మహిళలఫై పెరుగుతున్న హింసకు అడ్డుకట్ట ఏది?

Domestic Violence
Domestic Violence

హైదరాబాద్‌: నగరంలో మహిళల కోసం ఎన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికి వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వం మహిళల కోసం షీ టీమ్స్‌ షీ షటిల్‌, షీ క్యాబ్స్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టినప్పటికి వారిపై దాడులు ఆగడం లేదు. మహిళల భద్రత కోసం పోలీసులు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, చట్టాలపై వారికి విస్తృతంగా అవగహన కల్పిస్తుండటంతో అన్యాయం జరిగిన మహిళలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మహిళలపై నేరాల విషయంలో ఉన్నతాధికారులు స్పష్ట్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సత్వరమే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు 1446 కేసులు నమోదయ్యాయని పోలీసులు
తెలిపారు. కాగా సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో నమోదైన కేసులలో గృహహింస కేసులే అధికం. భార్యలను భర్తలు హింసించడంతో పాటు అత్తమామలు కూడా హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని. ఇప్పటివరకు గృహహింస కేసులకు సంబంధించి ఎవరిని అరెస్టు చేయలేదు. కాగా దర్యాప్తుల పేరుతో కాలం వెల్లదీస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో మహిళలపై నేరాలు పెరుగుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు దంపతులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. మరోవైపు చిన్న చిన్న తగాదాలకే గొడవలు పడుతూ తమ కాపురాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు గృహహింస కేసులను తగ్గించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఠాణాలకు వచ్చే భార్య,భర్తలకు కౌన్సిలింగ్‌ ఇస్తూ వారిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఠాణాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్ల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, దాంతో చాలా వరకు జంటలు కలిసిపోతున్నారని తెలిపారు. కాగా ఈ జంటలను కలపడం కోసం ఒక లాయర్‌, సైకియాట్రిస్టు, సైకాలజిస్టు, ఓ పోలీసు అధికారి, డాక్టర్ల బృందం కౌన్సిలింగ్‌లో పాల్గొంటున్నారు.
గృహహింస కేసులు ఎలాంటి నేరాల్లో
భౌతికంగా దాడిచేసి హింసించడం, గాయపరచడం, శృంగారం కోసం బలవంతపెట్టడం, వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించడం, అశ్లీల దృశ్యాలను చూడాలంటూ ఒత్తిడి చేయడం, శీలాన్ని శంకిస్తూ తిట్టడం, పిల్లలు పుట్టలేదని తిట్టడం, కట్నం లాంఛనాలు తేవడం లేదని వేధించడం, పిల్లల్ని దగ్గరికి రానీయకపోవడం, ఉద్యోగానికి వెళ్లకుండా, ఇతరులతో మాట్లాడనీయకపోవడం, ఖర్చులకు డబ్బులివ్వకుండా వేధించడం,ఇంట్లోకి రానివ్వకపోవడం మొదలైనవి గృహహింస కేసులు నమోదవుతాయి.కాగా గృహహింస నిరోధక చట్టం 2005లో మహిళలపై పెరగుతున్న హింసను కట్టడి చేయడానికి ఈ చట్టంను తేవడం జరిగింది.
ఐటీ ప్రొఫెషనల్సే అధికం:
నగరంలోని ఐటీ కంపెనీలలో పనిచేసే భార్యభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తూ పని ఒత్తిడి కారణంగా చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుకుపోలేక విడాకుల వరకు దారి తీస్తున్నాయి. హైటెక్‌సిటిలో నివసించే ఓ జంట కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దలు అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇద్దరు కలిసి రెండు సంవత్సరాలు ఆనందంగా జీవించారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడంతో పని ఒత్తిడి వల్ల చిన్న చిన్న బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఆమె ఎదురుతిరగడంతో కోపోద్రిక్తుడైన అతడు, అమెను చిత్ర హింసలకు గురిచెయ్యడం
ప్రారంభించాడు.దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు చివరికి గుర్తించిన విషయం ఏమిటంటే ఆమె అతని కంటే ఎక్కువ సంపాదిస్తుండటమే కాక అతనికి ఎదురుతిరగడమే కారణమని పోలీసులు గుర్తించారు. ఐటీ కారిడార్‌లో నివసించే భార్యభర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్లు తెలిపారు. కాగా పోలీసులు వారిని ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్ల ద్వారా వారిని కలుపుటకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికి వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తున్నారు.కాగా గృహహింస కేసులపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.