మాది ప్రజా మేనిఫెస్టో

K. Laxman
K. Laxman

అధికారంలోకి రాగానే 20 వేల టీచర్‌ పోస్టుల భర్తీ!
రూ.6-9 లక్షలతో పేదలకు ఇళ్లుః!! ఎస్సీ వర్గీకరణకు, ఎస్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం!!
-బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె. లక్షన్‌
రెండో విడత అభ్యర్థుల ఖరారుకు నేడు బిజెపి ఎలక్షన్‌ కమిటీ భేటీ
హైదరాబాద్‌: బిజెపిది పీపుల్స్‌ మేనిఫెస్టో అని..అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు తీసుకుంటున్నామని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.కె. లక్ష్మన్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడి పార్టీ రాష్ట్రకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..బిజెపికి అవకాశం ఇస్తే దళితుల జీవన ప్రమాణాల్లో మార్పు తెస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉందన్నారు. డప్బు, చెప్పు వృత్తిదారులకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తామని ఆయన ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే 20 వేల టీచర్‌ పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ నిరుద్యోగులకు రూ.5 వేల భృతి ఇస్తామని లక్ష్మన్‌ వెల్లడించారు. పేదలకు రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఇళ్లు నిర్మించి ఇస్తామని..ఈలోపుగా వారి ఇంటి అద్దె చెల్లిస్తామన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని లక్ష్మన్‌ వివరించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను సిద్దం చేసేందుకు బుధవారం బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇందులో ఫ్రధానంగా ఇప్పటికే 38 మందితో మొదటి విడత జాబితాను విడుదల చేయగా..రెండో విడతను ఖరారు చేసేందుకు కసరత్తు చేయటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈభేటీలో ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి వెళ్లి జాతీయ ఎన్నికల కమిటీకి అందజేసి..వారి ఆమోదంతో 2వ తేదీన ప్రకటించేందుకు బిజెపి రాష్ట్ర నేతలు సన్నాహాలు చేస్తున్నారు.