మా రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయిః సియం

palani swami
palani swami

చెన్నై: తమిళనాడుపై కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్ణన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. కొన్ని రోజుల క్రితం రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. నక్సలైట్లు, మావోయిస్టులు, ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలిపి తమిళనాడును అల్లకల్లోలం చేయాలని నిర్ణయించుకున్నాయని జల్లికట్టు కోసం చేసిన నిరసనలో జరిగిన విధ్వంసమే ఇందుకు నిదర్శనమని, దీంతో తమిళనాడు రాష్ట్రం ఎన్నటికీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఉండబోదని ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పళనిస్వామి మాట్లాడుతూ.. అదొక పెద్ద అబద్ధం. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే అత్యంత ప్రశాంతమైన రాష్ట్రమని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. భాజపా సారథ్యంలోని కేంద్రం, అన్నాడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవ చేసేందుకు అద్భుతంగా పనిచేస్తున్నాయి. రెండు పార్టీల భావజాలం భిన్నమైనది అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల శ్రేయస్సు కోసమే కృషి చేస్తున్నాయని విలేకరుల సమావేశంలో అన్నారు.