మహిళ లేఖకు స్పందించిన జో బైడెన్‌

మహిళకు స్వయంగా ఫోన్ చేసిన జో..హర్షం వ్యక్తం చేసిన మహిళ

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ గత నెలలోనే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా, కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ వోల్కెర్ట్ అనే మహిళ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం పొగొట్టుకుంది. అనంతరం తనలా ఉద్యోగం కోల్పోయిన అనేకమందిని కలుసుకుని వారి పరిస్థితులను కూడా తెలుసుకుంది. దీనిపై మిచెల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఓ లేఖ రాసింది. ఈ లేఖ పట్ల బైడెన్ వెంటనే స్పందించారు. లేఖ రాసిన మిచెల్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

గత జూలైలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని, తాను పనిచేస్తున్న సంస్థలో తనతో పాటు అనేకమందిని తొలగించారని మిచెల్ వెల్లడించింది. ఇప్పుడు మరో ఉద్యోగం చూసుకుంటున్నానని, ఎవరూ ఉద్యోగం ఇవ్వడంలేదని వాపోయింది. ఆ మహిళ ఆవేదనతో బైడెన్ కదిలిపోయారు. ఉద్యోగం అనేది జీతం కోసం మాత్రమే కాదని, ఉద్యోగంతో గౌరవమర్యాదలు కూడా వస్తాయని, సమాజంలో ఓ వ్యక్తి స్థానం ఏమిటనేది ఉద్యోగమే చెబుతుందని తన తండ్రి చెప్పిన మాటలను బైడెన్ ఈ సందర్భంగా ఆ మహిళతో ప్రస్తావించారు. కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారందరినీ ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ఆదుకుంటున్నామని వెల్లడించారు.

అంతేకాదు, మిచెల్ కుమార్తెతోనూ బైడెన్ ఫోన్ లో మాట్లాడారు. ఉద్యోగం పట్ల మిచెల్ కనబరుస్తున్న తపన తనను విశేషంగా ఆకట్టుకుందని బైడెన్ ఆమె కుమార్తెతో చెప్పారు. కాగా అమెరికా అధ్యక్షుడు తనకు స్వయంగా ఫోన్ చేయడం పట్ల మిచెల్ పొంగిపోతోంది. తన తండ్రి చెప్పిన మాటలను ఆయన తనతో పంచుకోవడం తనను ఆకట్టుకుందని వెల్లడించింది.