”మహాసంప్రోక్షణ”కు వెలిగిన హోమగుండం

TTD
TTD

-మూలమూర్తి,దేవతామూర్తుల శక్తి కుంభంలోకి ఆవాహనం
తిరుమల: ప్రపంచంలోనే ప్రధానమైన హిందూవైష్ణవ ఆలయంగా ఖ్యాతిచెందిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఆనందనిలయంలో ”అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఉదయం ఒక హోమగుండం వెలిగించడంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6గంటలకు శుభముహూర్తంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితుల ఆధ్వర్యంలో 44మంది రుత్వికులు,16మంది సహాయకులు,100మంది వేదపారాయణదారులు, వేదపండితులు వేదమంత్రోచ్చరణలనడుమ యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం,పంచగవ్యారాధన,వాస్తుహోమం, రక్షాబంధనర చేశారు. దీంతో తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో పవిత్రంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు మొదలయ్యాయి.
-విశేషహోమాలకు బంగారుకూర్చ సిద్దం:
శేషాచలంకొండల్లో వెలసిన తిరుమలేశుని ఆలయంలో ఆరురోజులపాటు అత్యంత వైభవంగా..పరమపవిత్రంగా,భక్తిప్రపత్తులతో నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక విశేష హోమకార్యక్రమాలకు వినియోగించే ”బంగారుకూర్చను టిటిడి సిద్దం చేసింది. 300గ్రాముల బంగారంతో దీన్ని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. ప్రకృతిసిద్దమైన ఈ కూర్చ దేవతల ఆవాహనకు పరమపవిత్రంగానూ భావిస్తారు. అయితే టిటిడి అధికారులు తిరుమలలో ప్రారంభమైన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి బంగారుకూర్చను తయారుచేశారు. ఈ కూర్చలోనికి మంత్రావాహనచేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు. ఆనందనిలయంలోని శ్రీనివాసుడి మూలమూర్తిని ఆవాహనచేసిన బంగారుకలశంతోబాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తామని తిరుమల జెఇవో కెఎస్‌ శ్రీనివాసరాజు తెలిపారు.
-”మూలమూర్తి,దేవతామూర్తులకళాకర్షణ:
హిందూసాంప్రదాయాల మేరకు వైష్టవాలయాలలో ప్రతి పుష్కరకాలానికి(12ఏళ్ళకు)ఆలయంలోని స్వామివారి శక్తిని ద్విగుణీకృతంచేయడానికి ”అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకార్యక్రమం చేపడతారు. ఇందులోభాగంగానే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆనందనిలయంలో కొలువైన దివ్యమంగళమూర్తి సాలిగ్రామ శిలారూపంలో వున్న ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుడు మూలమూర్తితోబాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని బింబంలోనుంచి ”కుంభం(కళశం)లోనికి ఆవాహనచేశారు. ఆదివారం రాత్రి దివ్యమంగళ శుభఘడియలు రాత్రి 7గంటలనుంచి 9గంటలమధ్య ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితుల,రుత్వికులు,అర్చకులు వేదమంత్రోచ్చరణల మధ్య అత్యంత భక్తిపూర్వకంగా స్వామివారి శక్తిని ఆవాహనం చేశారు. శ్రీనివాసుడి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు,నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి,కటి,మోకాలు, పాదాల్లో 12 జీవస్థానాలు వుంటాయి. ఒక్కోజీవస్థానానికి 4కళల చొప్పున మొత్తం 48కళలను కుంభంలోనికి ఆవాహనచేసుకున్నారు.
-ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని:
ఆనందనిలయంలోని మూలమూర్తి శక్తినికుంభంలోకి తీసుకున్నతరువాత ఈ కుంభాలతోబాటు భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి,ఉగ్రశ్రీనివాసమూర్తి, చక్రత్తాళ్వార్‌, శ్రీసీతాలక్ష్మణసమేత శ్రీరాములు,రుక్మిణీసత్యభామసమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవవమూర్తులను యాగశాలలోనికి వేంచేపుచేశారు. ఉప ఆలయాల్లోని జయవిజయులు,ధ్వజస్తంభం, వ్రీవిశ్వక్సేనుడు, గరుడాళ్వార్‌, ప్రసాదంపోటులోని అమ్మవారు,లడ్డూపోటులోని అమ్మవారు, భాష్యకారులు, యోగనరసింహస్వామి, వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయస్వామి శక్తిని కూడా కుంభంలోనికి ఆవాహనం చేసి యాగశాలకు తీసుకెళ్ళారు. యాగశాలలో మొత్తం 18వేదికలపై కుంభాలను కొలువుదీర్చారు. యాగశాలలో ఆదివారం నుంచి గురువారం వరకు ప్రతిరోజూ నిత్యకైంకర్యాలతోబాటు ఉదయం 6గంటలనుంచి విశేష హోమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో టిటిడి ఇవో అనిల్‌కుమార్‌సింఘాల్‌, తిరుమల జెఇవో కెఎస్‌ శ్రీనివాసరాజు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు, ఓఎస్‌డి పాలశేషాద్రి, ఆలయ డిప్యూటీ ఇవో పి.హరీంధ్రనాథ్‌,రుత్వికులు పాల్గొన్నారు.