మాల మహానాడు మార్చ్‌

MALA
వర్గీకరణకు వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద
మాల మహానాడు మార్చ్‌
హైదరాబాద్‌ (సైఫాబాద్‌) : ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణకు వ్యతిరేకంగా గత 22 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మాల మహానాడు గురువారం పెద్దఎత్తున మార్చ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చ్‌లో పాల్గొన్న  మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, మాల మహాసభ అధ్యక్షుడు మల్లేల వెంకట్రావు తదితరులు మాట్లాడుతూ  కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మరో అంబేద్కర్‌ కాదని మనువాది అని, వర్గీకరణ చేస్తే దేశవ్యాప్తంగా బిజెపి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దేశంలో అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టు తీర్పును కాదని, వర్గీకరణకు మద్దతు ఇచ్చి ఎంఆర్‌పిఎస్‌ను పావులాగ వాడుకుని దేశంలో దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్న వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలోని బిజెపికి పతనం తప్పదని వారు హెచ్చరించారు. దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజ్యాధికారానికి దూరం చేస్తున్న వెంకయ్య నాయుడిని అంబేద్కర్‌తో పోల్చడం సిగ్గు చేటని వారు నిశితంగా విమర్శించారు.  దశాబ్ధాలు తరబడి రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న  మనువాది పార్టీలకు ఇక కాలం చెల్లకతప్పదని వారు హెచ్చరించారు. ఎస్సీలో వర్గీకరణ జరిగితే ఉప కులాల్లో, ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చు వస్త్తుందని ఈ విషయాన్ని అగ్రకుల, మనువాద పార్టీలు గమనించకుండా వర్గీకరణకు మద్దతు ప్రకటించడం వారి అజ్ఞానానికి నిదర్శనమ న్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న చమరులు, మహరులు, రవిదాసులు, పరాంగులు, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, కేంద్ర మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్‌, ఆర్‌పిఐ అధినేత రాందాస్‌అత్వాల్‌ తదతరులతో చర్చించి ఒక సమన్వయ కమిటి వేసి దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని జి.చెన్నయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాలల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్‌, మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, నాయకులు కాశన్న, జంగా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని మాల మహానాడు ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు.