మాట-మనసు

Lord Krishna, Arjuna
Lord Krishna, Arjuna

మాట-మనసు

‘కాండక్ట్‌, ‘క్యారెక్టర్‌ అను పదాలు ఎన్నెన్నో విషయాలను తమలో ఇముడ్చకొనగల విశాలమైనవైనా ప్రస్తుతానికి మనం వాటిని ‘మాట-మనసుగా అర్ధం చేసికొంటే చాలు. ఏ వయస్సుగలవారు ఏ వయస్సువ్ఞన్న వారితో వ్యవహరిస్తున్నా ‘మాట, మంచిదై ఉండాలి. మాట మంచిదైతే ఊరు మంచిదౌతుందంటారు. ‘పృథివ్యాం త్రీణి రత్నాని. జలమన్నం సుభాషితం అని వందలేండ్ల కిందకాదు, వేల ఏండ్ల కిందట బోధించింది మన సంస్కృతి. అంటే భూమిలో మూడురత్నాలట. అవి జలం, అన్నం, సుభాషితం.

మనిషి మనుగడకు అన్నానికి, నీటికి ఎంత ప్రాధ్యాత ఉందో అంత ప్రాధాన్యత ఉంది మాటకు. మురుగునీరు తాగినా, కలుషిత ఆహారాన్ని తినినా మన జీవితం అస్తవ్యస్తమవ్ఞతుంది. అట్లే మన మాట మంచిగా లేకపోతే మన జీవితం కష్టనిష్ఠూరాలకు గురి అవ్ఞతుంది. మాట మంచిదైతే, ఉండవలసిన తీరులో ఉంటే మన జీవితం సాఫీగా సాగటమేకాక హుందాతనాన్ని, గౌరవాన్ని, అలంకారాన్ని అదనంగా పొందుతుంది. భర్తృహరి ఏమంటాడో గమనించండి. ‘భూషలుగావ్ఞ మర్త్యులకు భూరిమయాంగద. తారహారముల్‌ భూషితకేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్‌ భూషలుగావ్ఞ పూరుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్‌ నశియించునన్నయున్‌ ఇందులో ప్రతిపదానికి అర్ధం కాకపోయినా అంతోఇంతో చదువ్ఞకున్న ప్రతివ్యక్తికి ఒక విషయం అర్ధమవ్ఞతుంది. మనమాట, మాట్లాడేతీరు బాగుండాలి.

మనం చేసుకొనే అన్ని అలంకారాలు నశిస్తాయిగాని సుభూషణమైన వాక్భూషణము నశించదు. మాట మృదువ్ఞగా, మధురంగా ఉండాలి, సత్యాన్ని కలిగి ఉండాలి. ఇకపోతే మనసు-స్వార్థరహితమై, అహంకార రహితమై, ప్రేమపూరితమై ఉండాలి, జ్ఞాన నిలయమై ఉండాలి. అలాంటి వ్యక్తిని మనసున్న మహరాజని, సహృదయుడని, సత్ప్రవర్తన కలవాడని, సత్పురుషుడని అంటారు. కొంతమందిలో అబ్బురపరచే వినయం సుస్పష్టంగా కనపడుతుంది. కోటానుకోట్ల మందిచే గౌరవింపబడుతున్న మహమ్మద్‌ ప్రవక్త చిన్నపిల్లలు ఎదురైనా నవ్వుముఖంతో, మృదువుగా తనే ముందుగా వారికి నమస్కరించేవాడు, యేసుప్రభువు తన శిష్యులను కూర్చోబెట్టి తానే వారి పాదాలను కడిగి, గుడ్డతో తుడిచాడు,

శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మజుని కాళ్లను, అర్జునుని కాళ్లను పట్టుకొన్నాడు. ద్రౌపతి పాదరక్షలను మోశాడు. మంచి మనసున్నవారు అలాంటి వాటినన్నీ కృత్రిమంగాకాక చాలాచాలా సహజంగా, నిరాడంబరంగా చేస్తారు. గాంధీజీ ఏ మాత్రం గుర్తింపురాని రోజుల్లోనే ఇతరుల మలమూత్రాలను తీసివేసి ఆ స్థలాన్ని శుభ్రపరిచాడట. ఇదంతా ఏమాత్రం ప్రచారం కోసం కాదని మనకు తెలుసు. కొంతమంది పల్లెటూరి వారిని గమనిస్తే వారి మనసు మంచిదైనా మాట బాగుండదు అని తెలుస్తుంది. ‘ఎందుకా ఎండలో కూర్చోని సస్తావ్‌, ఈ మంచం మీద నీడలో కూర్చో. ఈ మజ్జిగ తాగు, పట్టు అని అంటుంది. ఓ అవ్వ కసురుకొంటున్నట్టుగా. నగరాలకు వెళితే ‘రండిసార్‌, రండి మేడమ్‌, ఇలా కూర్చోండి, కాఫీ తాగుతారా, కూల్‌డ్రింక్‌ తెమ్మంటారా?, అని ఎంతో బాగా మంచి మాటలు చెబుతారు. ఆ తర్వాత మోసంలో నిండా ముంచుతారు. అంటే వీరిలో మాట బాగుంది, మనసు చెడ్డది. ఏ మనిషియొక్క మాటా మంచిదై, మనసూ మంచిదైతే ఆ మనిషిని మహాత్ముడని, మహనీయుడని అనటంలో ఆశ్చర్యమేముంది? అలాంటి మహనీయుడు ఇతరుల కులాన్ని, మతాన్ని, వయస్సుని పరిగణించి ప్రవర్తిస్తాడా? అందరినీ, అన్నివేళలా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, అవసరమైతే సేవిస్తాడు.

శ్రీకృష్ణుడు అర్జునునికి రధసారధి కాలేదా? గౌతమబుద్ధుడు కుష్ఠురోగుల దేహాలను కడిగి శుభ్రపరచలేదా? వారి మాట వారి మనసు బాగుండటం వల్లే నేటికీ ఈ సంఘం వారికి తలవంచి నమస్కరిస్తుంది. వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారి అడుగుజాడల్లో నడవాలి. మనల్ని మనం సంస్కరించుకోవాలి, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మాటే మంత్రము, మనస్సే మందిరం. అలాగయినప్పుడే ఆత్మసాక్షాత్కారం, దైవసాక్షాత్కారం.

– రాచమడుగు శ్రీనివాసులు