మహిళలకు వడ్డీ లేని రుణాల బకాయిల విడుదల

JUPALLY
JUPALLY

ఈ యేడాది రూ.8800కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
గ్రామాల్లో పారిశుధ్యలోపం లేకుండా ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి
కేరళ వరద బాధితులకు అందరం అండగా నిలుద్దాం
పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాక మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్‌: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన రూ.902కోట్ల బకాయిలను విడుదల చేశామని, కేంద్రం విడుదల చేయాల్సిన మరో రూ.339కోట్లను విడుదల చేయించేందుకు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో లక్షా 74వేల 46 మహిళా సంఘాలకు దాదాపు రూ.7900కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా అందజేయడం జరిగిందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అర్హత ఉన్న 3లక్షల 23వేల 770 మహిళలకు రూ.8800కోట్ల రుణాలను ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో ఇప్పటికే రూ.2000కోట్ల రుణాలను అందజేశామన్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యలోపం లేకుండా ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించామన్నారు. మురికినీరు నిలువ ఉండకుండా చూడటం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్‌ చేయడంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లాంటి పనులను చేపట్టాలని ఆదేశించామన్నారు. అవసరమైతే దినసరి కూలీలను నియమించుకుని అయినా పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. దీనికోసం డిపిఓలు, ఎంపిడిఓలు, ఈఓ, పిఆర్‌డిలు ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలని సూచించారు. తెలంగాణలోని ప్రతి గ్రామం పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారదర్శకంగా స్థానిక పాలన జరిగే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కొత్త పంచాయితీరాజ్‌ చట్టానికి రూపకల్పన చేశారన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం పనిచేయని విధంగా దాదాపు 1200కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్‌లోనే పంచాయితీలకు కేటాయించినట్లు మంత్రి గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటి వరకు పంచాయితీల్ల తక్కువ వేతనాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాన్ని రూ.8500 రూపాయలు చేయాలని సిఎం కెసిఆర్‌ మానవతా దృక్పథంతో నిర్ణయించారన్నారు. ఆ వేతనాన్ని కూడా నేరుగా కార్మికుని బ్యాంకు ఖాతాలోనే పంచాయితీలు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆ దిశగా ప్రతి 500 మంది జనాభాకు ఒక పారిశుధ్య కార్మికున్ని నియమిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జోనల్‌ విధానంపై కేంద్రం నుంచి క్లారిటీ రాగానే గ్రామ కార్యదర్శుల నియామకాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 112, 212 జిఓలు మేరకు 1994 కంటే ముందు నుంచి పంచాయితీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 90శాతం క్రమబద్దీకరికరణ చేశామని, ఇంకా ఎవరైనా మిగిలిపతే వారిని కూడా క్రమబద్దీకరిస్తామన్నారు. కేరళ వరద బాధితులకు నెల వేతనాన్ని విరాళంగా మంత్రి ప్రకటించారు. ఈ ప్రకృతి విపత్తుపై ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.