మరిన్ని వరాల కోసం కెసిఆర్‌ కసరత్తు

TS CM KCR
TS CM KCR

5,6వ తేదీల్లో మరోసారి కేబినెట్‌ భేటీ
10 లోగా వీడనున్న ‘ముందస్తు’ సస్పెన్స్‌
‘ప్రగతి నివేదన సభ’ తీరుతో పునరాలోచన
హైదరాబాద్‌: ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిఆర్‌ఎస్‌ గెలవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరిన్ని ఎన్నికల వరాలు ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 5,6వ తేదీల్లో మరోసారి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్‌ అజెండాపై మంగళవారం మధ్యాహ్నంలోగా అన్ని శాఖల నుంచి జిఏడి సమాచారం సేకరించనుంది. ఈసారి కేబినెట్‌ భేటీ కూడా ఎన్నికల వరాలపై చర్చించనుంది. పలు అంశాలపై రాటిఫికేషన్‌, మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కాగా, ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంలో సిఎం కెసిఆర్‌ ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ప్రగతి నివేదన సభ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని టిఆర్‌ఎస్‌ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. 25లక్షల మందితో బహిరంగ సభ అని చెప్పినప్పటికీ అంత స్థాయిలో జనం హాజరు కాక పోవడం స్పష్టంగా కనిపించింది.ఎంతో కొంత అశేష జనం వచ్చినా ఆ బహిరంగ సభ ద్వారా ఒక రాజకీయ నిర్ణయాన్ని, కొత్త వరాలను ప్రకటించకపోవడంతో జనం అసంతృప్తిగానే తిరిగి వెళ్లారు. ప్రగతి నివేదన సభలో నాలుగున్న ఏళ్ల ప్రగతిపై లక్షల్లో కరపత్రాలు పంపిణీ చేయడం బాగానే ఉన్నా, అవే కరపత్రాలు కేడర్‌ ద్వారా ప్రజలకు ఇంటింటికి పంపిణీ చేయించి నా బాగుండేదని సీనియర్లు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ప్రగతి నివేదన సభ ముందస్తుగా జరగడం వల్ల పార్టీ పరిస్థితి ఎలా ఉందో కెసిఆర్‌ తెలిసి రావడం ఒక రకంగా మంచిదేనని అంటున్నారు. నేతలు జనాన్ని తరలించే ందుకు అధికారికంగా భాగానే ఖర్చులు చేసినా అనుకున్నంత జనం రాలేదని అంతర్మధనం ఉంది. ఈ పరిస్థితిని ప్రతిపక్షాలు ఇప్పుడు బాగానే ఉపయోగించుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ వ్యూహం మార్చే అవకాశం లేకపోలేదని అంటు న్నారు. ముందస్తు ఎన్నికల విషయంపై రాజకీయ నిర్ణయం తీసుకునే బాధ్యత మంత్రులు సిఎం కెసిఆర్‌ అప్పగించిన విషయం తెలిసిందే. తెలంగాణకు, పార్టీకి ఏది మంచిదైతే అ నిర్ణయం తీసుకోవాలని మంత్రులు తనకు బాధ్యత అప్పగిం చారని కెసిఆర్‌ సభా ముఖంగా కూడా వెల్లడించారు.
ఎన్నికల వరాలు ప్రకటించేందుకు ఇది వేదిక కాదని భావించిన ఆయన కేశవరావు నాయకత్వంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీని నియామకం చేస్తామని వెల్లడించారు కూడా. మొత్తంగా ముందస్తు ఎన్నికలపై ఆయన సందిగ్దతను ఇంకా కొన సాగిస్తున్నారు. ఈనెల 10వ తేదీలోగా ఏదో ఒక స్పష్టతకు రావచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. 19 ఏళ్ల ఉద్యమంలో కెసిఆర్‌ని చూశాం,ఆయన ఎవరికీ చిక్కడూ దొరకడు, ఈ సభ ద్వారా ఆయన చాలా సాధించాడు, ప్రతిపక్షాలకు అర్థం కాని ఆయన వ్యూహాలేంటీ, ప్రగతి నివేదన సభ పేరుతో ఆయన చేసిందేంటీ? అని విశ్లేషణలు మరోవైపు సాగుతున్నా,మరో 10ఏండ్ల పాటు ఆయనే సిఎం అనేది సభా ముఖంగా కేశవరావు ప్రకటించడం శ్రేణుల్లో ఉత్సాహం పెంచింది. అయితే కెకె ప్రకటనతో ముందస్తు ఎన్నికలు కెటిఆర్‌ను సిఎం చేసేందుకే అనే ప్రచారం పటాపంచలైంది. ఇప్పట్లో కెటిఆర్‌ సిఎం కారనేది తేలిపోయింది. కెసిఆర్‌ నాయకత్వం రాష్ట్రానికి ఇంకా అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నారు.అందుకేనేమో కెటిఆర్‌ కాబోయే సిఎం అని సంకేతాలు ఉండటంతో పార్టీ శ్రేణులు ఆయన నాయకత్వంలో జరిగిన ప్రగతి నివేదన భారీ బహిరంగ సభకు అంతగా జనాన్ని తోలుకు రాలేదు. హరీష్‌రావు మాస్‌ లీడర్‌ అయితే, కెటిఆర్‌ క్లాస్‌ లీడర్‌, ఇటువంటి బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు సాధారణంగా ఎప్పుడూ కెసిఆర్‌ హరీష్‌ రావునే రంగంలోకి దించేవారు.కానీ మొదటిసారిగా పుత్ర ప్రేమతో కెటిఆర్‌ను బరిలోకి దించారు.సభ నిర్వహణలో హరీష్‌ రావు పాత్ర లేకపోవడం కూడా సభకు కొంత మైనస్‌ అయింది. పైగా ఉమ్మడి రాష్ట్రంలో మాస్‌ ముఖ్యమంత్రిగా పేరొందిన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హెలి కాప్టర్‌లో దుర్మణం పొందిన రోజు సెప్టెంబర్‌2న టిఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ జరుపుకోవడం ఎలా సెంటిమెంట్‌ అవుతుందనే ప్రశ్న ఉంది.మొత్తంగా ప్రగతి నివేదన సభ తీరు అటు ప్రతిపక్షాలు వాయిస్‌ పెంచుకునేందుకు ఉపయోగపడగా, ముందస్తు ఎన్నికల పరిస్థితి ఎలా ఉందో ముందే తెలుసుకునేందుకు కెసిఆర్‌కు ఉపకరిం చిందని తెలుస్తోంది.