మన న్యాయవ్యవస్థ మెరుగ్గా పనిచేసింది..ప్రధాని

గుజరాత్‌ హైకోర్టు డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో మోడి

PM Modi addresses Diamond Jubilee celebrations of Gujarat High Court

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి గుజరాత్‌ హైకోర్టు డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..కరోనా మహమ్మారి వెంటాడినా మన న్యాయవ్యవస్థ మెరుగ్గా పనిచేసిందని అన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక కేసులను విచారించిందని న్యాయవ్యవస్ధపై ప్రశంసలు గుప్పించారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు సైతం కొవిడ్‌ సమయంలో పెద్దసంఖ్యలో ఈ ప్రొసీడింగ్స్‌ చేపట్టాయని గుర్తుచేశారు.

న్యాయవ్యవస్ధ నిరంతరం తన విధులు నిర్వర్తిస్తూ రాజ్యాంగ విలువలను పర్యవేక్షిస్తూ మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. దేశ ప్రజల హక్కులను పరిరక్షించడం నుంచి దేశ ప్రయోజనాలను కాపాడే వరకూ న్యాయవ్యవస్థ ముందుంటోందని కితాబిచ్చారు. హైకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. భారత సంస్కృతి, విలువలకు శతాబ్ధాలుగా చట్ట నిబంధనలు దిక్సూచీగా ఉన్నాయని అన్నారు. స్వరాజ్య మూలాలు మన స్వాతంత్య్ర పోరాటాన్ని పరిపుష్టం చేశాయని చెప్పారు.