మంత్రి జ‌మీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Zameer
Zameer

బెంగళూరు: బీజేపీకు ఓట్లు వేసిన వారు ముస్లింలు కారంటూ రాష్ట్ర పౌర ఆహార సరఫరాల శాఖామంత్రి జమీర్‌ అహ్మద్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించి అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎస్‌.శివణ్ణ డిమాండ్‌ చేశారు. శనివారం తుమకూరులో శివణ్ణ మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో కన్నడ సంస్కృతి, సంస్కారానికి పేరుగాంచిందన్నారు. హిందూముస్లింలు సోదరభావంతో జీవిస్తున్నారన్నారు. రెండుమతాల మధ్య చిచ్చుపెట్టేలా మంత్రి జమీర్‌ వ్యాఖ్యానించారని శివణ్ణ ఆరోపించారు. జమీర్‌ అహ్మద్‌ జిన్నా సంతతికి చెందిన వారని మన వారసుడు కాదని అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ రాజకీయ నేతల కారణంగానే దేశంలో జాతీయతను చీల్చే కుట్ర జరుగుతోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రపన్నుతున్న జమీర్‌ అహ్మద్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. జమీర్‌పై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశ విభజన జరిగినప్పుడు మూడుకోట్లు మాత్రమే ఉండే ముస్లింలు ప్రస్తుతానికి 20కోట్లకు చేరారన్నారు.