మానవతా విలువలు అందించిన బాబా

VENKAIAH NAIDU
VENKAIAH NAIDU

ప్రపంచానికి మానవతా విలువలు అందించిన
ఆధ్యాత్మిక గురువు బాబా

పుట్టపర్తి: మానవతా విలువలను మానవాళికందించి ఆధ్యాత్మిక విశ్వగురువుగా భగవాన్‌ సత్యసాయి బాబా వెలుగొందారని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సత్యసాయిబాబా 92వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి మొదట శ్రీ సత్యసాయి ఆర్కైవ్స్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సాయికుల్వంత్‌ హాల్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొని భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి, మానవతా విలువలను నిత్యం తన ప్రబోదనల ద్వారా మానవాళికందించి వారిలో పరివర్తన తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడారు. సత్యసాయి విద్యాసంస్థల్లో మానవతా విలువలతో కూడిన విద్యనిందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడన్నారు. బాబా జీవితం ప్రజాసేవకే అంకితమైందన్నారు.

బాబా ఒక ప్రాంతానికే కాకుండా ప్రపంచమే తనదిగా భావించి బోధనలందించడం వల్ల ఆయన ఆధ్యాత్మిక విశ్వగురువుగా కీర్తించబడ్డారన్నారు. ప్రజలకు సేవలందించడంపై దృష్టిపెట్టిన మానవతామూర్తి బాబాను కీర్తించారన్నారు. తాగునీరు, విద్య, వైద్యంవంటి కనీస మౌలిక వసతులపై దృష్టిపెట్టి ప్రజలకు నిశ్శేష మైన సేవలందించిన సేవాతత్పరుడు బాబా అని అన్నారు. మానవ సేవయే.. మాధవసేవగా బావించి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడన్నారు.

బాబాకు 130దేశాల్లో సాయిభక్తులున్నారంటే ఆయన ప్రేమానురాగాలు భక్తులపై వెదజల్లడం వల్లే కోట్లాదిమంది భక్తుల ప్రేమకు పాత్రుడైనారన్నారు. అనంతపురం జిల్లాలో 118 గ్రామాలతోపాటు చెన్నై, మహబూబ్‌నగర్‌, నెల్లూరు తదితర ప్రాంతాల్లో తాగునీటిని అందించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి విద్యా సంస్థల ద్వారా విలువలు, క్రమశిక్షణతోకూడిన విద్యను అందిస్తున్నారన్నారు. ఉచిత వైద్యసేవలు, ఉచిత విద్యనందిస్తూ సత్యసాయిట్రస్టు బాబా బాటలో పయనిస్తున్నదన్నారు.

సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిద్వారా 25లక్షలమందికి గుండె శస్త్రచికిత్సలు ఇప్పటికే అందించారన్నారు. ప్రపంచ పటంలో ఆధ్మాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిచెందిన పుట్టపర్తి విరాజిల్లుతున్నదంటే అందుకు బాబాయే కారణమన్నారు. ట్రస్టు ఒక మతానికి సంబంధించినది కాదని విశ్వవ్యాప్తంగా సంస్కృతికి, సర్వ మానవాళికి కృషచేస్తోందన్నారు.

గతంలో తాను ఎల్‌కే అద్వానీతో కలిసి పుట్టపర్తికి వచ్చినపుడు నీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారని గుర్తుచేసుకున్నారు. ఆసమయంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, ఈ విషయంపై బాబాకు ఎలా తెలిసిందని తాను ఆశ్చర్యపోయానన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించి ఆదుకోవడమే ఆయన గొప్పతనమని నిర్వచించారు. అం తేకాకుండా పశుపక్షాదులను పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు.

తాను ప్రారం భించిన సత్యసాయి ఆర్కైవ్స్‌లో ఈ సత్యసాయిబాబా అవతార విశేషాలను, బోధనలను, సందేశాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేయడం అద్భుతంగా ఉందన్నారు. ఇందులో సత్యసాయి బాల్యం, అవతార దశ, శివైక్యం వరకు బాబా ప్రసంగాలు, సందర్శన ప్రాంతాలు, భక్తులకు రాసిన ఉత్తరాలు,బాబా వినియోగించిన వస్తువులు, ఆధునిక సాంకేతికతను జోడించి భద్రపరిచే విధంగా జర్మనీకి చెందిన ఇంటిగ్రేటెడ్‌ కోమీస్‌ సంస్థ సహకారంతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ భవనంలో 9వేల ఆడియో క్యాసెట్లు, 5.50వేలు ఫిల్మ్స్‌, 7వేలు మ్యాన్‌స్క్రిప్ట్స్‌, 5వేల సీడీలు, 10వేల వీడియోటేప్స్‌ లక్షా 50వేల ఫోటోలు భద్రపరచడం విశేషమన్నారు.

ఇందుకు ట్రస్టు సభ్యులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు చేసిన కృషిని ఆయన అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమంలో తానుఅదృష్టంగా భావిస్తున్నానన్నారు. బాబా ప్రబోధన లను ప్రపంచానికి చాటుతూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర చీఫ్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి, హిందూపురం, అనంతపురం ఎంపీలు నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ పూల నాగరాజు, జిల్లా ఇంఛార్జి కలెక్టర్‌ టీకే రమామణి, డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌, ట్రస్టు సెక్రటరీ ప్రసాదరావు, సభ్యులు రత్నాకర్‌, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.