‘మీ ఊరు- మీ రాష్ట్రం’ కోసం కృషి చేస్తే ప్రజాసేవకు అవకాశం

TDP PRESIDENT CHANDRA  BABU
TDP PRESIDENT CHANDRA BABU

‘మీ ఊరు- మీ రాష్ట్రం’ కోసం కృషి చేస్తే ప్రజాసేవకు అవకాశం

ఓటు వేయడమే కాదు, ప్రచార బాధ్యత తీసుకోండి
తెలుగు ప్రవాసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ప్రజాసేవ చేయాలని పరితపించే ప్రవాస తెలుగువారందరికి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దూరమనేది సమస్య కాదని, రాష్ట్రంలో నివశిస్తున్న తెలుగువారు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తున్నారో, ప్రవాసులు కూడా అదే రీతిలో సహాకారమందించవచ్చన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల సమాచారం ఆన్‌లైన్లో అందరికి అందుబాటులో వుంచామని, దాని ద్వారా ఎవరు ఏ విధంగా ఎంతమేరకు సాయం చేవచచ్చనే దానిపై స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా తొలిరోజు సిఎం న్యూజెర్సీలోని న్యూజెర్సి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్టూడెంట్‌ సెనెట్‌లో ఏర్పాటైన సభలో ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం ప్రసంగిస్తూ సొంత గ్రామానికి ఏం చేయాలో ఆలోచించాలని సిఎం సూచించారు.

ఆ ఆలోచనలను గ్రామస్తులతో పంచుకోవాలని, గ్రామదర్శిని- వార్డు దర్శినికి చేయూత ఇవ్వాలని సిఎం వారిని కోరారు. విజ్ఞానాన్ని గ్రామాభివృద్ధికి దోహదపడేలా కృషి చేయడమే కాకుండా, సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు వినూత్న ఆలోచనలు చేయాల్సి వుందన్నారు. ప్రవాస తెలుగువారు రెండు విషయాలు ముక్యంగా గుర్తుంచుకోవాలని, అవి ఒకటి కష్టపడి పనిచేయడం, రెండోది జన్మభూమిని మరిచిపోకుండా ఉండటమన్నారు. అమెరికాలోని అన్ని నగరాల్లో తెలుగువారున్నారు. తానా, ఆటా, నాటా ఇలా అనేక సమాఖ్యల్లో వున్నారు. మీవృత్తిలో రాణిస్తూనే ఇటు సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. సమాజ సేవలో ముందున్న ప్రవాసాంద్రులందరికి అభివందనం అన్నారు.

తెలుగవారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జ్‌ ఎకానమీలోనూ మీరంతా ముందుకురావాలన్నారు. ఏం చేస్తే మనవాళ్ళకు భవిష్యత్తుంటుందో ఆరోజు అమెరికాలోని ప్రవాస తెలుగువారితో సమాలోచనలు చేశారు. నాలెడ్జి ఎకానమికి జ్ఞాపక చిహ్నంగా సైబర్‌ టవర్స్‌ను హైదరాబాద్‌లో నిర్మించా. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజు సైబర్‌ టవర్స్‌ ప్రారంభించాం. అంటే మన జైత్రయాత్ర ప్రారంభమై ఇరవై ఏళ్ళయింది. నాలెడ్జి ఎకానమిలో బాగంగా 30 ఇంజనీరింగ్‌ కాలేజ్‌లు కూడా లేని రోజుల్లో 300కు పైగా ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏర్పాటయ్యేలా అనుమతులిచ్చాం. ఆనాడు వందల సంఖ్యలోఓ ఇంజనీరింగ్‌ కళాశాలలు నెలకొల్పడంతో యువతలో ఇంజనీరింగ్‌ ప్రతిభ పెరిగిందన్నారు.

సైబర్‌ టవర్స్‌ నిర్మాణం, ఇంజనీరింగ్‌ కాలేజ్‌ల ఏర్పాటుతోనే ఐటి విప్లవం ముందుకు సాగదని గ్రహించి అమెరికా వచ్చి 15 రోజులుండి పెద్ద పెద్ద ఐటి కంపెనీల సిఇఓలతో, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యి మనదేశంలో పుష్కలంగా మానవవనరులున్నాయి. వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించి ఒప్పించా. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్తాపకుడు బిల్‌గేట్స్‌ అపియింట్‌మెంట్‌ అడిగితే రాజకీయ నాయకులతో తనకేమీ పనిలేదని చెప్పారు. నాకు మీతో పని వుందని పది నిముషాలు అవకాశమివ్వాలని బిల్‌గేట్స్‌ను కోరా. ఆయన చివరికి అంగీకరించి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగాభివీద్ధికి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై నేనిచ్చి ప్రజంటేషన్‌ 45 నిముషాలు కొనసాగింది. ఇది బిల్‌గేట్స్‌ను ఆకట్టుకుంది.

అలా హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తరలివచ్చింది. ఆరోజు నాది స్వప్నం, నేడది నిజం. ఐటి విప్లవ ఫలాలు అందుకుని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఒకప్పుడు మైక్రోసాప్ట్‌ కార్యాలయం హైదరాబాద్‌కు రావాలని కోరుకున్నా, ఇవాళ అదే మైక్రోసాఫ్ట్‌ సిఇఓ మన తెలుగు బిడ్డ వున్నారు. అది మనసత్తా, మన తెలివితేటలకు నిదర్శనం అని సిఎం పేర్కొన్నారు. ఐటి రంగంపై నేను పెట్టిన శ్రద్దవల్లే ఈరోజు ఇంతమంది అమెరికా రాగలిగారు. ప్రపంచంలో ఎక్కడున్నా మీరు మనుగడ సాగించే సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని సంపాదించారు. ఎక్కడైనా సర్దుకుపోగలిగే అడాప్టబిలిటీ మీలో చాలా వుందన్నారు.