తైలంతో నస్య కర్మ చేసుకోవడం దగ్గర నుంచి పథ్యాపథ్యాలను పాటించడం వరకూ అనేక రకాలైన అంశాలు చికిత్సలో భాగంగా ఉంటాయి.

వృద్ధాప్యాన్ని ఒక సహజ వ్యాధిగా ఆయుర్వేద సంహితాకారుడు సుశృతుడు పేర్కొన్నాడు. వృద్ధాప్యంలో అన్ని శక్తులతోపాటు వాసనను గ్రహించే శక్తియుక్తులు కూడా క్షీణిస్తాయి. ఇది సహజమైన స్థితి కనుక దీనికి పెద్దగా హైరానా పడాల్సిన పనిలేదు. అయితే అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆయుర్వేద రసాయన చికిత్సలతో వాటిని నిలువరించవచ్చు. సిగరెట్ల వల్ల ఇంద్రియ నిగ్రహణ శక్తులు నశిస్తాయి. ధూమపానం చేసేవారు సున్నితమైన సుగంధాలనూ, వైవిధ్యభరితమైన రుచులనూ ఆస్వాదించలేరు. సిగరెట్‌ పొగలోని నికొటిన్‌ తారు మాదిరిగా నాసిక, నాలుకల్లోని నరాగ్రాలను కప్పేసి రుచి, వాసనలను కోల్పోయేలా చేస్తుంది. ధూమపానం చేసేవారు వెంటనే సిగరెట్లు మానేయడం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

కొంతమందిలో ముక్కు తాలూకు మ్యూకస్‌ పొరలనుంచి పిలకల్లాంటి పెరుగుదలలు తయారవుతుంటాయి. వీటిని పాలిప్స్‌ అంటారు. ఒక్కొక్కసారి ఇవి భారీగా పెరుగుతూ నాసికా రంధ్రాన్ని పూర్తిగా ఆక్ర మిస్తాయి. అలాంటి సందర్భాలలో నోటితో గాలి పీల్చుకోవడం అనివార్యమవుతుంది. దీనితో రుచి వాసనలు ఏకకాలంలో తగ్గిపోతాయి. ఇటీవల కాలంలో చాలామంది ముక్కు దిబ్బడ సమస్యకు నేరుగా మెడికల్‌ షాపులకు వెళ్లి డీ కంజె స్టింగ్‌ కొనివాడటం పరిపాటి.

ఈ మందులు నాసికా మార్గాల్లోని చిన్న చిన్న రక్తనాళాలను సంకోచపరిచి మూసివేస్తాయి. ఒకటి రెండు రోజులు ఈ మందులు వాడితే ఫర్వాలేదు. కానీ రోజుల తరబడి వాడితే మాత్రం రక్తనాళాలు శాశ్వతంగా దెబ్బ తిని సంకోచ వ్యాకో చాల శక్తిని కోల్పోతాయి. దీనితో ముక్కునుంచి స్రావాలు కారడం నిత్యకృత్య మైపోతుంది. దీని ఫలితంగా ముక్కులోని మ్యూకస్‌ పదార్థం ఎక్కువగా విడుదలై, ముక్కులోపలి నరాలను దెబ్బ తీయడమే కాకుండా, రుచి వాసనలను కోల్పోయేలా చేస్తుంది. ముక్కు దిబ్బడను తొలగించడానికి ఆయుర్వేదంలో షడ్బిందు తైలం తదితర మందులు బాగా పని చేస్తాయి. ఇవి డీకంజెస్టంట్స్‌ మాదిరిగా రీబౌండ్‌ ఎఫెక్ట్‌ చూపించవు.

====