మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ చర్యలు

ఈ నెల 21 వరకు ఆయన్ను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని స్పష్టం చేశారు.

అమరావతి: ఏపి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాష్ట్రా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటుంన్నామని ఎస్‌ఈసీ పేర్కొంది.


కాగా, ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ ఆదేశాలలను పాటించి ఏకగ్రీవాలను నిలిపివేస్తే సదరు అధికారులకు బ్లాక్ లిస్ట్‌లో పెడతామని నిన్న మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఏ విషయంలో ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే నిమ్మగడ్డకు మద్దతిచ్చినా, ఆయన చెప్పినట్లు చేసినా మార్చి 31 తర్వాత వారి సంగతి చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పెద్దిరెడ్డి. ఏకగ్రీవమైన పంచాయతీల్లోని అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు.