మీ కలలు నెరవేరుస్తాం..

soniya, rahul
soniya, rahul

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చారు. ప్రజాకూటమి తరఫున ఏర్పాటుచేసిన తొలి భారీ బహిరంగసభను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఆమె తనయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాకూటమిలోని నాలుగు పార్టీల నేతలు రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. సభకు హాజరైన జనంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మొత్తం మీద సభ విజయవంతం కావడం ప్రజాకూటమిలో జోష్‌ నింపింది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని రాజేసింది.  మేడ్చల్‌ వేదికగా సోనియా సభను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

తల్లీకొడుకులు ఒకే వేదికపై…
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు భారీ బహిరంగసభలో ఒకే వేదికను పంచుకోవడం, సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. నామినేషన్లు పూర్తయి పూర్తి స్థాయి ప్రచారానికి శ్రీకారం చుడుతున్న తరుణంలో సభ జరగడం ప్రచారాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూలించే పరిణామంగా పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌, తెదేపా, తెజస, సీపీఐలు కలసికట్టుగా ప్రచారంలో దిగేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఈ సభ ద్వారా స్పష్టమైన సందేశం వెళ్లిందని అభిప్రాయపడుతున్నారు. ప్రజా ఉద్యమాల్లో ప్రధానమైన నేతలు మహాకూటమికి మద్దతుగా నిలబడటం సానుకూల పరిణామంగా పేర్కొంటున్నారు.
సోనియా ప్రసంగానికి చప్పట్లు
సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ చాలాకాలం తర్వాత బిడ్డల్ని చూసిన తల్లిలా తనకు ఉందని అన్నప్పుడు, జైతెలంగాణ అని ప్రసంగాన్ని ముగించినపుడు సభలో ఒక్కసారిగా చప్పట్లు మారుమోగాయి. మేడ్చల్‌ సభను రాహుల్‌గాంధీ చరిత్రాత్మక సభగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలని నెరవేర్చేందుకే కూటమిగా ముందుకు వస్తున్నామని అన్నప్పుడు జనం నుంచి మంచి స్పందన కనిపించింది. సోనియాకు ఆత్మీయ సన్మానం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన సోనియాగాంధీని కాంగ్రెస్‌ నేతలు ఆత్మీయంగా పలకరించారు. వేదికపై ఉన్న సోనియాగాంధీకి అందరూ శాలువాలు కప్పి మాట్లాడారు. కొన్నేళ్ల తర్వాత వచ్చిన అవకాశం కావడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, ముఖ్యనేతలు సోనియాగాంధీతో మాట్లాడారు. సభకు వచ్చిన కూటమి పార్టీల రాష్ట్ర బాధ్యులు, ప్రజా సంఘాల నేతలు, గిరిజన బడుగు, బలహీనవర్గాల నేతలను పరిచయం చేయడంతోపాటు సోనియాగాంధీని సన్మానించడం ఈ సభలో ప్రత్యేకంగా నిలిచింది.
నాలుగున్నరేళ్ల తర్వాత తెలంగాణకు
సోనియాగాంధీ గతంలో 2014 ఏప్రిల్‌ 27న చివరి సారి రాష్ట్రానికి వచ్చారు. 2014 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రంగా విభజన కాకముందు ఆమె మూడు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనడం ద్వారా తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు.తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లక్ష్యంతో పాటు తెరాస పాలన, మళ్లీ కాంగ్రెస్‌ రావాల్సిన అవశ్యకతను వివరించారు. సోనియాగాంధీ 17 నిమిషాలే ప్రసంగించినా అన్ని అంశాలను స్పృశించినట్లు కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో గత నాలుగేళ్లుగా ఉన్నది కుటుంబపాలన అని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుండగా ఈ అంశాన్ని సోనియాగాంధీ కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐతో కలసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో సోనియాగాంధీ తన ప్రసంగంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు.