మహిళలకు ఆయుధం గృహహింస చట్టం

మహిళలకు ఆయుధం గృహహింస చట్టం

domestic voilence act
domestic voilence act

బాధితురాలిని హింసించే వ్యక్తి బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఎవరైనా ప్రతివాది అవుతారు. మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడం, బాధించడం, కించపరచడం, ఆర్థిక ఇబ్బందులు కల్గించడం, బెదిరించడం, దౌర్జన్యానికి పాల్పడటం ఇవన్నీ గృహ హింస పరిధిలోకి వస్తాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా ఎలాంటి రకమైనా హింసకు గురైనా అది గృహ హింస పరిధిలోకి వస్తుంది.
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా మహిళల పట్ల వ్యవహరించే తీరు మారడం లేదు. మహిళల కోసం ఎన్నో చట్టాలు రూపొందించిన వారు వేధింపుల నుంచి బయిట పడటం లేదు. ‘కట్నం కోసం వివాహితపై వేధింపులు, 20ఏళ్ల యువతిని వేధిస్తున్న బంధువులు, మరో పెళ్లి కోసం భార్యను చంపిన భర్త ఇలా నిత్యం ఏదో ఒక మూల నుంచి మహిళలపై వేధింపులకు సంబంధించిన వార్తలు వింటూనే ఉంటాం. ఇలాంటి దాడుల నుంచి బయిటపడేందుకు ఆడబిడ్డకు అండగా నిలబడేందుకు 2005లో మహిళలకు రక్షణగా గృహహింస చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా 2006లో ఇది అమలులోకి వచ్చింది. వేధింపులకు గురైన స్త్రీలకు బాసటగా నిలిచేందుకు సెక్షన్‌ 43 ద్వారా కేంద్ర ప్రభుత్వం గృహహింస నివారణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2006 అక్టోబర్‌ 26న అమల్లోకి తీసుకొచ్చారు. వివిధ రకాలుగా గృహాల్లో వేధించబడి నిస్సహాయతకు గురైన మహిళలకు అండగా నిలబడి న్యాయం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఈ చట్టం పక్కాగా అమలైతే చట్టం మహిళకు మహాయుధమే. ఈ చట్టం వచ్చి 12 సంవత్సరాలు దాటినా దీనిపై నేటికీ ఎంతోమంది మహిళలకు అవగాహన లేదు. ఈ చట్టం ప్రతి మహిళకు తెలియాలనే ఉద్ధేశ్యంతో ప్రత్యేక కథనం మీకోసం..
గృహహింస పరిధిలోకి వచ్చే నేరాలు…
వ్యవస్థలో ఉన్న పద్ధతుల కారణంగా సమాజంలోనే కాకుండా ఇంట్లోనూ స్త్రీ, పురుష సంబంధాలు గొడవలకు కారణమవుతున్నాయి. ఇందులో మూర్ఖత్వం, మానసిక అపరిపక్వతలోపించి గృహహింసకు దారితీస్తున్నాయి. చాలామంది మగవాళ్లు భయంలేని తనంతో ఆడవాళ్లపై క్రూరంగా వ్యవహరించడం మన సమాజంలో నిత్యం చూస్తున్నాం. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొనే మహిళకు రక్షణగా ఈ చట్టం ఉపయోగపడుతుంది. పైశాచికంగా వ్యవహరించే వ్యక్తులను కటకటాలపాటు చేయడమే కాకుండా వారి నుంచి తగిన మూల్యం చెల్లిస్తుంది ఈ చట్టం. అత్తవారింట్లోగానీ, బాధితులు నివసించే, పనిచేసే, ఏ నివాస ప్రాంతంలో వేధింపులు చేసిన గృహహింస కిందకు వస్తుంది. ఈ చట్టం ప్రకారం బాధితులు, ప్రతివాది మధ్య సంబంధం భార్యాభర్తల సంబంధమే కానక్కర్లేదు. బాధితురాలిని హింసించే వ్యక్తి బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఎవరైనా ప్రతివాది అవుతారు. మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడం, బాధించడం, కించపరచడం, ఆర్థిక ఇబ్బందులు కల్గించడం, బెదిరించడం, దౌర్జన్యానికి పాల్పడటం ఇవన్నీ గృహ హింస పరిధిలోకి వస్తాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా ఎలాంటి రకమైనా హింసకు గురైనా అది గృహ హింస పరిధిలోకి వస్తుంది. తండ్రి, సోదరులు, కొడుకుల, వివాహనంతరం ఏర్పడిన బంధుత్వాలు, భర్త, అత్త, మామ, మరుదులు, ఆడపడుచులు, దత్తత తీసుకున్న తండ్రి ఇబ్బందులు పెట్టినా, సహజీవనం, రెండో వివాహం చేసుకున్న దానిపై బాధకు గురైనా ఈ చట్టాన్ని ఆశ్రయించవచ్చు.
ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలి?
హింసకు గురైన మహిళగాని, ఆమెకు సంబంధించిన బంధువులు కానీ, లేదా చూసిన వ్యక్తులు కాని ఎవరైనా అట్టి సమచారాన్ని అందించవచ్చు. జిల్లా శిశు సంక్షేమ శాఖాధికారి, జిల్లాలోని ఆర్‌డిఓలు రక్షణాధికారులుగా ఉంటారు. హింసకు గురవుతున్న సమాచారాన్ని నేరుగా స్వచ్ఛంద సంస్థలకు గాని, మెజిస్ట్రేట్‌కు గానీ అందించవచ్చు. బాధితురాలు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెకు అవసరమైతే చికిత్స ఇప్పించే అధికారం కూడా రక్షణాధికారికి ఉంది. – బాధితురాలు పైన సూచించిన ఏ కార్యాలయంలోనైనా నేరుగా కానీ, సంబంధితుల సాయంతోగానీ ఫిర్యాదు చేయవచ్చు. మహిళలకు అర్థమయ్యే విధంగా దరఖాస్తు ఫారం 1లోనే ఉంటాయి. బాధిµతురాలు తనకు సంబంధించిన దానిపై టిక్‌చేస్తే సరిపోతుంది. – గృహ హింస నిరోధక చట్టాన్ని ఆశ్రయించే మహిళలకు ఎటువంటి హద్దులు లేవు. – బాధితురాలు నివాసం ఉంటున్న దగ్గరకానీ, ఉద్యోగం చేస్తున్న చోటగాని, భర్త నివసిస్తున్న చోటగాని కేసు పెట్టవచ్చు. – బాధితురాలు చిరునామా చెప్పి రక్షణ కోరితే రక్షణ కల్పించి అవసరమైతే వసతి కల్పించాలి.
ఫిర్యాదుతో ఫలితాలు..
గృహ హింసపై ఫిర్యాదు పరిష్కారానికి పోలీసు, మహిళా శిశు సంక్షేమ, న్యాయశాఖలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ పిడి ముఖ్య రక్షణ అధికారిగా వ్యవహరిస్తారు. బాధితులు ఫిర్యాదు చేసిన తరువాత సంబంధిత అధికారుల బృందం సంఘటనపై విచారణ చేపట్టాలి. మహిళలకు అవసరమైతే వసతి, రక్షణ సదుపాయాలు కల్పించాలి. కోర్టుపరంగా ఫిర్యాదు మేరకు జిల్లా మొదటి తరగతి న్యాయమూర్తి కోర్టులో కేసు దాఖలు చేస్తారు. న్యాయమూర్తి ఫిర్యాదు అందిన మొదటి 3రోజుల్లో వాదన వినాలి. వాదనలు విన్న 60రోజుల తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తారు. న్యాయమూర్తి ఆదేశాలు ధిక్కరిస్తే రూ.20వేలు జరిమానా విధిస్తారు లేదా ఒక సంవత్సరం పాటు కారాగార శిక్ష అమలు చేస్తారు. బాధితురాలి సమస్యలు, అవసరాలకు అనుగుణంగా సహాయకరంగా పోలీసు, మహిళా శిశు సంక్షేమశాఖలు వ్యవహరిస్తాయి.
మహిళకు ఎలాంటి రక్షణలు కల్పించబడతాయి..
– కోర్టు నుంచి తీర్పు వెలువడే వరకు ఎలాంటి గొడవలకు పోకూడదు. బాధితురాలు ఉద్యోగి అయితే ఆమె కార్యాలయానికి వెళ్లి గొడవ చేయవద్దు. దూరంగా ఉన్నా బెదిరింపులకు పాల్పడవద్దని ఆదేశాలిస్తారు. – భార్యభర్తలు కలిసి ఉంటే అక్కడే మహిళకు స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తారు. ఇంటిలోనే ప్రత్యేక వాటాలో నివసించే అవకాశం కల్పిస్తారు. – భార్య పిల్లలను తన స్థోమతకు తగినట్లు భర్త పోషించాలి. పిల్లల బాధ్యతను అదనంగా తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగి అయితే కొంత భాగాన్ని భార్య అకౌంట్‌లో వేయాలని ఉత్తర్వులు ఇస్తారు. – భర్తవల్ల భార్య మానసికంగా, శారీరకంగా వేదనకు గురై ఉంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు భార్య వద్ద ఉన్నా…పోషణ బాధ్యత తండ్రిదే. భర్య సంపాదించినప్పటికీ భర్త మెయింట్‌నెన్స్‌ ఇవ్వాల్సిందే.
గృహహింస నిరూపణలో జాగ్రత్తలు అవసరం..
గృహ హింస జరిగిందని నిరూపించే ముఖ్య పత్రాలు, ఫోన్లు, ఉత్తరాల ద్వారా వచ్చిన సమాచారాన్ని భద్రపరచాలి. గాయాలకు సంబంధించి సాక్ష్యాలు, పోలీస్‌ ఫిర్యాదు కాపీలు, కోర్టు ద్వారా వచ్చిన ఆదేశాలను దగ్గర ఉంచుకోవాలి. వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఫోటోలు, ఆస్తికి సంబంధించిన సర్టిఫికెట్లు, రేషన్‌ కార్డు జాగ్రత్త చేసుకోవాలి.
– పోతుగంటి వెంకట రమణ