మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌కే సిఎం పదవి

Kamalnath
Kamalnath

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ వీడింది. సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ (72) వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపింది. రోజంతా ఎడతెగని చర్చలు జరిపిన అనంతరం గురువారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువడింది. రాత్రి పొద్దుపోయాక భోపాల్‌కు చేరుకున్న కమల్‌నాథ్‌కు పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నాక అక్కడే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతగా కమల్‌నాథ్‌ పేరును ప్రకటించారు. సీఎం పదవి కోసం ఆయనతో సమానంగా యువనేత జ్యోతిరాదిత్య సింధియా చివరిక్షణం వరకు పోటీ పడ్డారు. కమల్‌నాథ్‌ ఎంపిక నిర్ణయం వెలువడగానే ఆయన్ని అభినందిస్తూ ఏఐసీసీ ట్వీట్‌ చేసింది. ఛింద్వాడా నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన అనుభవం కమల్‌నాథ్‌కు ఉంది.