మాతృభాష మృతభాష కారాదు

TELIUGU
TELIUGU

మాతృభాష మృతభాష కారాదు

తెలుగు భాషను రక్షించుకోవడం మన కర్తవ్యం. అమృతమైన మాతృభాష మృతభాష కాకుండా ఉండాలని మనం భాషోత్సవాలను జరుపుకున్నాం. భాషను బ్రతికించుకోవడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఇప్పటికిప్పుడు భాషాభివృద్ధి చెందటం ఎండమావ్ఞల్లో నీళ్లు వెదకటమే. ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బతికిద్దాం అనడం తగలబడుతున్న తాటాకు తోపుపై తుంపర్ల జల్లు పడినట్టే. భాషను కాపాడుకోవడం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి.

ముఖ్యంగా నేటి యువత భాషకు బాగా దూరమైంది. ఇప్పటికిప్పుడు వీరిలో భాషాభిమానం పెంపొందించటం అంత సులవైన పని కాదు. రాబోయే తరమే మన ఆశాజ్యోతులు. భాషను బ్రతికించే సంజీవనులు. కాయకల్ప చికిత్స చేసే వైద్యులు.

వీరి చేతుల్లో మాత్రమే భాష భవితవ్యం ఆధారపడి ఉంది. అందుకై కొన్ని ప్రణాళికలు వేయడమే మన ముందున్న పని.బాల్యంలోనే భాషపై ఆసక్తి పెంచాలి. ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యనంతా మాతృభాషలోనే చదవాలి. ఉన్నత పాఠశాలకొచ్చేసరికి తెలుగు ఒక పటిష్టమైన అంశంగా ఉండాలి.

ఒకటో తరగతి నుండే అదనపు సమాచారం కోసం బాలసాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. భాషా వాచకాలు ఉండాలి. జీవిత చరిత్రలతో నైతిక విలువలు పెంపొందించాలి. పిల్లలను పఠనాభిలాషులుగా, పఠనాసక్తులుగా చేయకుండా భాషాభివృద్ధి చేయడం అసాధ్యం. పిల్లవాడు 10వతరగతి పూర్తయ్యేసరికి రామాయణ, మహాభారత, భాగవతాలతో పాటు ప్రపంచ మతాలన్నిటిపై అవగాహన ఉండే విధంగా పుస్తకాలు తయారవ్వాలి.

పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టించటంతో పాటు ఆధునిక, ప్రాచీన సాహిత్యాలపై ఆసక్తి కలిగే విధంగా తయారుచేయాలి. వారికై వారు సాహిత్యంలో పెరిగే విధంగా ప్రోత్సహిస్తూ అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి.

అదనపు తెలుగు తరగతులు నిర్వహించాలి. భాషా పండితులను పెంచాలి. భాషలోని విశేషాలు, చమక్కులు, చాటువ్ఞలు, ఛందస్సు, అవధానాలు వంటి పలురకాల ప్రక్రియలపై వారికి మక్కువ కలిగేటట్లు చేయాలి.

ముఖ్యంగా ప్రతి విద్యార్థికి వివిధ పోటీలలో గెలుపొందినప్పుడు ప్రోత్సాహకంగా బహుమతులుగా సాహిత్య పుస్తకాలనే ఇవ్వాలి. అలాంటపుడే భాష బ్రతుకుతుంది.