మా జోలికి రావొద్దు

MODI
పాకిస్థాన్‌కు భారత్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశ  అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని భారత్‌ పాకిస్తాన్‌ను హెచ్చరించింది. హిజ్‌బుల్‌ ముజాహదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని మృతిని పాకిస్తాన్‌ బ్లాక్‌డేగా ప్రకటించి కాశ్మీర్‌ ప్రజలకు సానుభూతి మద్దతును తెలియజేయడంపై భారత్‌ విదేశాంగశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచే సింది. ఇటువంటి ప్రకటనలు చర్యలు ఉగ్ర వాదానికి మద్దతునిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుందని, ఉగ్రకమాండర్‌ బుర్హాన్‌ మృతిని అమరవీరునిగా అభివర్ణించడం హేయకరమని భారత్‌ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ బుర్హాన్‌ను అమరవీరుడిగా అభివర్ణిస్తూ జులై 19వ తేదీని బ్లాక్‌ డేగా పాటించాలని,కాశ్మీర్‌ ప్రజలకు తమ సంపూర్ణ మద్దతునిస్తామని ప్రకటించడంపై భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు పాకిస్తాన్‌ కొన్ని నిర్ధిష్టమైన ఉగ్రవాద సంస్థలకు మద్దతునిస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. అంతేకాకుండా ఉగ్రమూకలు సంస్థలపట్ల పాకిస్తాన్‌ సానుభూతితో ఉందని అర్ధం అవుతోందన్నారు. జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పాకిస్తాన్‌ మంత్రివర్గం చేసిన ప్రతిపాదనలు, నిర్ణయాలను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌ ఇప్పటికీ అనేకమార్లు జోక్యం చేసుకుంటున్నదని భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ వెల్లడించారు. పాకిస్తాన్‌ కానీ, ఏ ఇతర దేశం అయినా భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేదిలేదని ఆయన స్పష్టంచేశారు. లాహోర్‌లో జరిగిన ప్రత్యేకకేబినెట్‌ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నవాజ్‌షరీఫ్‌ కాశ్మీర్‌లో జరుగుతున్న ఉద్యమం స్వేఛ్ఛకోసం జరుగుతున్న ఉద్యమంగా అభివర్ణించడాన్ని భారత్‌ తప్పుపట్టింది. పాకిస్తాన్‌ కాశ్మీరీలకు రాజకీయంగాను, నైతికంగాను, దౌత్యపరంగా మద్దతునిస్తుందని, స్వయం సాధికారతకోసం కాశ్మీరీలు చేస్తున్న పోరాటానికి పాకిస్తాన్‌ మద్దతు ఉంటుందని ప్రకటించడాన్ని భారత్‌ తీవ్రంగా విమర్శించింది. అలాగే మృతిచెందిన ఉగ్రవాది బుర్హాన్‌ వానిని అమరవీరునిగాను, స్వాతంత్య్రోద్యమంలో అసువులు బాసినట్లుప్రకటించడాన్ని కూడా భారత్‌ తప్పుపట్టింది. కాశ్మీరీల స్వయంసాధికారతకోసం, స్వేఛ్ఛకోసం జరుగుతున్న పోరాటంలో అవసరమైతే మొత్త ంపాకిస్తాన్‌ కాశ్మీరీలకు అండగా నిలుస్తుందని నవాజ్‌షరీఫ్‌ రేడియో ప్రసంగం చేయడాన్ని భారత్‌ తీవ్రంగా పరిగణించింది.