మళ్లీ డ్రాగన్‌ డొంకతిరుగుడు వైఖరి!

china
china


పొరుగుదేశంలో పెట్టుబడులుపెట్టి మరీ అంతర్జాతీయ కారిడార్లనిర్మాణానికి పూనుకుంటూ పాకిస్తాన్‌ను మచ్చికచేసుకుంటున్న చైనా భారత్‌పట్ల తన డొంకతిరుగుడు వైఖరిని ఇప్పటికీ మార్చుకోలేదు. అగ్రరాజ్యాలు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని సైతం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అడ్డుకున్నదంటే నిస్సంకోచంగా పాకిస్తాన్‌కు మద్దతునిస్తున్నట్లే స్పష్టం అవుతోంది. కేవలం ఆదేశానికేకాదు ఉగ్రవాద సంస్థ జైషేముహ్మద్‌కుసైతం మద్దతిస్తున్నట్లు భావించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరుదేశాలమధ్య చర్చలు సంప్రదింపులద్వారా ఏకాభిప్రాయసేకరణతో ఈ వివాదానికి తెరదించాలన్న భావనను వ్యక్తంచేస్తోంది.

అంతేకాకుండా అవసరమైతే తాను రెండుదేశాలకు మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నామని నిస్సిగ్గుగా ప్రకటించింది. గతనెలలో 26వ తేదీ జరిగిన పుల్వామా దాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండతలి సమావేశం తీవ్రనిరసన వ్యక్తంచేసింది. అంతేకాకుండా జైషేముహ్మద్‌ ఉగ్రవాదసంస్థపేరునుసైతం తన తీర్మానంలోప్రస్తావించింది. అప్పటివరకూగడువు కావాలని రెండుసార్లు వాయిదావేసిన తీర్మానానికి గత్యంతరంలేక చైనా ఆమోదం తెలిపింది. పుల్వామా సంఘటనతో రెండుదేశాలమధ్య ఉద్రిక్తతలుమరింతపెరిగాయని, రెండుదేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తిచేస్తూనే ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తుదముట్టించాల్సిందేనని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.

అంతేకాకుండా పాకిస్తాన్‌ ఈ దిశగా చర్యలుచేపట్టాలని ఒత్తిడి తెచ్చింది. కేవలం సమితి భద్రతామండలి మాత్రమే కాకుండా అగ్రరాజ్యాలు ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌, రష్యా వంటి దేశాలుసైతం పాక్‌పై ఒత్తిడిని పెంచాయి. దౌత్యపరంగా కూడా పాక్‌ను ఏకాకినిచేసే లక్ష్యంతోభారత్‌ ముమ్మర కసరత్తులు చేయడంతో ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్‌ 44 సంస్థలను నిషేధించింది. జమాత్‌ ఉద్‌ దవా సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌సయీద్‌, జైషే ముహ్మద్‌ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజర్‌ కుటుంబసభ్యులు రక్తసంబంధీకులనుసైతం అదుపులోనికి తీసుకున్నట్లు ప్రకటించింది. తమ గడ్డపై ఉగ్రవాదానికి ఏరూపంలో సహకరిస్తున్నా వెంటనే చర్యలు తీసుకుంటామని, వాటికి నిధులు అందించే సంస్థలను కూడా కఠినంగా శిక్షిస్తామంటూ ప్రకటనలు గుప్పించింది.

పాకిస్తాన్‌ ఓవైపు కఠిన కార్యాచరణ అమలుచేస్తుంటే అదే పుల్వామా దాడికి తామే బాధ్యులమని నిస్సిగ్గుగా ప్రకటించిన జైషేముహ్మద్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా నిషేధించాలని, వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ నిషేదిత ఉగ్రనేతగాప్రకటించాలన్న డిమాండ్‌కు చైనా ఎందుకు అడ్డు చెపుతున్నదో అంతుబట్టకుండా ఉంది. అయితే మూడుదేశాలు చేసిన ప్రటిపాదనలకు అల్‌ఖ్వయిదా ఆంక్షలకమిటీసభ్యులకు తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు పదిరోజుల వ్యవధి ఉంది. ఈగడువు ఒకరోజులోముగుస్తుందనగా చైనా సాంకేతికపరమైన లోపాలను ఎత్తిచూపుతూ అడ్డుతగిలింది. పరిశీలనకు మరింత వ్యవధి కావాలనికోరింది. వరుసగా నాలుగోసారికూడా చైనా ఈప్రతిపాదనలను అడ్డుకుంటున్నట్లు స్పష్టం అయిది.

ఎందుకు అడ్డుకుంటున్నారన్న వాదనపై చైనా విదేశాంగప్రతినిధి లూక్వాంగ్‌ వింతసమాధానాలు కప్పదాటు వైఖరినే స్పష్టంచేస్తున్నాయి. చివరి అస్త్రంగా మాత్రమే నిషేధం ఉండాలని, ఈలోపు చర్చలద్వారాను, సంప్రదింపులు మధ్యవర్తిత్వంద్వారా ఉద్రిక్తతలు సడలించేందుకు కృషిజరగాలని, అవసరమైతే చైనా మధ్యవర్తిపాత్ర పోషిస్తుందని చెపుతోంది. ఇపుడు చైనా అడ్డుకున్నందున ప్రత్యామ్నాయాలనుసైతం అగ్రరాజ్యాలు అన్వేషిస్తున్నాయి. భద్రతామండలిలో చైనా కాకుండా సమితి 1267 ఆంక్షలకమిటీ నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు. ఇదే అదునుగా పాకిస్తాన్‌కు వెన్నుదన్నుగా నిలిచి చైనా భారత్‌ కసరత్తులకు అడ్డంకులు వేస్తోంది.

ఓపక్క వుహాన్‌లో ఇరుదేశాల ప్రతినిధులమధ్య జరిగిన అనధికారిక సమావేశం ద్వైపాక్షిక బంధాన్ని మరింతపటిష్టంచేయాలని సూచిస్తుంటే మరోపక్క జింగ్‌పింగ్‌ అధ్యక్షతన ఉన్న చైనా నిస్సిగ్గుగా పాకిస్తాన్‌కు మద్దతివ్వడం వెనుక ఆదేశంలో ఉన్న పెట్టుబడులేకారణమని తెలుస్తోంది. కాశ్మీర్‌ సమస్యపై చైనా వైఖరి స్థిరంగా యధాతథంగా కొనసాగుతుందని వెల్లడించిందంటే పాకిస్తాన్‌కు ఇక నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న సంకేతాలను ఇచ్చినట్లయింది. ఇక చైనా ధోరణితో భద్రతామండలిసైతం ప్రత్యామ్నాయాలవైపు దృష్టిసారించాల్సిన పరిస్థిత ఇఎదురయింది. చైనా ఇదేధోరణిని కొనసాగిస్తే ఇతర కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని భద్రతామండలి సభ్యదేశాలు ఇప్పటికే హెచ్చరించాయి.

మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిన అనివార్యపరిస్థితులు ఎదురయ్యాయని ఇందుకు అభ్యంతరాలు ఎన్ని ఉన్నా దాడిజరిపినట్లు స్వయంగా ప్రకటించినందున ఖచ్చితంగా అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించాల్సిందేనన్న భావనలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క చైనా మిన-

హా ఇతర సభ్యదేశాలన్నీ కూడా ఉగ్రసంస్థలను ఏరిపారేయాలని, జైషేను అంతర్జాతీయ నిషేదిత జాబితాలోచేర్చాలని పట్టుబడుతున్నాయి. చైనా తన సొంత లక్ష్యాలకోసం అడ్డుకోవడం సరికాదని భారత్‌అంతర్జాతీయంగా గెంతెత్తి తన వాణిని వినిపించింది. దక్షిణాసియాలో ప్రాంతీయ స్థిరత్వం కోసం ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాల్సిందేనన్న భారత్‌

వాదనకు పదేళ్ల తర్వాత సంపూర్ణమద్దతు లభించింది. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే ఇక భారత్‌ కార్యాచరణ ఏకపక్షంగాప్రారంభించక తప్పదని నిస్పందేహంగా చెప్పవచ్చు. భద్రతామండలిలో సభ్యదేశంగా భారత్‌ను చేర్చుకునే ప్రతిపాదనపైమోకాలొడ్డిన చైనా ఇపుడు అంతర్జాతీయ ఉగ్రవాదసంస్థలను నిషేధించేందుకు సైతం డొంకతిరుగుడు వైఖరితో అడ్డంకులు సృష్టిస్తున్నందే భారత్‌ అభివృద్ధిపై ఆసియా అగ్రరాజ్యానికిసైతం చెప్పలేనంత అసూయ ఉందని నిర్ద్వందంగా చెప్పవచ్చు.

  • దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌