మనస్పర్థలతో మానసికానందం మాయం

COUPLE
COUPLE

మనస్పర్థలతో మానసికానందం మాయం

నేటి రోజుల్ని యాంత్రిక యుగంగా చెప్పుకుంటున్నాం. మనుషుల మధ్య బంధాలు కూడా అంతే యాంత్రికంగా అయిపోతున్నాయని వాపోతున్న వారిని చాలామందినే చూస్తున్నాం. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఆస్తి తగాదాలు కోర్టుల వరకు వెళ్ళటం కూడా ఇప్పుడు ఏమాత్రం విచిత్రం కాదు. అయితే ఒకటి నిజం. అనుబంధాల మధ్య చీలికలు ఎంతగా వచ్చినా కొన్ని బంధాలు కలకాలం నిలుపుకోవాల్సినవి ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవటం, అంతకంటే ముఖ్యంగా ఈ విభేదాల మధ్య మనసు నలిగిపోకుండా కాపాడుకోవటం తప్పనిసరి

దగ్గరివారితో మనస్పర్ధలు వచ్చినపుడు వారితో వ్యవహరించడం చాలా కష్టమైన విషయంగా ఉంటుంది. వారి మీదున్న ప్రేమాప్యాయతలు, వారితో పెనవేసుకున్న భావోద్వేగాలు మరింత ఇరుకున పెడుతుంటాయి. రకరకాల భావాలు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇటువంటపుడు ఎలా ప్రవర్తించాలి అనేది పెద్ద సమస్యగా కనబడుతుంది. అవతలి వారి పట్ల కోపతాపాల్ని ప్రదర్శించాలనీ ఉంటుంది. అదే సమయంలో వారు తమని అర్థం చేసుకుని పూర్వపు బంధం తిరిగి చక్కగా కొనసాగాలనే ఆశా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరి వ్యక్తిత్వం వారు నిలబెట్టుకుంటూ ప్రవర్తించడం కష్టసాధ్యమైన విషయమవుతుంది.

అవతలి వారిపై అనవసరపు కోపతాపాలు ప్రద ర్శించకుండా, తాము లేనిపోని అపరాధ భావనకు గురికాకుండానూ ఉండాలంటే…

ఏ కారణం వల్ల మీ బంధం విచ్ఛిన్నమైనా అందులో మీ పాత్ర ఎంతవరకు ఉందో దానిని అవతలివారికి వివరించండి. మీ తప్పొప్పుల గురించి మరీ ఎక్కువ వివరణ ఇవ్వాల్సిన అవ సరం లేదు. అది పరోక్షంగా పూర్తి తప్పుని మీమీద వేసుకున్నట్టు అవుతుంది.

మాట్లాడుతున్నపుడు అవతలి వ్యక్తి కళ్లలోకి నేరుగా చూడండి. తలవంచుకోవటం, కళ్లు పక్కకు తిప్పుకోవటం వంటివి చేయకండి. మీ మాటతీరుని కూడా సరిచూసుకోండి. మరీ పెద్దగా లేదా మరీ చిన్నగానూ మాట్లాడకండి.

పరస్పర సంభాషణల్లో వ్యక్తిగత దూషణలకు తావివ్వకండి. ఆయా సందర్భాల్లో మీకు నచ్చని అవతలివారి ప్రవర్తన గురించి మాత్రమే మాట్లాడండి. ్య ఇక, మీపట్ల వారి అనుచిత ప్రవర్తనని చెప్పాల్సి వచ్చినపుడు పదిసార్లు నువ్వలా చేసావు. ఇలా చేసావు అంటూ- ‘నువ్వు అనే పదాన్ని ఎక్కువసార్లు ఉపయోగించకండి. అప్పుడు వారి తప్పుల్ని పదేపదే ఎత్తి చూపినట్టు తీవ్రంగా విమర్శించినట్టు అవుతుంది. అలాకాకుండా ఆయా సందర్బాల్లో మీరు ఎదుర్కొన్న బాధలమీద మీ మానసిక వేదన మీద మీ దష్టిని ఉంచండి.

‘ఆ సందర్భంలో నేనింత బాధపడ్డాను. ఆ మాటలు నన్నింత బాధించాయి…ఇలా సాగాలి. అంటే ఇదంతా అవతలివారిమీద ద్వేషంతోనో, పగతోనో అంటున్నది కాదు, మీరు ఎదుర్కొన్న అసౌకర్యాన్ని చెప్పడం మాత్రమే అని అర్థమవ్వాలి.

ఆప్తులతో మీకెంత ఎడబాటు వచ్చినా వారిపట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో మాత్రం తేడా రానివ్వకండి. ఇతర బంధువుల ద్వారానో, స్నేహితులద్వారానో ఆ బాధ్యతలు నిర్వర్తించండి.

ఇరువురి మధ్య బంధాన్ని పునరుద్ధరించే సందర్భాల్లో ఉన్నతంగా ప్రవర్తించండి. మన్నించడం ముఖ్యం ఆయా సంఘటనల వెనుక కారణం ఎవరైనా మీ దక్పథంలో సానుకూల వైఖరి ఉండాలి.

మిమ్మల్ని ఎంతగా బాధించినా ఆయా వ్యక్తుల మీద వ్యక్తిగతద్వేషాన్ని పెంచుకోకండి. మిమ్మల్ని బాధించిన సంఘటనలు అప్పటి వారి ప్రవర్తనని మాత్రమే ఖండించండి. వ్యక్తుల్ని, వారి పనుల్ని వేరు చేసి చూడటం అలవాటు చేసుకోండి.

మిమ్మల్ని వారు నిందించారని బాధపడే ముందు ఒక విషయం గమనించండి. కొన్ని విషయాలకు మిమ్మల్ని బాధ్యుల్ని చేసినట్టే, కొన్ని అననుకూల సందర్భాల్ని తామూ ఎదుర్కొన్నట్టు వారు ప్రకటిస్తున్నారు.

ఈ మనస్పర్థలు అడ్డుపెట్టుకుని ఎప్పటెప్పటివో తప్పొప్పులు తవ్వాలని ప్రయత్నించకండి. ఇది పలచబడుతున్న బంధాన్ని పూర్తిగా తెంపుతుంది. ఆ సందర్భాన్ని, సంఘటనల్ని మాత్రమే ఎత్తిచూపండి.