మీరు ప్రభుత్వ న్యాయవాదా ? పార్టీ న్యాయవాదా ?

          మీరు ప్రభుత్వ న్యాయవాదా ? పార్టీ న్యాయవాదా ?

High Court
High Court

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరణపై వారం రోజుల్లో స్పష్టత ఇవ్వండి
ప్రభుత్వం తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్‌
ప్రభుత్వ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌పై తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ సభ్యత్వ పునరుద్ధరణపై తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర ప్రభుతాన్ని సూటిగా ప్రశ్నించింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరణపై వారం రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలనీ లేనిపక్షంలో అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా లెజిస్లేటివ్‌ సెక్రటరీ నేరుగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. వారి వ్యవహారంలో అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ సభ్యత్వాలను పునరుద్ధరించాలన్న తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు చూపించినప్పటికీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయడం లేదనీ వీరిద్దరూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. తమను శాసనసభలోనికి అనుమతించకుండా హక్కులను కాలరాస్తున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ వైఖరి సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నోమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశామనీ, అయినప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ నిలదీసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రామచందర్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారా ? లేక పార్టీ న్యాయవాదిగా ఉన్నారా ? అని సూటిగా ప్రశ్నించింది. తమ వాదనలు వినిపించేందుకు అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టును కొంత సమయం కోరగా…వచ్చే నెల 3న ఈ కేసును తిరిగి విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది.