మావోయిస్టు లింకులున్నాయనే అరెస్టులు

SUPREME COURT
SUPREME COURT

మావోయిస్టు లింకులున్నాయనే అరెస్టులు

న్యూఢిల్లీ: పౌరహక్కుల కార్యకర్తలను కేవలం నిరసన తెలియజేసినందుకు పోలీసులు అరెస్టుచేయలేదని, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపైనే అరెస్టుచేసారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ అరెస్టులు, గృహనిర్బంధంకేసులకు సంబంధించి ప్రతివాదులు చేస్తున్నట్లుగా సిట్‌ దర్యాప్తు అవసరం లేదని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర పోలీసులు జరిపిన దాడుల్లో ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 28వ తేదీ జరిగిన ఈ దాడులపై సుప్రీంకోర్టు వారిని గృహనిర్బంధంలోనే ఉంచాలని, కేసు విచారణ పూర్తయ్యేంతవరకూ వారిని గృహనిర్బంధంలో మాత్రమే ఉంచాలని ఆదేశించింది. అలాగే శుక్రవారం సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ అరెస్టుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అంతేకాకుండా ఈ ఐదుగురికి నిషేధిత మావోయిస్టు గ్రూప్‌తో లింకులున్నట్లు ప్రాథమిక సాక్ష్యాలు చూపిస్తున్నారని చెపుతూ నిరసన తెలియజేసినందుకు అరెస్టుచేస్తున్నారన్న వారి వాదనను కొట్టివేసింది.

అంతేకాకుండా ఈ ఐదుగురు కార్యకర్తల డిమాండ్‌మేరకు ప్రత్యేక దర్యాప్తు టీమ్‌ ఏర్పాటుకుసైతం నిరాకరించింది. అంతేకాకుండా నిందితులు ఏ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలన్న అంశంపై సుప్రీంకు తెలియజెప్పాల్సిన అవసరం లేదని, మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగాలని సూచించింది. ఈకేసులో వారిపై నమోదయిన ఆరోపణలు కుట్రపూరితమైనవా లేక సహేతుకమైనవేనా అన్నది నిర్ధారించాల్సిన తరుణం కాదని ఛీఫ్‌జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలోని ముగ్గురుసభ్యుల బెంచ్‌ అభిప్రాయపడింది. న్యాయవాది ట్రేడ్‌యూనియన్‌ నాయిక కార్యకర్త సుధాభరద్వాజ్‌, తెలుగు కవి పి.వరవరరావు, కార్యకర్త గౌతమ్‌ నవ్లాఖా, న్యాయవాది అరుణ్‌ ఫెరీరా, వెర్నన్‌ గోన్సాల్వెజ్‌లను ఆగస్టు 28వ తేదీ దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో అరెస్టులుచేసారు. వీరికి తీవ్రవాద సిద్ధాంతయుతమైన వామపక్ష రెబెల్స్‌తో లింకులున్నాయని పోలీసులు ఆరోపించారు. వారినేనక్సల్స్‌ లేదా మావోయిస్టులని ఈ సంస్థలను ప్రభుత్వం నిషేధించిందని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

చరిత్రకారిణి రోమిల్లా థామపర్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ ఐదుగురిని జైలుకు పంపించకుండా గృహనిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది. మరో నాలుగురవారాలపాటు వీరిని గృహనిర్బంధంలోనే కొనసాగించాలని, అయితే వారికి బెయిల్‌ పొందే అవకాశం మాత్రం కల్పిస్తున్నట్లు బెంచ్‌ వెల్లడించింది. అరెస్టులకు తగిన ఆధారాలు లేవన్న పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది. నిషేధిత సంస్థలుమావోయిస్టుగ్రూపులతో వీరికి సంబంధాలున్నాయన్న అంశాలపైనే వీరిని అరెస్టులుచేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. అరెస్టు అయిన అందరికి న్యాయపరమైన ఉపశమనం లభించే అవకాశం ఉందని, అయితే ఈతరుణంలో ఈకేసులో జోక్యంచేసుకోవడం సహేతుకం కాదని, న్యాయబద్ధం కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ మాత్రం ఈ అరెస్టులను ప్రశ్నించారు. వారిపై తీవ్రారోపణలు నమోదుచేసారని, వారి నిరసనను తెలియజేసినందుకు మాత్రమే అరెస్టులుచేసినట్లు చెపుతున్నారని అన్నారు.

ముగ్గురుజడ్జిల బెంచ్‌లో చంద్రచూడ్‌ అరెస్టులను వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం కింద ప్రత్యేక విపత్కరపరిస్థితుల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని, అత్యంతప్రత్యేకపరిస్థితుల్లో మాత్రమే పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందని అన్నారు. 32వ అధికరణం కింద స్వేఛ్ఛను నిరసన తెలియజేసారని అణదొక్కే వీలులేదని అన్నారు. అమలవుతున్న నిబంధనలు, చట్టాలను అనుసరించి మాత్రమే చట్టవ్యతిరేక చర్యలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మహారాష్ట్ర పోలీసులు దాఖలుచేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో నిందితులపై మోపిన అభియోగాలకు మద్దతుగా లేవనిభావిస్తున్నట్లు తెలిపారు.అరెస్టుచేసిన వెంటనే పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటుచేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈసంఘటన దర్యాప్తు, విచారణను శంకించేదిగా ఉందని దర్యాప్తు విధానాన్ని మళ్లిస్తోందని అన్నారు.

ఇలాంటి మీడియా సమావేశాల తర్వాత మీడియా విచారణ మొదలవుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిష్పాక్షిక విచారణజరగాలని, కోర్టు పర్యవేక్షిస్తుందని, క్రమానుగతంగా ప్రగతినివేదికలు పోలీసులనుంచి రాబడుతుందని అన్నారు.

మహారాష్ట్ర పోలీసులు తమ అఫిడవిట్‌లో ఎల్గార్‌పరిషద్‌ ఆధ్వర్యంలో పుణెలో 2017 డిసెంబరు 31వ తేదీ జరిగిన కార్యక్రమంపై జరిపిన దర్యాప్తులోనే మొత్తం మావోయిస్టు లింకుల వ్యవహారం బైటపడిందని కోర్టుకు నివేదించారు. దళితసంఘాలు, పౌరహక్కుల కార్యకర్తలు సమిష్టిగా నిర్వహించిన ఈ కార్యక్రమంపైనే పూణె పోలీసులు దర్యాప్తుచేపట్టినట్లు తెలిపారు. భీమా కొరెగాంవ్‌ గ్రామంలో జనవరి ఒకటవ తేదీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. బ్రిటిష్‌ సైనికులు, దళితులు, రాష్ట్ర పేష్వా పాలకులకు జరిగిన 1818నాటి యుద్ధ విజయాలు 200 ఏళ్లు అయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో భరద్వాజ్‌ గృహనిర్బంధంలో కొనసాగారు. హైదరాబాద్‌లో వరవరరావు, నవ్లాకా ఢిల్లీలోను, ఫెరీరా, గోన్సాల్వెజ్‌లను ముంబయిలోను గృహనిర్బంధంలో కొనసాగించారు. ప్రస్తుత తీర్పుప్రకారం వీరికి మరో నాలుగు వారాలపాటు గృహనిర్బంధం కొనసాగిస్తున్నట్లు తేలింది.