మయన్మార్‌లో సోషల్ మీడియాపై ఆంక్షలు
ట్విట్టర్, ఇన్‌స్టా బ్లాక్ చేసిన తిరుగుబాటు నేతలు
Myanmar military leaders block Twitter and Instagram
యంగన్: మయన్మార్ సైన్యం ఇటివల ప్రభుత్వంపై తిరుగుబాటుకు పాల్పడి అక్కడి టాప్ నేతలనందరినీ గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజాగ్రహాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియాపై సైతం ఆంక్షలు విధిస్తున్నది. రెండు రోజుల క్రితం మయన్మార్‌లో ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేశారు. తాజాగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సేవలను కూడా నిలిపివేశారు. మయన్మార్‌లో టెలినార్ సంస్థ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నది. అయితే తదుపరి ఆదేశాలు అందేవరకు ట్విట్టర్, ఇన్‌స్టాలను ఆపేయాలని ఆ సంస్థకు సైనిక ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. దేశ స్థిరత్వం కోసమే ఫేస్‌బుక్‌ను బ్లాక్ చేసినట్లు తిరుగుబాటు నేతలు ప్రకటించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనవారిని అరెస్టు చేస్తున్న విధానం పట్ల దేశవ్యాప్తంగా ఉద్యమం చెలరేగుతున్నది. యంగన్ నగరంలో వర్సిటీ టీచర్లు, విద్యార్థులు.. డిఫాక్టో నేత ఆంగ్ సాన్ సూకీకి మద్దతుగా నినాదాలు చేశారు.ప్రస్తుతం సూకీ గృహ నిర్బంధంలో ఉన్నారు.