మనసుంటే సమస్యకు చోటులేదు

CUTE
Lady

మనసుంటే సమస్యకు చోటులేదు

సంసార జీవితంలో కబుర్లు, సరదాలు, హుషారైన సంఘటనలు ఉండి తీరాలి. రెండు బొమ్మలు లాగా ఒక ఇంట్లో గడపటం ఎవ్వరికీ మంచిది కాదు. హాస్యప్రియత్వం గలవారంటే జోకర్‌లు, సినిమాల లోని హాస్యపాత్రల వంటి వారని కాదు అర్థం. సందర్భానుసారంగా ప్రవర్తించి నవ్వించగలిగినవాడు, ఎటువంటి విపరీత పరిస్థితులు ఎదురైనా అందులో నుండి సరదాగా బయటపడగలవారు, బయటపడేయగలవారై ఉండాలి. కేవలం నవ్విస్తూ ఎలాంటి ఇతర తెలివితేటలు లేనివారు తోడుగా ఉండాలని అనుకోరు. మేథోసంపత్తిని, హాస్యప్రియత్వాన్ని కలగలిపి ప్రదర్శించగలిగిన మగవారిని అమ్మాయిలు ఇష్టపడతారు. అలాగే నవ్వు ముఖంతో పల కరించే అమ్మాయిలను అబ్బాయిలు కోరుకుంటారు. ఇలాంటి లక్షణాలున్న జంట మధ్య వివాహబంధం ఆనందంగా సాగుతుంది.

పల్లవి చైనాలో ఎంబిబిఎస్‌ చదువుకుంది. ఆమె చదువుకునే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతడు కూడా అక్కడ ఎంబిబిఎస్‌ చదువుకున్నాడు. ఇద్దరు ఒకే వృత్తి కావడం వల్ల పెళ్లి చేసుకోవాలను నిర్ణయించుకున్నారు. ఎంబిబిఎస్‌ అయిపోయిన తర్వాత, ఇరువ్ఞరి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో పల్లవి తల్లిదండ్రులు అబ్బాయికి భారీఎత్తనే కట్నకానుకల్ని ఇచ్చారు

. వీరిద్దరు హానీమూన్‌కు వెళ్లారు. ఆ సమయంలో హానీమూన్‌ ఖర్చులన్నీ పల్లవే పెట్టుకుంది. అయినా అతడికి, అతడి తల్లిదండ్రులకు ధనదాహం తీరలేదు. డబ్బుకోసం పల్లవిని వేధించసాగారు. పుట్టింటికి కూడా పంపడం మానేసారు. ఒకరోజు మీ అమ్మాయికి బాగలేదని పల్లవి అల్లుడు మామకు ఫోన్‌చేసాడు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూస్తే, పల్లవి శవమైకనిపించింది.

వారి ఆవేదనకు అంతం లేదు. అమ్మాయిని విదేశాల్లో ఉన్నత చదువ్ఞ చదివించి, భారీగా ఖర్చుపెట్టి పెళ్లిచేస్తే ఆమె జీవితం ఇలా అయ్యిందని తల్లిదండ్రులు వాపోయారు. పల్లవి తన భర్తను పెళ్లికిముందు ప్రేమిస్తున్న సమయంలో అతని గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయింది. అతడి బుద్ది, ప్రవర్తన, అబ్బాయి గుణగణాలను గుర్తించలేకపోయింది. పెళ్లై, హానీమూన్‌లోనే అతని నైజం బయటపడింది. చివరికి జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. కన్నవారికి కడుపుకోతే మిగిలింది. నిజమే వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలన్న ఆశ అందరికీ ఉంటుంది. వివాహానికి ముందు ఎన్నెన్నో కలలుకంటారు. కాని నిజజీవితంలో ఆ కలలన్నీ నిజమయ్యేది ఎందరికి.

నేను అనుకున్న తోడు ఇది కాదు అని పెళ్లి తరువాత విచారించి లాభం లేదు. పెళ్లికి ముందే మీరు ఎటువంటి వారిని తోడుగా కోరుకుంటున్నారో, ఏ లక్షణాలు కలవారితో మీ జీవితం ఆనందంగా గడుస్తుందని భావిస్తున్నారో అలాంటి వారిని వెతికి పట్టుకోండి. కొంచెం ఆలస్యంగా వెతుక్కున్నా మిగిలిన జీవితకాలమంతా ఆనందంగా గడుపుతారు. కొంతమందికి తమకు ఏం కావాలో ఎటువంటి తోడు కావాలో తెలియదు. ఆకర్షణ ప్రేమగా భావిస్తారు. పీకల లోతును ప్రేమలో కూరుకుపోయామని భావించి దంపతులవుతారు.

ఎంత వేగంగా ప్రేమలో పడ్డారో అంతే వేగంగా పొరపాటు చేశానని భావిస్తారు. తగిన జీవిత భాగస్వామి దొరకలేదని తెగ కుమిలిపోతారు. ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సంసారం చేసుకునే జంటలను చూసినపుడు వారి ఆనందం వెనకున్న రహస్యం తెల్సుకోవాలని పించడం సహజం.

చక్కని సంసారానికి కావాల్సినది భార్యాభర్తల అవగాహన. ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడం, ఒకరి కోసం మరొకరుగా బతకగలగడం. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో అధికంగా సాగే రోజుల్లో ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం తక్కువే. కాని నేడు ఏరికోరి ఎంచుకునే అవకాశం యువతీ యువకులకు ఉంది. తాము ఎంచుకున్న భాగస్వామితో పెళ్లి జరిపిస్తున్నారు.

పెద్దల ఎంపిక కన్నా పిల్లల ఎంపిక మెరుగ్గా ఉంటుందనే నమ్మకంతో పెద్దలు తమ పద్ధతిని మార్చుకున్నారు. తమకు తాముగా ఎంచుకున్న వారితో కూడా మీరు సుఖంగా కాపురం చేయలేకపోతు న్నారంటే ఆ ఎంపికలో ఏదో లోపం ఉందనుకోవాల్సి వస్తుంది. మీరు కోరుకుంటున్న వారిలో ఎటువంటి లక్షణాలుండాలో స్పష్టంగా తెలియనందువలనే పొరపాట్లు జరుగుతుంటాయి.

అందుకే పెళ్లికి ముందే మీ భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. పెళ్లిచూపుల్లో మొదటిసారిగా ఒకరినొకరు చూసుకున్నప్పుడు నాభాగస్వామి అన్న భావం మనసులో కలిగితే చాలు. అంతడు నా వాడు అన్న భావన అమ్మాయికి, ఆమె నాది అన్న భావం అబ్బాయికి కలగాలి. అది ఒక బంధంలో ముఖ్యం.

అలాంటి భావం కలగాలి కాని కేవలం పెద్దలు చెప్పారనో, అబ్బాయి ఆదాయం, అమ్మాయి అందం బాగున్నాయనో చేసుకుంటే ఆ బంధంలో ఆనందం అంతగా ఉండదు. భార్యాభర్తల బంధం ఏడేడు జన్మల బంధం అని మన పెద్దలు అంటారు.

ఆ గత జన్మల బంధమేనేమో హఠాత్తుగా ఈ జన్మలో మనసులను కలుపుతుంది. వివాహబంధం జీవిత కాలానికి అనేది మన నమ్మకం. విదేశీ సంస్కృతిలో ఉన్న విడాకుల పద్ధతి మనకింకా అంతగా అంటలేదు. కాబట్టి అనేక సంవత్సరాలు కలిసి కాపురం చేయబోయే తోడు మంచితనం నిండినవారై ఉండాలని కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు.

తమకు తామే భాగస్వామిని ఎంచుకునేవారు తాము మనసు పడినవారి మంచితనం గురించి గమనించుకోవాలి. మంచితనానికి కొలబద్ద వారి ప్రవర్తన. స్నేహితులతో ఎలా వ్యవహరిస్తున్నారు. ఎవరిని ఎలా ఆదుకుం టారు, ఎలా సహాయపడతారు వారితో ఎలాంటి మంచి సంబంధాల్ని కొనసాగిస్తారనేది గమనించుకోవాలి. మంచితనం అనేది మానవబంధాలకు పునాది. మంచితనం లేనివారికి ప్రేమ విలువ ఏమిటనేది తెలియదు. ఇదో తమాషా పదం. ఇరువ్ఞరి మధ్య వర్ణనకు అందని ఆకర్షణను కెమిస్ట్రీ అంటారు. ఒకరినొకరు చూసుకోగానే అద్భుతంగా ఆకర్షణ ఏర్పడుతుంది.

ఒకరి పక్కన మరొకరు కూర్చుంటే ఏదో తెలియని విద్యుత్‌ ప్రవహిస్తుంది. అలాంటి వారు దొరికితే మీ జీవితం ఇంక ఆనందమయమే. భార్యాభర్త అంటే ఇద్దరూ ఒకటే…ఒకరిని విడిచి మరొకరు క్షణం ఉండకూడదు అనే పెద్దలు చెప్పే మాటలు కొంతవరకే నిజం. భార్యాభర్తల మధ్య ఎంత ఆత్మీయతానురాగం ఉండాలో అంతే ఎడం అప్పుడప్పుడు అవసరం. దంపతులు భాగస్వాములుగా ఉండాలే కాని ఒకరిమీద మరొకరు పెత్తనం చలాయించకూడదు. జంటలో ఇద్దరికీ బంధువులు, స్నేహితులు, సామాజిక బాధ్యతలు ఉంటాయి.